podalakuru
-
ఎడ్లంటే ప్రేమ.. పోటీలకు సై..
పొదలకూరు: ఆ యువకుడికి వ్యవసాయమన్నా, పశువుల పెంపకమన్నా ప్రాణం. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నా.. మనసంతా ఎడ్లపైనే ఉండేది. ఆ మమకారంతోనే రెండు కోడె దూడలను కొనుగోలు చేసి వాటికి రాముడు, భీముడు అని ముద్దుగా పేర్లు పెట్టుకుని పిలుస్తున్నాడు. అవి ఇప్పుడు పెద్దవయ్యాయి. రాష్ట్రస్థాయి ఎడ్ల పందేల్లో (బండ లాగుడు) పాల్గొని అవి ప్రథమ స్థానంలో నిలవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాడు.ఆలనాపాలనకు ప్రత్యేకంగా ఒకరు కోడెదూడలను కొనుగోలు చేసిన నాటి నుంచి వాటి ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వాటిని రాముడు, భీముడు అనే పేర్లతో మా కుటుంబమంతా పిలుచుకుంటున్నాం. వాటి ఆలనాపాలనకు నెల జీతం ఇచ్చి ఓ మనిషిని కూడా ఏర్పాటు చేశాను. చెబితే అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ వాటి పోషణకు నిత్యం రూ.2 వేలు వరకు ఖర్చు చేస్తున్నాను. పశుగ్రాసంతోపాటు ఉలవలు, జొన్నలు కూడా పెడుతున్నాం. నేను కోడెలను కొని మూడేళ్లయింది. వాటి వయసు ఇప్పుడు నాలుగేళ్లు. పోటీలకు సిద్ధం చేసే ఉద్దేశంతో శిక్షణ ఇప్పిస్తున్నాను. తోటలోనే పరుగులు తీయించి అలసటను తట్టుకునేలా అలవాటు చేస్తున్నాను. పశువైద్యుల సలహాలు సూచనలు తీసుకుని వాటి ఆరోగ్యంపై పరీక్షలు కూడా చేయిస్తున్నాను. ఏదో తెలియని వెలితి ఆ యువకుడి పేరు బుధవరపు ప్రతాప్. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీ ముత్యాలపేట గ్రామం. సాక్షి అతడిని పలుకరించగా ఏం చెప్పారంటే... మాది వ్యవసాయ కుటుంబం. నేను కావలి విట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో చదివాను. ఐదేళ్ల క్రితం హైదరాబాద్ హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాను. కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోమ్‌లో భాగంగా ఇంటి నుంచే పనిచేసేవాడిని.చదవండి: సింహపురి ‘కోడల్లుళ్లు’ వచ్చేశారోచ్!ఉద్యోగంలో జీతం బాగానే వస్తున్నా ఏదో తెలియని వెలితి ఉండేది. తాత, తండ్రుల నుంచి పోషిస్తున్న ఎడ్లపై అభిలాష కలిగింది. ఒంగోలు జాతికి చెందిన కోడెలు కొనుగోలు చేసి పోషించాలని భావించి మా నాన్న పెంచలయ్యతో చెప్పాను. దానికి ఆయన మొదట సందేహించినా నా ఇష్టాన్ని కాదనలేదు. తండ్రి సహకారంతో వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో 8 నెలల వయస్సు ఉన్న దూడను రూ.80 వేలు వెచ్చించి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏడాది వయసున్న దూడను రూ.లక్ష వెచ్చించి కొన్నాను. ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నా రాముడు, భీముడుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తే రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీల్లో రాణిస్తాయని నమ్మకంగా ఉంది. ఇందుకోసం నెలకు రూ.30 వేలు వెచ్చించి వైఎస్సార్ జిల్లా చెన్నూరులో నెల కిందటే శిక్షకుడి వద్ద వదిలిపెట్టాను. ప్రతినిత్యం వాటిని వీడియోకాల్‌లో చూసుకుంటూ శిక్షణకు ఎలా సహకరిస్తున్నాయో తెలుసుకుంటున్నాను. నా ఎడ్ల గురించి తెలిసిన కొందరు రైతులు మంచి ధరతో కొనుగోలు చేస్తామని ముందుకొచ్చినా నేను ససేమేరా అన్నాను. బండలాగుడు పోటీల్లో అవి ప్రథమ స్థానంలో నిలవడమే నా లక్ష్యం. -
రాష్ట్రానికి మంత్రి అయినా మీ ఇంట్లో బిడ్డనే: కాకాణి
సాక్షి, నెల్లూరు(పొదలకూరు): రాష్ట్ర మంత్రిగా ఎన్ని బాధ్యతలు ఉన్నా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని మంత్రి కాకాణి వెల్లడించారు. ఎన్ని జన్మలెత్తినా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనని, నా రాజకీయ గురువు తన తండ్రి కాకాణి రమణారెడ్డి అయితే, రాజకీయ భిక్ష పెట్టింది మాత్రం సర్వేపల్లి ప్రజలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరులో శనివారం మంత్రికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ పౌర సన్మానం చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి సభాస్థలి పంచాయతీ బస్టాండ్ వరకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కాకాణి మాట్లాడుతూ తాను ఈ స్థాయిలో ఉన్నానంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహమే అన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేని చేసిన సర్వేపల్లి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు. రాష్ట్రానికి మంత్రి అయినా మీ ఇంట్లో బిడ్డనేనని, ప్రజలు నేరుగా తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పొదలకూరు మండల కార్యకర్తలు తనకు సన్మానం చేయడమంటే ఇంట్లో బిడ్డను సత్కరించినట్టుగా తనకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. వీలైతే తానే ప్రతి ఒక్కరిని సన్మానిస్తానన్నారు. సభకు హాజరైన జనం రైతు సంక్షేమానికి కృషి సీఎం అండదండలతో తనకు కేటాయించిన శాఖలకు వన్నె తేవడంతో పాటు రైతుల సంక్షేమానికి పాటు పడతానన్నారు. రైతులకు వచ్చే నెలలో 3 వేల ట్రాక్టర్లు, హార్వెస్టింగ్ యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ పైపులు సబ్సిడీతో అందజేస్తామన్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా గ్రామాల్లో రోడ్లు నిర్మించేందుకు రూ.1,079 కోట్లు కేటాయించామన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో ఎక్కడా మట్టి రోడ్డు అనేది లేకుండా చేస్తానని, మరో ఆరు నెలల్లో పంచాయతీరాజ్ రోడ్ల స్వరూపం మారుస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.28 కోట్లతో ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. గ్రామాల్లో రూ.300 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లను పూర్తిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. అభిమానులు గజమాలలు, శాలువలతో మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుబ్బరాయుడు, వైస్ ఎంపీపీలు వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, సోమా అరుణ, సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, ఏఎంసీ చైర్మన్ పెదమల్లు రత్నమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, వాకాటి శ్రీనివాసులురెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, రావుల దశరథరామయ్యగౌడ్, నువ్వుల మంజుల, సర్పంచ్ చిట్టెమ్మ, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
దర్గాలో సమాధి కదులుతోంది..!
సాక్షి, పొదలకూరు (నెల్లూరు): పొదలకూరుకు సమీపంలోని లింగంపల్లి వద్ద మాసుంసా వలీ దర్గా సమాధి కదులుతోందనే పుకార్లతో వందల సంఖ్యలో జనాలు బుధవారం రాత్రి దర్గా వద్దకు చేరుకున్నారు. అక్కడే గంటల తరబడి వేచి ఉన్న భక్తులు సమాధి నిజంగానే కదులుతోందని చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి చెప్పడంతో ఈ విషయం దావానలంగా వ్యాపించింది. రెండు రోజుల క్రితం ఇక్కడి దర్గాలో భక్తులు వైభవంగా గంధమహోత్సవం నిర్వహించారు. లింగంపల్లి, పొదలకూరు తదితర గ్రామాల భక్తులు గంధమహోత్సవంలో పాల్గొన్నారు. గంధమహోత్సవం పూర్తయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో మహిమతోనే సమాధి కదులుతున్నట్టు భక్తులు అభిప్రాయపడుతున్నారు. సాయంత్రం వేళ పెద్దగా అరుపులు వినపడినట్టు కొం దరు తెలిపారు. అయితే సమాధిపై పరచిన బట్టల కిందకు పురుగులు లేదా విషకీటకాలు చేరి కదులుతున్నాయనే అనుమానాన్ని కొందరు యువకులు వ్యక్తం చేశారు. -
ఆస్తులు అమ్ముకుని ప్రజాసేవ చేస్తున్నా
సాక్షి, పొదలకూరు: ఆస్తులు అమ్ముకుని ప్రజాసేవ చేస్తున్నానని, రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారాలు చేసుకుని సంపాదించానని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం పట్టణంలోని కాకాణి రమణారెడ్డి నగర్‌కు చెందిన 48 కుటుంబాల వారు టీడీపీని వీడి ఎమ్మెల్యే కాకాణి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమిరెడ్డి తనను ధనవంతుడిగా చిత్రీకరించి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంపాదించినట్టుగా మాట్లాడుతున్నట్టు తెలిపారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లో తాను సమర్పించిన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్, ఈ ఎన్నికల్లో సమర్పించబోయే అఫిడవిట్లో ఆస్తులను పరిశీలించాలని సూచించారు. ఏ మేరకు తన ఆస్తులు కరిగిపోయాయో తెలుస్తుందన్నారు. సోమిరెడ్డి మాదిరిగా తాను రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకుని ధనార్జన చేయడం లేదన్నారు. అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడుతూ రూ.కోట్ల ఆస్తులను కూడబెట్టినట్టు ఆరోపించారు. ధన బలంతో తనపై విజయం సాధించాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు ఓటుకు ఎంత ఇచ్చినా తీసుకుని మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాల్సిందిగా సూచించారు. తాను కార్యకర్తల పట్ల వ్యవహరిస్తున్న తీరు, సమస్యలపై స్పందిస్తున్న విధానంతో తనకు కార్యకర్తలు దగ్గరవుతున్నారని తెలిపారు. మండలంలో కండలేరు ఎత్తిపోతల, ఎన్టీయార్ శుద్ధినీరు పథకాలు అమలు చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమైనట్టు విమర్శించారు. అవినీతికి పాల్పడడంతోనే ఇలాంటి పథకాలు నీరుగారిపోయినట్టు తెలిపారు. అంజాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరిక పట్టణంలోని కాకాణి రమణారెడ్డి నగర్లో నివాసం ఉంటున్న టీడీపీకి చెందిన 48 కుటుంబాల వారు మండల కో–ఆప్షన్ సభ్యుడు ఎస్కే అంజాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాకాణి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన మహిళల్లో కొందరు మాట్లాడుతూ ఈనెల 13వతేదీ మంత్రి సోమిరెడ్డి సమక్షంలో తాము బలవంతంగా టీడీపీ కండువాలు వేసుకోవాల్సి వచ్చిందన్నారు. తమ మనస్సుల్లో మాత్రం కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జగన్ ఉన్నారని, తాము వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని వెల్లడించారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. చిట్టేటి సుబ్బమ్మ, షేక్ యాస్మిర్, భోజనపు నాగమ్మ, బండి ఐశ్వరమ్మ, మద్దిలి భాగ్యమ్మ, అలుపూరు రాజేశ్వరి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీకోనం చినబ్రహ్మయ్య, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మహిళా విభాగం ఇన్చార్జి తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ సభ్యులు కండే సులోచన, ఎస్కే అంజాద్, నాయకులు వాకాటి శ్రీనివాసులురెడ్డి, మారు వెంకట్రామిరెడ్డి, ఎం.శేఖర్‌బాబు, పెదమల్లు శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
పదోతరగతి విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అమానుషం
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని పొదలకూరులో దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని గర్భం దాల్చడంతో ఆలస్యంగా ఆటో డ్రైవర్ దురాగతం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొదలకూరులోని ఒక పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికకు బంధువైన ఆటోడ్రైవర్ పవన్ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. కొంతకాలం లైంగికదాడి చేయడంతో ఆమె గర్భం దాల్చింది. విద్యార్థిని తండ్రి బయటి ప్రాంతానికి వెళ్లి కూలీ పనులు చేసుకుంటుండగా తల్లి పట్టణంలోనే పనిచేసుకుని జీవిస్తోంది. బాలిక గర్భం దాల్చి ఏడో నెల వచ్చే వరకు ఇంట్లో తల్లి కూడా తెలుసుకోలేకపోయింది. బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు అవివాహితుకావడం, ఒకరికొకరు బంధువులు అయినందున వివాహం జరిపించేందుకు పెద్దలు మధ్యస్తం చేసేందుకు ప్రయత్నించారు. మధ్యస్తం కుదరకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థినిని వైద్యపరీక్షల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. హెడ్‌కానిస్టేబుల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మగౌరవం కాపాడేందుకే రాజీనామా
పొదలకూరు: ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు ఆర్అండ్బీ అతిథిగృహంలో శని వారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్æ ప్రజలం దరూ రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలను కీర్తిస్తున్నట్టు తెలి పారు. టీడీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి దొంగ దీక్షలు చేస్తూ, పూటకో మాట, రోజుకో ఎత్తుగడతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పి.మిథున్‌రెడ్డి ప్రత్యేకహోదా కోసం తమ పదవులను తృణప్రాయంగా త్యజించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్నాళ్లు ప్రత్యేక హోదా అంశాన్ని నీరు గార్చి, ఇప్పుడు ఎంపీ ల రాజీనామాలపై తన మంత్రులతో ఎదురు దాడి చేయించేందుకు యత్నిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాను సజీవంగా ఉంచిన ఘనత వైఎస్సార్ సీపీకే దక్కుతుందని స్పష్టం చేశారు. యుద్ధం, స్నేహం సోమిరెడ్డికి బాగా తెలుసు యుద్ధం చేయాలన్నా, స్నేహం చేయాలన్నా టీడీపీకే తెలుసని మం త్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్యే కాకాణి తిప్పికొట్టారు. కాంట్రాక్టర్లు, మిల్లర్లు ముడుపులు ఇవ్వకుంటే యుద్ధం చేయడం, ముడుపులు చెల్లింస్తే స్నేహం చేయడం ఆయనకు మామూలేనన్నారు. నాలుగు పర్యాయాలు వరుసగా ఓటమి చవిచూసి, దొడ్డిదారిన మంత్రైన సోమిరెడ్డికి ప్రజల ఓట్లతో వచ్చిన పదవి విలువ తెలియదన్నారు. రాజీనామా చేసిన ఎంపీలను జీతాలు వదులుకున్నారని సోమిరెడ్డి అవహేళన చేయడాన్ని చూస్తే ఆయన జన్మలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదన్నారు. జేబులు నింపుకోవడం తప్ప ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి తెలియని నాయకుడికి తమ ఎంపీల త్యాగాన్ని విమర్శించే నైతికత లేదన్నారు. సమావేశంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ కండే సులోచన, పలుకూరు పోలిరెడ్డి పాల్గొన్నారు. -
12 ఎర్రచందనం దుంగల పట్టివేత
పొదలకూరు: జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ జీ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్, డక్కిలి, పొదలకూరు, వరికుంటపాడు ఎస్సైలు దాడులు నిర్వహించి శనివారం రూ. 11 లక్షల విలువైన 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. పొదలకూరు సర్కిల్ కార్యాలయంలో సీఐ ఏ శివరామకృష్ణారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆత్మకూరు డీఎస్పీ వివరాలు వెల్లడించారు. శనివారం పొదలకూరు, డక్కిలి, వరికుంటపాడు ఎస్సైలు అల్లూరు జగత్సింగ్, మరిదినాయుడు, ముత్యాలరాజు ఏకకాలంలో రహదారుల్లో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో దుంగలు తరలిస్తున్న స్మగ్లర్లు పోలీసులను వాహనంతో ఢీకొట్టించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు తప్పించుకుని తమ వాహనాల్లో కారును వెంటాడి పట్టుకున్నారు. కారులో తనిఖీ చేయగా 12 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. దుంగలతో పాటు కారు, సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం సేలం, నెల్లూరు, రాపూరు మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. డక్కిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చలంచర్ల అక్కయ్య(గోనుపల్లి), బండి ఏడుకొండలు (నెల్లూరు నగరం, నవాబుపేట), వరికుంటపాడు పీఎస్ పరిధిలో గుంజి రత్నయ్య (గోనుపల్లి), పొదలకూరు పీఎస్ పరిధిలో సత్యరాజు (తమిళనాడు, సేలం జిల్లా), గిలకా నాగరాజు (గోనుపల్లి)లను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. స్మగ్లర్ల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. గతేడాది రూ.16 కోట్ల విలువైన 16.32 టన్నుల దుంగలను పట్టుకున్నట్టు చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. సమాచారం తెలియజేయాలనుకున్న వారు 93907 77727 పోలీస్ వాట్స్‌యాప్ నంబరుకు పెట్టవచ్చునన్నారు. ఎర్రచందనం కేసులో నిందితుడి అరెస్ట్ నెల్లూరు (క్రైమ్): ఎర్రచందనం కేసులో నిందితుడిని మూడోనగర పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని ఏబీఎం కాంపౌండ్‌లో నివాసముంటున్న విశ్రాంత పోలీసు ఉద్యోగి సుధాకర్ ఇంటిపై 2015 సెప్టెంబర్ 3న తిరుపతి, నెల్లూరు టాస్క్ఫోర్సు పోలీసులు దాడి చేశారు. అతని ఇంట్లో సుమారు రూ.2 లక్షలు విలువ చేసే 120 కేజీల 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆంతోని, జాని, భరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితుడైన ప్రసాద్ అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం నిందితుడు ప్రసాద్ కాకుటూరులోని తన రెండో భార్య అంకమ్మ ఇంట్లో ఉన్నాడన్న సమాచారం మూడో నగర ఇన్స్పెక్టర్ బి. పాపారావుకు అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి ఇంటిపై దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
ఏడాదిలోపే పొదలకూరులో వైమానిక నిఘా వ్యవస్థ
పొదలకూరు (నెల్లూరు): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మరుపూరు గ్రామ ప్రభుత్వ భూముల్లో భారత వైమానిక నిఘా వ్యవస్థ (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) ను ఈ ఏడాదిలోనే ఏర్పాటు చేస్తామని చెన్నై ఎయిర్పోర్ట్ ఇన్చార్జి రాజేష్ తెలిపారు. స్థానిక తహశీల్దారు కృష్ణారావుతో కలిసి మంగళవారం ఎయిర్‌ఫోర్స్‌కు కేటాయించిన భూములను రాజేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 67 ఎకరాలను తాము అధికారికంగా బుధవారం స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. 2010లో ఈ ప్రాంతంలో రాడార్ కేంద్రం ఏర్పాటుకు భూములను కేటాయించినప్పటికీ, స్వాధీనం చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత పనులను వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. ఎయిర్‌ఫోర్స్‌కు ముందుగా 67 ఎకరాలను స్వాధీనం చేస్తామని తహశీల్దారు కృష్ణారావు వెల్లడించారు. మిగిలిన భూములు కోర్టు పెండింగ్‌లో ఉన్నందున తర్వాత అప్పగిస్తామన్నారు. -
వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా పోలింగ్
పొదలకూరు, న్యూస్‌లైన్ : సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా పోలింగ్ జరిగినట్టు ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కుటుంబ సమేతంగా తోడేరులో శుక్రవారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం పొదలకూరు పార్టీ కార్యాలయంలో కాకాణి పోలింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుని విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గలో ఫ్యాన్‌గాలి వీస్తున్నట్టు తెలిపారు. ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలను తమ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. గత పంచాయతీ ఎన్నికలతో పోల్చిచూస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం పెరిగిందన్నారు. అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. పొదలకూరు మండలంలోని కొన్ని సెగ్మెంట్లలో వందల్లో మెజారిటీ రాబోతున్నట్టు వెల్లడించారు. ఈ మండలంలో టీడీపీకి శృంగభంగం తప్పదన్నారు. ఒక్క తోడేరు సెగ్మెంట్లోనే 1500 పైచిలుకు ఓట్లు మెజారిటీని వైఎస్సార్సీపీ సాధిస్తుందని చెప్పారు. ఇదే గాలి సీమాంధ్ర మొత్తం వీస్తున్నట్టు తెలిపారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో ఓటర్లు ఆయన్ను అక్కున చేర్చుకుని ఓట్లు వేస్తున్నట్టు తెలిపారు. స్థానిక ఎన్నికల విశ్లేషణలో ఇదే సమాచారం తమకు అందినట్టు వెల్లడించారు. కార్యకర్తలు ఎండను సైతం లెక్కచేయకుండా సైనికుల్లా పనిచేయబట్టే మంచి ఫలితాలు సాధించబోతున్నట్టు కాకాణి సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహాన్ని కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలని సూచించారు. జగన్మోహన్రెడ్డిపై నమ్మకం, వైఎస్సార్‌పై అభిమానం, తాను ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధే తమ పార్టీకి శ్రీరామరక్షగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎందరు వచ్చి కుయుక్తులు పన్నినా లాభం లేదన్నారు. చేసిన అభివృద్ధి చూపి ఓట్లు అడుగుతున్నట్టు చెప్పారు. కాకాణి వెంట పార్టీ నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, వెంపులూరు శ్రీనివాసులుగౌడ్ తదితరులు ఉన్నారు. -
సుపరిపాలన జగన్‌తోనే సాధ్యం
పొదలకూరు, న్యూస్‌లైన్: కొత్తరాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తుండగా, చంద్రబాబు మాత్రం అధికారం కోసం అర్రులుజాస్తున్నారని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బిరదవోలు పంచాయతీలోని చెర్లోపల్లిలో శుక్రవారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. జగన్మోహన్రెడ్డి ఆచరణ సాధ్యమైన హామీలనే మాత్రమే ఎన్నికల ప్రచార సభల్లో ఇస్తున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు మాత్రం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారని ధ్వజమెత్తారు. విలువలు, విశ్వసనీయత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన జగన్ కొత్త రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆదాయ వనరుల ప్రకారం మేనిఫెస్టోను రూపొందించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టని చంద్రబాబు ఆదాయం, ఖర్చు ఎంత అని ఆలోచించకుండా ఇష్టానుసారంగా హామీలు గుప్పిస్తున్నారన్నారు. రెండు మార్లు సీఎంగా పనిచేసిన ఆయన అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. అధికారం వస్తే ప్రజలను పట్టించుకోకుండా, రాకుంటే భవిష్యత్ ఉండదనే ఆందోళనతో పిచ్చిపట్టినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. జనాన్ని మోసం చేసేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించడం తగదన్నారు. ఎమ్పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించబోతోందన్నారు. భారీ మెజార్టీ సాధించేందుకు కార్యకర్తలు పట్టుదలగా కృషి చేయాలన్నారు. కాకాణి వెంట పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, కోనం బ్రహ్మయ్య, మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, బిరదవోలు సర్పంచ్ వెన్నపూస శ్రీనివాసులురెడ్డి, రావుల చినఅంకయ్యగౌడ్, వూకోటి లక్ష్మీనారాయణ, గూడూరు శ్రీనివాసులు ఉన్నారు. -
కూతుళ్లపై తండ్రుల అత్యాచారం!
హైదరాబాద్: నిర్భయ వంటి కఠినమైన చట్టాలు రూపొందిస్తున్నా మహిళలకు రక్షణ లభించడంలేదు. మహిళలు, ముఖ్యంగా బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో వావివరుసలు లేకుండా కన్న తండ్రులే కూతుళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అటువంటి సంఘటనలు ఈరోజు రాష్ట్రంలో రెండు చోట్ల జరగడం బాధాకరం. బొల్లారంలో 13 ఏళ్ల కన్నకూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. మరో సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరులో జరిగింది. ఇక్కడ పెంపుడు కూతురుపై తండ్రి అత్యాచారం చేశాడు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, శ్రీకాకుళం పాతపట్నంలో మైనర్ బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతనికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
చెట్టును ఢీకొన్న ఆటో: 10 మందికి తీవ్రగాయాలు
పొదలకూరు మండలం నావూరు క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం ఆటో చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా ఆటో నడపడంతోనే ఆ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట మండలం పున్నేల్లో జిల్లా నారాయణ అనే వ్యక్తిపై అతని సమీప బంధువులు శుక్రవారం గొడ్డలితో దాడి చేశారు. దాంతో నారాయణ పరిస్థితి విషమంగా మారింది. కుటుంబసభ్యులు వెంటనే స్పందించి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలతోనే బంధువులు నారాయణపై దాడి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.