ఏడాదిలోపే పొదలకూరులో వైమానిక నిఘా వ్యవస్థ
పొదలకూరు (నెల్లూరు): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మరుపూరు గ్రామ ప్రభుత్వ భూముల్లో భారత వైమానిక నిఘా వ్యవస్థ (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) ను ఈ ఏడాదిలోనే ఏర్పాటు చేస్తామని చెన్నై ఎయిర్‌పోర్ట్ ఇన్‌చార్జి రాజేష్ తెలిపారు. స్థానిక తహశీల్దారు కృష్ణారావుతో కలిసి మంగళవారం ఎయిర్‌ఫోర్స్‌కు కేటాయించిన భూములను రాజేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 67 ఎకరాలను తాము అధికారికంగా బుధవారం స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
2010లో ఈ ప్రాంతంలో రాడార్ కేంద్రం ఏర్పాటుకు భూములను కేటాయించినప్పటికీ, స్వాధీనం చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత పనులను వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. ఎయిర్‌ఫోర్స్‌కు ముందుగా 67 ఎకరాలను స్వాధీనం చేస్తామని తహశీల్దారు కృష్ణారావు వెల్లడించారు. మిగిలిన భూములు కోర్టు పెండింగ్‌లో ఉన్నందున తర్వాత అప్పగిస్తామన్నారు.