
ఎటపాక డివిజన్‌లో అటవీ వనాలుకన్నీరు పెడుతున్నాయి. ఒకప్పుడు పచ్చదనంతోకళకళలాడుతున్న ఈ ప్రాంతంలో వనాలు స్మగ్లర్ల గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్నాయి. పచ్చదనంతో కళకళలాడాల్సిన ఈ ప్రాంతాలు కళావిహీనంగా మారుతున్నాయి. స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అటవీశాఖ సిబ్బంది చూసీ చూడనట్టువదిలేస్తున్నారని విలపిస్తున్నాయి.
ఎటపాక: ఎటపాక డివిజన్‌లో అడవులు అంతరించిపోతున్నాయి. ఒక్కప్పుడు టేకు, జిట్రేకు వంటి విలువైన అటవీ వనాలకు నిలయమైన ఈ ప్రాంతంలో ప్రస్తుతం వాటి జాడ కనిపించని పరిస్థితి నెలకొంది. అటవీ సిబ్బందిలో కొంతమంది స్మగ్లర్లకు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ కలప రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నెల్లిపాక జాతీయరహదారి సెంటర్‌లో ఏర్పాటు చేసిన అటవీశాఖ తనిఖీ కేంద్రం మామూళ్ల వసూళ్లకే పరిమితమైందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పక్క రాష్ట్రాలకు..
ఎటపాక, చింతూరు మండలాల అటవీ ప్రాంతంలో 18,046 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్, విజయవాడ తదితర నగరాలకు టేకు కలప రవాణా జరుగుతోంది. తెలంగాణలోని భద్రాచలం పట్టణ కేంద్రంగా కలప తరలింపులో కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. వీరు తెలంగాణ సరిహద్దున ఉన్న ఆంధ్రా పరిధిలోని అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. వీరికి మండలంలోని స్మగ్లర్లు సహకరిస్తుండటంతో విలువైన టేకు కలప పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది.
గోదావరి నదిని దాటించి..
అటవీ కలపను గోదావరి నది దాటించి అక్కడ నుంచి వాహనాల్లో పక్క జిల్లాలకు చేరవేస్తున్నారు. అటవీశాఖలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందితో ముందుగానే చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ అక్రమ రావాణా నిరాటంకంగా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లర్లు టేకు ప్లాంటేషన్లపై కూడా కన్నేశారు. నెల్లిపాక రేంజ్ పరిధిలోని బండిరేవు, మాధవరావుపేట ,ఈడీపల్లి ప్రాంతాల్లోని టేకు ప్లాంటేషన్లలో భారీ టేకు వృక్షాలు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. అడవుల్లో టేకు చెట్లను నరికిన అనంతరం అక్కడనే సైజులుగా కోసి లారీ, కార్లలో విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అక్రమాలను అడ్డుకోలేకపోతున్న చెక్‌పోస్టు
నెల్లిపాక జాతీయ రహదారిలో అటవీ చెక్‌పోస్టు ఉన్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేయకుండా వదిలిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. దీంతో డివిజన్ నుంచి వాహనాల ద్వారా కలపను దర్జాగా తరలించుకుపోతున్నారు.
సిబ్బందిని మేనేజ్ చేస్తూ..
స్మగ్లర్లు,ఫర్నిచర్ తరలించేవారు ముందుగా చెక్‌పోస్టు సిబ్బందిని మేనేజ్ చేసి కలపను చెక్‌పోస్ట్ దాటించి భద్రాచలం చేరవేస్తున్నారు. అక్రమ కలపపై ఎవరైనా ముందస్తు సమాచారం ఇస్తే తప్ప ఇక్కడి సిబ్బంది కలప రవాణాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చెక్‌పోస్టులో సిబ్బందితో పాటు స్మగ్లర్లు అప్పడుప్పుడు చెక్‌పోస్టు వద్ద ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రాత్రి సమయంలో అటవీశాఖకు సంబంధం లేని కొంతమంది వ్యక్తులు చెక్‌పోస్టులో సిబ్బందితో పాటు కనపడుతున్నారు.
స్మగ్లర్లతో చేతులు కలిపి..?
ఇక్కడి అటవీ రేంజ్ పరిధిలో విధులు నిర్వహించే కొంత మంది సిబ్బంది స్మగ్లర్లతో చేతులు కలిపి ఈ కలప అక్రమ రవాణా చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. సిబ్బందికి నెల వారీ మామూళ్లకు ఆశపడి పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. కొందరు పరిమిట్ల ముసుగులో కలప అక్రమ దందా చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అడపా దడపా తనిఖీలు చేస్తున్న సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో కలపను పట్టుకుంటున్నా స్మగ్లర్లు బేరసారాలు సాగించి చక్రం తిప్పుతున్నారు. నెల్లిపాక రేంజ్ పరిధిలో ఒకప్పుడు దట్టమైన అడవులు ఉండేవి. ఇప్పుడు మైదాన ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడి అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ.. పనితీరుకు ఇవి అద్దం పడుతున్నాయి.
చర్యలు తీసుకుంటాం
కలప అక్రమ రవాణాపై దృష్టి సారిస్తాం. అడవుల్లో కలప నరికి అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. నెల్లిపాక చెక్‌పోస్టు వద్ద తనిఖీలు పటిష్టంగా చేపట్టి కలప రవాణాను అరికడతాం.
– కొండలరావు, ఇన్‌చార్జి రేంజర్, నెల్లిపాక
(చదవండి: ఊరుకాని ఊరులో.. ఇది కదా మానవత్వం అంటే!)