చెక్‌పోస్టులో అటవీశాఖ జలగలు
ఆత్మకూరురూరల్ : నెల్లూరుపాళెం సెంటర్‌లోని చెక్‌పోస్ట్‌లో అటవీశాఖ జలగల్లా జనాన్ని దోచుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆత్మకూరు పరిసరాల నుంచి కలప కర్రను కొనుగోలు చేసి నెల్లూరుకు తరలించే ఓ వ్యాపారికి అటవీశాఖ చెక్‌పోస్టు సిబ్బందితో చుక్క ఎదురైంది. కొన్ని నెలలుగా సురేష్ కర్ర కొనుగోలు వ్యాపారం చేస్తున్నాడు. అందుకు అన్ని అనుమతులున్నా కలప వాహనం చెక్‌పోస్టు దాటి వెళ్లాలంటే మామూళ్లు ఇచ్చుకోక తప్పడం లేదని వాపోయాడు. పర్మిట్ తేదీ రాత్రి 12 గంటల అనంతరం అయిపోయిందంటూ పలుమార్లు తన వద్ద అధికంగా సొమ్ము వసూలు చేశారని బాధితుడు వాపోయాడు. ఎంతో కొంత ముట్టజెప్పి పోతున్నా.. మరింత ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. ఓ దశలో చెక్‌పోస్టు ఆఫీసు నుంచి వ్యాపారిని అక్కడి సిబ్బంది బయటకు గెంటి వేయడంతో వాగ్వాదం జరిగింది. దీంతో పలువురు గుమికూడటంతో వ్యాపారి మద్యం మత్తులో తమపై దౌర్జన్యం చేస్తున్నాడని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. ఈ విషయమై ఫారెస్ట్ రేంజర్ రామకొండారెడ్డిని సంప్రదించగా సిబ్బంది చెప్పినట్టే చెప్పడం గమనార్హం.