
ఎర్రచందనం రక్షణకు చర్యలు చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి సూచన
సాక్షి,తిరుమల: శేషాచలానికి తలమానికమైన ఎర్రచందనం అటవీ సంపదను ఆర్థిక, వాణిజ్య దృష్టితో చూడకుండా వాటి పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సూచిం చారు. శ్రీవారి దర్శనం కోసం ఆయన గురువారం రాత్రి తిరుమలకు వచ్చా రు. ఆయన మీడియాతో మాట్లాడారు. అంతరించిపోతున్న వృక్షాల్లో ఎర్రచందనం కూడా ఒకటని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించిందన్నారు. అలాంటి అరుదైన జాతిని భావితరాల కోసం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాంటి వృక్షాల ఎగుమతితో డబ్బులు సంపాదించుకోవాలని భావనతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సరికాదన్నారు.
శేషాచలంలోని చెట్లను నరకుండా రాష్ర్ట ప్రభుత్వం మరింత సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వీటి స్మగ్లింగ్‌కు పాల్పడే స్మగ్లర్లపై చట్టంలో మార్పులు చేసైనా మరింత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే పక్క రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరిపి శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వీటి రక్షణ చర్యల కోసం శేషాచలంలో బీజేపీ తరపున పెద్ద ఎత్తున పాదయాత్రలు చేసి అప్పటి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఆయన వెంట టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి కూడా ఉన్నారు.