
ఇచ్చోడ(బోథ్): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మం డలం చించోలి ఎక్స్‌రోడ్డు వద్ద శనివారం రాత్రి కలప స్మగ్లర్లు అటవీ అధికారులపై దాడి చేశారు. ఈ సంఘటనలో టైగర్‌జోన్ ఎఫ్‌ఆర్వో వాహబ్ అహ్మద్, బేస్‌క్యాంప్ ఉద్యోగి శంకర్ గాయపడ్డారు. ఎఫ్‌ఆర్వో వాహబ్ అహ్మద్ సిబ్బందితో కలసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సిరిచెల్మ అటవీ ప్రాంతంలో కొందరు మూడు ఎడ్లబండ్లలో టేకు దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నారు. వాటిని ఇచ్చోడ అటవీ కార్యాలయానికి తరలిస్తుండగా చించోలి ఎక్స్‌రోడ్డు వద్ద కలప స్మగ్లర్లు కాపుకాసి అటవీ అధికారులపై ఒక్కసారిగా దాడి చేశారు. ఎడ్లబండ్లను తీసుకెళ్లిపోయారు. ఎఫ్‌ఆర్వో ఫిర్యాదు మేరకు గుండాల గ్రామానికి చెందిన అఫ్సర్, అలీంలతోపాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుల్లయ్య తెలిపారు.