► తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో
► కర్ణాటక రాష్ట్రానికి తరలింపు
► అనంతపురం కేంద్రంగా రవాణా
సాక్షి ప్రతినిధి తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. తమిళనాడులో ఎన్నికలు జరుగుతుండడంతో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను కర్ణాటకకు తరలించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనంతపురం సరిహద్దు ప్రాంతాలు కదిరి, హిందూపురం, రాప్తాడు కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. ఇటీవల కర్ణాటక ప్రాంతంలోని బాగేపల్లెలో లారీలో మొత్తం 95 దుంగలు దొరకడం అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు జిల్లాలో 4, 5 రోజు లుగా ఎర్రచందనం దుంగల స్వాధీనం తగ్గింది. దీంతో టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ అధికారులు ఆరా తీశారు. దీని ప్రకారం అడవిలోకి వెళ్లిన స్మగ్లర్లు దుంగలను బయటకు తరలించకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో డంపులు ఏర్పాటు చేస్తున్నట్లు సమచారం. బాలుపల్లె, సానిపాయితోపాటు అనంతపురం జిల్లాలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల నేపథ్యంలో...
తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల్లో నిఘా కట్టుదిట్టం చేయడంతో స్మగర్లు తాత్కాలికంగా తమిళనాడు వైపు ఎర్రచందనాన్ని తరలించడం ఆపివేసినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఎండలు కూడా మండిపోతుండడంతో అడవిలోకి వెళ్లడానికి కూలీలు జంకుతున్నట్లు అటవీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అనంతపురం జిల్లాపై దృష్టి....
ఎర్ర స్మగ్లర్లు అనంతపురం జిల్లాలో డంపులు ఏర్పాటు చేస్తున్నారని పసిగట్టిన టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసి ఎర్ర స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో ఎర్ర చందనంపై అవగాహన కల్పించేందుకు డీఐజీ కాంతారావు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇందులో భాగంగా త్వరలో కదిరి ప్రాంతంలో సదస్సు నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాలోని హిందుపురం ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేసుకుని, కర్ణాటకకు ఎర్ర చందనం తరలించేందుకు సురక్షిత మార్గంగా స్మగ్లర్లు ఎంచుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు భావిస్తున్నారు. పట్టుగూళ్ల మాటున కర్ణాటకకు ఎర్రదుంగలను తరలిస్తున్నట్లు పోలీసులు సైతం కనుగొన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఎర్ర రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నారు.
రూటు మార్చిన ఎర్ర స్మగ్లర్లు
Published Thu, Mar 31 2016 4:18 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM
Advertisement