డంప్‌ల కోసం డాన్‌లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎర్రచందనం డంప్‌ల కోసం జిల్లాలో డాన్‌లు వేట ప్రారంభించారు. హైదరాబాద్, చెన్నై ప్రాంతాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు ఆపరేషన్ ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో ఉన్న ప్రధాన అనుచరుల ద్వారా ఎర్రచందనం అక్రమరవాణాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆత్మకూరు పోలీసులకు చిక్కిన ఎర్రచందనం స్మగ్లర్ కృష్ణ ఆ కోవకు చెందిన వారేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతని ద్వారా మరింత మంది గుట్టు తెలుసుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది.
ఎస్పీ, కొందరు అటవీశాఖ అధికారుల చర్యలతో స్మగ్లర్లలో వణుకుపుట్టింది. ఆ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన స్మగ్లర్లు కొందరు అధికారపార్టీ నేతలు, మరి కొందరు పోలీసు, అటవీ అధికారులను ప్రసన్నం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నాళ్లు రహస్యప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలను దాచి ఉంచాలని స్మగ్లర్లు బరితెగించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గుట్టుచప్పుడుగా ఉన్న స్మగ్లర్ల ప్రధాన అనుచరులు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు. రహస్యప్రదేశాల్లో దాచి ఉంచిన డంప్‌లను తరలించే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ సమాచారం.
జిల్లాలో వెంకటగిరి, డక్కిలి, రాపూరు, అనంతసాగరం, సోమశిల, ఆత్మకూరు పరిధిలోని అడవుల్లోని ఎర్రచందనం చెట్లను కొద్దిరోజుల క్రితం బ్యాటరీతో తయారు చేయించిన రంపాలతో నరికినట్లు తెలిసింది. తమిళనాడుతో పాటు జిల్లాలోని కొన్నిగ్రామాలకు చెందిన కూలీలకు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పి చెట్లను నరికించినట్లు సమాచారం. అడవుల్లో నరికిన చెట్లను గ్రామాలకు చేరవేసినట్లు అధికారులకు సమాచారం అందింది. కాలిబాట ద్వారా దుంగలను భుజాన ఎత్తుకుని వ్యవసాయ పొలాల్లోని తోటల్లో దాచి ఉంచినట్లు కొందరు అధికారులు గుర్తించారు.
ఆపరేషన్ ఎర్రచందనం
అటు పోలీసులు.. ఇటు అటవీ అధికారులు నిద్రాహారాలు మాని కూంబింగ్ నిర్వహిస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం ఎర్రచందనం దుంగలను రహస్యప్రాంతాల నుంచి అనుకున్న చోటుకు చేరవేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం కొందరు ఇంటి దొంగల సహకారంతోనే ఎర్రబంగారం తరలిపోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ అపవాదు నుంచి బయటపడేందుకు కొందరు అధికారులు పథకం వేశారు. వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల పరిధిలో దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి తాము పట్టుకున్నట్లు కొందరు అధికారులు ప్రచారం చేయించుకుంటున్నట్లు సమాచారం.
అదే విధంగా పాత దొంగలను పిలిపించి ఈ కేసుల్లో ఇరికించి వారిని హింసిస్తున్నట్లు బాధితులు
కన్నీరుపెట్టుకుంటున్నారు. ఈ విషయాలను ఎస్పీకి ఫిర్యాదు చేయాలని కొందరు ప్రయత్నించగా కొందరు అధికారులు వారిని భయపెట్టి నెల్లూరుకు రానివ్వకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. అదే విధంగా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన కొందరిని, ఎర్రచందనం అక్రమరవాణా సమాచారం ఇచ్చేవారిపై నిఘాపెట్టారు.
అటువంటి వారిపై టీడీపీ నేతలు కొందరు పోలీసుల సహకారంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తున్నట్లు తెలిసింది. దీంతో అనేక మంది ఎర్రచందనం అక్రమరవాణా సమాచారం ఇవ్వటానికి ముందుకు రాకపోవటం గమనార్హం. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి కొందరు పోలీసులు, అటవీ అధికారుల స్వార్థాలకు బలవుతున్న అమాయకులను కాపాడాల్సిన బాధ్యత ఉందని బాధిత బంధువులు కోరుతున్నారు.