పొదలకూరు: జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ జీ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్, డక్కిలి, పొదలకూరు, వరికుంటపాడు ఎస్సైలు దాడులు నిర్వహించి శనివారం రూ. 11 లక్షల విలువైన 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. పొదలకూరు సర్కిల్ కార్యాలయంలో సీఐ ఏ శివరామకృష్ణారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆత్మకూరు డీఎస్పీ వివరాలు వెల్లడించారు.
శనివారం పొదలకూరు, డక్కిలి, వరికుంటపాడు ఎస్సైలు అల్లూరు జగత్‌సింగ్, మరిదినాయుడు, ముత్యాలరాజు ఏకకాలంలో రహదారుల్లో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో దుంగలు తరలిస్తున్న స్మగ్లర్లు పోలీసులను వాహనంతో ఢీకొట్టించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు తప్పించుకుని తమ వాహనాల్లో కారును వెంటాడి పట్టుకున్నారు. కారులో తనిఖీ చేయగా 12 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. దుంగలతో పాటు కారు, సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం సేలం, నెల్లూరు, రాపూరు మండలాలకు చెందిన వారిగా గుర్తించారు.
డక్కిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చలంచర్ల అక్కయ్య(గోనుపల్లి), బండి ఏడుకొండలు (నెల్లూరు నగరం, నవాబుపేట), వరికుంటపాడు పీఎస్ పరిధిలో గుంజి రత్నయ్య (గోనుపల్లి), పొదలకూరు పీఎస్ పరిధిలో సత్యరాజు (తమిళనాడు, సేలం జిల్లా), గిలకా నాగరాజు (గోనుపల్లి)లను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. స్మగ్లర్ల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. గతేడాది రూ.16 కోట్ల విలువైన 16.32 టన్నుల దుంగలను పట్టుకున్నట్టు చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. సమాచారం తెలియజేయాలనుకున్న వారు 93907 77727 పోలీస్ వాట్స్‌యాప్ నంబరుకు పెట్టవచ్చునన్నారు.
ఎర్రచందనం కేసులో నిందితుడి అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): ఎర్రచందనం కేసులో నిందితుడిని మూడోనగర పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని ఏబీఎం కాంపౌండ్‌లో నివాసముంటున్న విశ్రాంత పోలీసు ఉద్యోగి సుధాకర్ ఇంటిపై 2015 సెప్టెంబర్ 3న తిరుపతి, నెల్లూరు టాస్క్‌ఫోర్సు పోలీసులు దాడి చేశారు. అతని ఇంట్లో సుమారు రూ.2 లక్షలు విలువ చేసే 120 కేజీల 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆంతోని, జాని, భరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితుడైన ప్రసాద్ అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం నిందితుడు ప్రసాద్ కాకుటూరులోని తన రెండో భార్య అంకమ్మ ఇంట్లో ఉన్నాడన్న సమాచారం మూడో నగర ఇన్‌స్పెక్టర్ బి. పాపారావుకు అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి ఇంటిపై దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment