మూడేళ్ల క్రితం రెండు కోడె దూడల కొనుగోలు
ముద్దుగా రాముడు, భీముడని పేర్లు
రాష్ట్రస్థాయి ఎండ్ల పందేల్లో గెలవాలని
వాటికి రోజూ రూ.2 వేల ఖర్చు
జీతమంతా వాటి పెంపకానికే..
ఇదీ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీరు
పొదలకూరు: ఆ యువకుడికి వ్యవసాయమన్నా, పశువుల పెంపకమన్నా ప్రాణం. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నా.. మనసంతా ఎడ్లపైనే ఉండేది. ఆ మమకారంతోనే రెండు కోడె దూడలను కొనుగోలు చేసి వాటికి రాముడు, భీముడు అని ముద్దుగా పేర్లు పెట్టుకుని పిలుస్తున్నాడు. అవి ఇప్పుడు పెద్దవయ్యాయి. రాష్ట్రస్థాయి ఎడ్ల పందేల్లో (బండ లాగుడు) పాల్గొని అవి ప్రథమ స్థానంలో నిలవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఆలనాపాలనకు ప్రత్యేకంగా ఒకరు
కోడెదూడలను కొనుగోలు చేసిన నాటి నుంచి వాటి ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వాటిని రాముడు, భీముడు అనే పేర్లతో మా కుటుంబమంతా పిలుచుకుంటున్నాం. వాటి ఆలనాపాలనకు నెల జీతం ఇచ్చి ఓ మనిషిని కూడా ఏర్పాటు చేశాను. చెబితే అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ వాటి పోషణకు నిత్యం రూ.2 వేలు వరకు ఖర్చు చేస్తున్నాను. పశుగ్రాసంతోపాటు ఉలవలు, జొన్నలు కూడా పెడుతున్నాం. నేను కోడెలను కొని మూడేళ్లయింది. వాటి వయసు ఇప్పుడు నాలుగేళ్లు. పోటీలకు సిద్ధం చేసే ఉద్దేశంతో శిక్షణ ఇప్పిస్తున్నాను. తోటలోనే పరుగులు తీయించి అలసటను తట్టుకునేలా అలవాటు చేస్తున్నాను. పశువైద్యుల సలహాలు సూచనలు తీసుకుని వాటి ఆరోగ్యంపై పరీక్షలు కూడా చేయిస్తున్నాను.
ఏదో తెలియని వెలితి
ఆ యువకుడి పేరు బుధవరపు ప్రతాప్. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీ ముత్యాలపేట గ్రామం. సాక్షి అతడిని పలుకరించగా ఏం చెప్పారంటే... మాది వ్యవసాయ కుటుంబం. నేను కావలి విట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో చదివాను. ఐదేళ్ల క్రితం హైదరాబాద్ హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాను. కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోమ్‌లో భాగంగా ఇంటి నుంచే పనిచేసేవాడిని.
చదవండి: సింహపురి ‘కోడల్లుళ్లు’ వచ్చేశారోచ్!
ఉద్యోగంలో జీతం బాగానే వస్తున్నా ఏదో తెలియని వెలితి ఉండేది. తాత, తండ్రుల నుంచి పోషిస్తున్న ఎడ్లపై అభిలాష కలిగింది. ఒంగోలు జాతికి చెందిన కోడెలు కొనుగోలు చేసి పోషించాలని భావించి మా నాన్న పెంచలయ్యతో చెప్పాను. దానికి ఆయన మొదట సందేహించినా నా ఇష్టాన్ని కాదనలేదు. తండ్రి సహకారంతో వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో 8 నెలల వయస్సు ఉన్న దూడను రూ.80 వేలు వెచ్చించి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏడాది వయసున్న దూడను రూ.లక్ష వెచ్చించి కొన్నాను.
ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నా
రాముడు, భీముడుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తే రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీల్లో రాణిస్తాయని నమ్మకంగా ఉంది. ఇందుకోసం నెలకు రూ.30 వేలు వెచ్చించి వైఎస్సార్ జిల్లా చెన్నూరులో నెల కిందటే శిక్షకుడి వద్ద వదిలిపెట్టాను. ప్రతినిత్యం వాటిని వీడియోకాల్లో చూసుకుంటూ శిక్షణకు ఎలా సహకరిస్తున్నాయో తెలుసుకుంటున్నాను. నా ఎడ్ల గురించి తెలిసిన కొందరు రైతులు మంచి ధరతో కొనుగోలు చేస్తామని ముందుకొచ్చినా నేను ససేమేరా అన్నాను. బండలాగుడు పోటీల్లో అవి ప్రథమ స్థానంలో నిలవడమే నా లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment