forest checkpost
-
అరటికాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్
రాజంపేట: కడప–రేణిగుంట జాతీయరహదారిలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద అరటికాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా అటవీ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని రాజంపేట ఫారెస్టు రేంజర్ నారాయణ శనివారం విలేకరులకు వెల్లడించారు. బొలోరో వాహనంలో అరటికాయల లోడు వస్తుండగా, ఆపి వాహనాలను తనిఖీ చేశామన్నారు. అందులో ఎర్రచందనం దుంగలు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నామన్నారు. దుంగలను వత్తలూరు నుంచి తీసుకువస్తున్నట్లుగా వారు తెలిపారన్నారు. ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచామన్నారు. పట్టుబడినవారిలో రాజంపేట మండలం డీబీఎన్పల్లెకు చెందిన కసిరెడ్డి నాగార్జునరెడ్డి, వత్తలూరుకు చెందిన రెడ్డయ్య, రాయచోటికి చెందిన వెంకటరమణల ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ శ్రీనివాసులు, అటవీ సిబ్బంది అంజనాస్వాతి, సాయికుమార్ పాల్గొన్నారు. -
అటవీ వనం కన్నీరు...గొడ్డలి వేటుకు కనుమరుగవుతున్న పచ్చదనం
ఎటపాక డివిజన్లో అటవీ వనాలుకన్నీరు పెడుతున్నాయి. ఒకప్పుడు పచ్చదనంతోకళకళలాడుతున్న ఈ ప్రాంతంలో వనాలు స్మగ్లర్ల గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్నాయి. పచ్చదనంతో కళకళలాడాల్సిన ఈ ప్రాంతాలు కళావిహీనంగా మారుతున్నాయి. స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అటవీశాఖ సిబ్బంది చూసీ చూడనట్టువదిలేస్తున్నారని విలపిస్తున్నాయి. ఎటపాక: ఎటపాక డివిజన్లో అడవులు అంతరించిపోతున్నాయి. ఒక్కప్పుడు టేకు, జిట్రేకు వంటి విలువైన అటవీ వనాలకు నిలయమైన ఈ ప్రాంతంలో ప్రస్తుతం వాటి జాడ కనిపించని పరిస్థితి నెలకొంది. అటవీ సిబ్బందిలో కొంతమంది స్మగ్లర్లకు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ కలప రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నెల్లిపాక జాతీయరహదారి సెంటర్లో ఏర్పాటు చేసిన అటవీశాఖ తనిఖీ కేంద్రం మామూళ్ల వసూళ్లకే పరిమితమైందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్రాలకు.. ఎటపాక, చింతూరు మండలాల అటవీ ప్రాంతంలో 18,046 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్, విజయవాడ తదితర నగరాలకు టేకు కలప రవాణా జరుగుతోంది. తెలంగాణలోని భద్రాచలం పట్టణ కేంద్రంగా కలప తరలింపులో కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. వీరు తెలంగాణ సరిహద్దున ఉన్న ఆంధ్రా పరిధిలోని అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. వీరికి మండలంలోని స్మగ్లర్లు సహకరిస్తుండటంతో విలువైన టేకు కలప పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. గోదావరి నదిని దాటించి.. అటవీ కలపను గోదావరి నది దాటించి అక్కడ నుంచి వాహనాల్లో పక్క జిల్లాలకు చేరవేస్తున్నారు. అటవీశాఖలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందితో ముందుగానే చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ అక్రమ రావాణా నిరాటంకంగా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లర్లు టేకు ప్లాంటేషన్లపై కూడా కన్నేశారు. నెల్లిపాక రేంజ్ పరిధిలోని బండిరేవు, మాధవరావుపేట ,ఈడీపల్లి ప్రాంతాల్లోని టేకు ప్లాంటేషన్లలో భారీ టేకు వృక్షాలు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. అడవుల్లో టేకు చెట్లను నరికిన అనంతరం అక్కడనే సైజులుగా కోసి లారీ, కార్లలో విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోలేకపోతున్న చెక్‌పోస్టు నెల్లిపాక జాతీయ రహదారిలో అటవీ చెక్‌పోస్టు ఉన్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేయకుండా వదిలిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. దీంతో డివిజన్ నుంచి వాహనాల ద్వారా కలపను దర్జాగా తరలించుకుపోతున్నారు. సిబ్బందిని మేనేజ్ చేస్తూ.. స్మగ్లర్లు,ఫర్నిచర్ తరలించేవారు ముందుగా చెక్‌పోస్టు సిబ్బందిని మేనేజ్ చేసి కలపను చెక్‌పోస్ట్ దాటించి భద్రాచలం చేరవేస్తున్నారు. అక్రమ కలపపై ఎవరైనా ముందస్తు సమాచారం ఇస్తే తప్ప ఇక్కడి సిబ్బంది కలప రవాణాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చెక్‌పోస్టులో సిబ్బందితో పాటు స్మగ్లర్లు అప్పడుప్పుడు చెక్‌పోస్టు వద్ద ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రాత్రి సమయంలో అటవీశాఖకు సంబంధం లేని కొంతమంది వ్యక్తులు చెక్‌పోస్టులో సిబ్బందితో పాటు కనపడుతున్నారు. స్మగ్లర్లతో చేతులు కలిపి..? ఇక్కడి అటవీ రేంజ్ పరిధిలో విధులు నిర్వహించే కొంత మంది సిబ్బంది స్మగ్లర్లతో చేతులు కలిపి ఈ కలప అక్రమ రవాణా చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. సిబ్బందికి నెల వారీ మామూళ్లకు ఆశపడి పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. కొందరు పరిమిట్ల ముసుగులో కలప అక్రమ దందా చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అడపా దడపా తనిఖీలు చేస్తున్న సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో కలపను పట్టుకుంటున్నా స్మగ్లర్లు బేరసారాలు సాగించి చక్రం తిప్పుతున్నారు. నెల్లిపాక రేంజ్ పరిధిలో ఒకప్పుడు దట్టమైన అడవులు ఉండేవి. ఇప్పుడు మైదాన ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడి అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ.. పనితీరుకు ఇవి అద్దం పడుతున్నాయి. చర్యలు తీసుకుంటాం కలప అక్రమ రవాణాపై దృష్టి సారిస్తాం. అడవుల్లో కలప నరికి అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. నెల్లిపాక చెక్‌పోస్టు వద్ద తనిఖీలు పటిష్టంగా చేపట్టి కలప రవాణాను అరికడతాం. – కొండలరావు, ఇన్చార్జి రేంజర్, నెల్లిపాక (చదవండి: ఊరుకాని ఊరులో.. ఇది కదా మానవత్వం అంటే!) -
Timber Smuggling: కలపకు కాళ్లు ! .. నదుల మీదుగా
ఒకప్పుడు దండకారణ్యంగా ఉన్న మహదేవపూర్ అడవులు ప్రస్తుతం పలుచబడ్డాయి. కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న కలప రవాణా మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు కలప అక్రమంగా తరలివస్తుంది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో కలపకు కాళ్లు వచ్చాయనే చందంగా తయారైంది. ఆయా రాష్ట్రాల నుంచి విలువైన వృక్ష సంపద కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం వంతెనల మీదుగా తెలంగాణలోని భూపాలపల్లి, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల పట్టణాలకు యథేచ్ఛగా తరలిపోతున్నట్లు తెలిసింది. రూ.లక్షల్లో వ్యాపారం సాగుతున్నప్పటికీ అటవీశాఖ అధికారులు మొద్దునిద్ర వీడడం లేదు. కానీ ఎక్కడా అటవీశాఖ చెక్‌పోస్టులు లేకపోవడంతో అక్కమార్కులకు ఆడిందే ఆట పాడిండే పాటగా తయారైందని విమర్శలు ఉన్నాయి. – కాళేశ్వరం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విలువైన టేకు వృక్ష సంపద అపారంగా ఉంది. కానీ అక్కడ విలువ తక్కువగా ఉండడంతో అక్రమార్కులు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల సరిహద్దుల నుంచి కలప వ్యాపారం జోరుగా చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన మీదుగా రాత్రి వేళల్లో కలప తరలివస్తుంది. అవతలి వైపు సిరొంచ వద్ద మహారాష్ట్ర చెక్‌పోస్టు ఉంది. అక్కడి సిబ్బందిని మచ్చిక చేసుకొని కలపను టాటా ఏసీ, వ్యాను, లారీల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ మీదుగా కలప తరలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు వంతెనలు దాటి అన్నారం బ్యారేజీ మీదుగా కలప పట్టణాలకు తరలిపోతుంది. కానీ ఎక్కడా ఈ మూడు వంతెనల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం రూ.లక్షల విలువైన టేకు తరలిపోతుందని తెలిసింది. రాత్రి వేళల్లో నిఘా తగ్గడంతో.. ఇలా కలప వ్యాపారం జరుగుతున్నా అధికారులు అటువైపు చూడడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సిరొంచ వద్ద తెలంగాణలోని కొంత మంది స్మగ్లర్లు కొన్ని సందర్భాల్లో టాటా ఏసీ వాహనాల్లో తరలిస్తూ లక్షల విలువైన కలపతో అక్కడి అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణం.. తెలంగాణ వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం జోరందుకుంది. దానికి అనుగుణంగా గృహాల యజమానులు కలపను కొనుగోలు చేస్తున్నారు. కలప స్మగ్లర్లు రూ. 5–6వేల వరకు 6 ఫీట్ల పొడవు, ఆరు ఇంచుల వెడల్పు గల (దుంగ) కలపకు తీసుకొంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో రూ.2500–3200 వరకు కొనుగోలు చేస్తూ దండుకుంటున్నారు. ఇళ్లలో దర్వాజలు, తలుపులు, కిటికీలతో పాటు ఇంటికి సంబంధించి ఫర్నిచర్ కోసం కలపను తరలిస్తున్నారు. మహదేవపూర్, పలిమెల మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగరీత్యా పనిచేసి బదిలీ అయ్యే సందర్భంలో కూడా లక్షల విలువైన పర్నిచర్‌ను తయారు చేయించుకొని అనుమతులు లేకుండా తరలిపోతున్నారు. వారిపైన కూడా నిఘా లేదని తెలిసింది. అటవీశాఖ అధికారులు మాత్రం కలపను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. వంతెనల వద్ద చెక్‌పోస్టుల ఏర్పాటులో జాప్యం ఎందుకు ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదని సామాన్య ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయమై మహదేవపూర్ ఎఫ్డీఓ వజ్రారెడ్డిని ఫోన్లో సంప్రదించగా.. మా రేంజ్ పరిధిలో అటవీశాఖ సిబ్బంది లేరన్నారు. చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని పై అధికారులకు నివేదిక పంపాం. మహారాష్ట్ర నుంచి కలప వస్తే మా సిబ్బంది పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. నదుల మీదుగా.. అప్పుడప్పుడు వంతెనల నుంచి కాకుండా అధికారులను రూటు మార్చేందుకు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల మీదుగా టేకు తెప్పలుగా కట్టి తరలిస్తున్నారు. ఇలా తెప్పల ద్వారా తెచ్చిన కలపను పలిమెల, మహదేవపూర్, కాళేశ్వరం మండలాల నుంచి, అటు ఏటూరునాగారం మీదుగా కూడా ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తనిఖీల్లో దొరికేటివి కొన్ని మాత్రమే.. విలువైన టేకు మాత్రం అధికారుల కళ్లు గప్పి అందకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. -
చెక్‌పోస్టులో అటవీశాఖ జలగలు
ఆత్మకూరురూరల్ : నెల్లూరుపాళెం సెంటర్లోని చెక్‌పోస్ట్‌లో అటవీశాఖ జలగల్లా జనాన్ని దోచుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆత్మకూరు పరిసరాల నుంచి కలప కర్రను కొనుగోలు చేసి నెల్లూరుకు తరలించే ఓ వ్యాపారికి అటవీశాఖ చెక్‌పోస్టు సిబ్బందితో చుక్క ఎదురైంది. కొన్ని నెలలుగా సురేష్ కర్ర కొనుగోలు వ్యాపారం చేస్తున్నాడు. అందుకు అన్ని అనుమతులున్నా కలప వాహనం చెక్‌పోస్టు దాటి వెళ్లాలంటే మామూళ్లు ఇచ్చుకోక తప్పడం లేదని వాపోయాడు. పర్మిట్ తేదీ రాత్రి 12 గంటల అనంతరం అయిపోయిందంటూ పలుమార్లు తన వద్ద అధికంగా సొమ్ము వసూలు చేశారని బాధితుడు వాపోయాడు. ఎంతో కొంత ముట్టజెప్పి పోతున్నా.. మరింత ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. ఓ దశలో చెక్‌పోస్టు ఆఫీసు నుంచి వ్యాపారిని అక్కడి సిబ్బంది బయటకు గెంటి వేయడంతో వాగ్వాదం జరిగింది. దీంతో పలువురు గుమికూడటంతో వ్యాపారి మద్యం మత్తులో తమపై దౌర్జన్యం చేస్తున్నాడని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. ఈ విషయమై ఫారెస్ట్ రేంజర్ రామకొండారెడ్డిని సంప్రదించగా సిబ్బంది చెప్పినట్టే చెప్పడం గమనార్హం.