వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా పోలింగ్
పొదలకూరు, న్యూస్‌లైన్ : సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా పోలింగ్ జరిగినట్టు ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కుటుంబ సమేతంగా తోడేరులో శుక్రవారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం పొదలకూరు పార్టీ కార్యాలయంలో కాకాణి పోలింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుని విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గలో ఫ్యాన్‌గాలి వీస్తున్నట్టు తెలిపారు.
ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలను తమ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. గత పంచాయతీ ఎన్నికలతో పోల్చిచూస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం పెరిగిందన్నారు. అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. పొదలకూరు మండలంలోని కొన్ని సెగ్మెంట్లలో వందల్లో మెజారిటీ రాబోతున్నట్టు వెల్లడించారు. ఈ మండలంలో టీడీపీకి శృంగభంగం తప్పదన్నారు. ఒక్క తోడేరు సెగ్మెంట్‌లోనే 1500 పైచిలుకు ఓట్లు మెజారిటీని వైఎస్సార్‌సీపీ సాధిస్తుందని చెప్పారు.
ఇదే గాలి సీమాంధ్ర మొత్తం వీస్తున్నట్టు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో ఓటర్లు ఆయన్ను అక్కున చేర్చుకుని ఓట్లు వేస్తున్నట్టు తెలిపారు. స్థానిక ఎన్నికల విశ్లేషణలో ఇదే సమాచారం తమకు అందినట్టు వెల్లడించారు. కార్యకర్తలు ఎండను సైతం లెక్కచేయకుండా సైనికుల్లా పనిచేయబట్టే మంచి ఫలితాలు సాధించబోతున్నట్టు కాకాణి సంతోషం వ్యక్తం చేశారు.
ఇదే ఉత్సాహాన్ని కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలని సూచించారు. జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకం, వైఎస్సార్‌పై అభిమానం, తాను ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధే తమ పార్టీకి శ్రీరామరక్షగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎందరు వచ్చి కుయుక్తులు పన్నినా లాభం లేదన్నారు. చేసిన అభివృద్ధి చూపి ఓట్లు అడుగుతున్నట్టు చెప్పారు. కాకాణి వెంట పార్టీ నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, వెంపులూరు శ్రీనివాసులుగౌడ్ తదితరులు ఉన్నారు.