
అనంతపురం : ఇదీ జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కమలానగర్ దుస్థితి. నాలుగేళ్ల పాలనపై స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి శ్వేతపత్రం పేరిట గొప్పలకు పోయారు. కార్పొరేషన్ మేయర్ స్వరూప అనంతపురం రూపురేఖలు మార్చేశామంటూ ఇటీవల హడావుడి చేశారు. వీరి పాలన ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదో మచ్చుతునక. చారిత్రక చిహ్నమైన టవర్‌క్లాక్‌కు సమీపంలో వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే కమలానగర్‌లో కాలుష్య కుంపటి నిత్యం రగులుతోంది.
ఓ ఖాళీ ప్రదేశం డంపింగ్ యార్డును తలపిస్తోంది. జిల్లా కేంద్రంలోనే నెలకొన్న ఈ పరిస్థితి చూసి ప్రజలు తాము చేసిన తప్పు తెలుసుకుని ‘ముక్కు మూసుకుని’ ముందుకు కదులుతున్నారు. చెత్త పేరుకుపోయిన ప్రతిసారీ చుట్టుపక్క నివాసితులు, వ్యాపారులు నిప్పు రాజేస్తుండటంతో ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ తిష్టవేసిన పందుల గుంపుతో స్థానికుల అవస్థలు వర్ణనాతీతం. ఇక్కడే ఓ చిన్నపిల్లల ఆసుపత్రి కూడా ఉంది. ఈ కాలుష్య కుంపటి వెదజల్లే పొగతో వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అభివృద్ధి ముసుగులో పబ్బం గడుపుకునే నాయకులు ఇప్పటికైనా మేల్కొని ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment