'ఎర్ర' దొంగలు అరెస్ట్
'ఎర్ర' దొంగలు అరెస్ట్
Published Mon, Nov 21 2016 9:52 PM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM
- 11 మంది నిందితుల్లో ప్రకాశం జిల్లా, కర్ణాటక వాసులు
- 64 దుంగలు, రెండు కార్లు స్వాధీనం
కర్నూలు: 'ఎర్ర దొంగలు' అవుకు నుంచి కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు అక్రమంగా ఎర్ర చందనాన్ని తరలిస్తూ పోలీసుల వలకు చిక్కి కటకటాలపాలయ్యారు. నల్లమల అటవీ ప్రాంతంలో కొల్లగొట్టిన ఎర్ర చందనం దుంగలను కొన్నేళ్లుగా ప్రకాశం జిల్లా మీదుగా బెంగళూరుకు తరలించేవారు. అక్కడ పోలీసు నిఘా పెరగడంతో మరో దారి గుండా ఎర్ర చందనాన్ని తరలించే ప్రయత్నంలో దొంగలు దొరికిపోయారు. సోమవారం ఉదయం కర్నూలు జిల్లా అవుకు మండలం పాతచెర్లోపల్లి రిజర్వాయర్ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఏపీ09 టీవీ3, ఏకే01 పి 5310 కార్లలో ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేయగా అక్రమ రవాణా గుట్టు రట్టయ్యింది. అవుకు మండలం సంగపట్నం గ్రామం పొలిమేరలో ఎస్‌ఆర్‌బీసీ కెనాల్ దగ్గర పొలాల్లో దాచి ఉంచిన సుమారు రూ.8 లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగలను, వాటిని రవాణా చేస్తున్న వ్యక్తులను బనగానపల్లె పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఓఎస్‌డీ రవిప్రకాష్, డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద వద్ద నుంచి రూ.8 లక్షలు విలువ చేసే 64 ఎర్ర చందనం దుంగలు, నేరానికి ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగల బరువు సుమారు 13 టన్నులు ఉంటుంది.
పట్టుబడిన నిందితులు:
అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన దుర్గా నూర్ బాషా, కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన షమీవుల్లా, సులేబైలు హబీబుల్లా, వూంలేబైలు, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నదికోట గ్రామానికి చెందిన బాణాల చెన్నకేశవ, గంధం నాగేంద్రప్రసాద్, దిగువమెట్ట గ్రామానికి చెందిన పసుపుల బేబితో పాటు, తుమ్మలపల్లె గ్రామానికి చెందిన సారే కాశయ్య, సూరేపల్లె గ్రామానికి చెందిన పఠాన్ మాబూవలి, పెద్ద మస్తాన్‌రెడ్డి తదితరులను అరెస్టు చేశారు.
రెండేళ్లుగా కొనసాగుతున్న అక్రమ రవాణా...
గిద్దలూరు ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఎర్ర చందనం రవాణా రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు పోలీసు విచారణలో వెలుగు చూసింది. అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన నూర్ బాషా మిరప పంటను గుంటూరుకు తీసుకెళ్లే క్రమంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమిట్ట గ్రామం వద్ద టీ దుకాణం నిర్వహించే బేబీతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మిర్చీ వ్యాపారి నూర్ బాషాకు ఎర్ర చందనం రవాణాదారులు షమీవుల్లా, హబీబుల్లాకు కూడా టీ స్టాల్ వద్ద పరిచయం పెరిగింది. ఈ క్రమంలో నూర్ బాషా ద్వారా షమీవుల్లాకు, అక్కడి నుంచి హబీబుల్లాకు ఎర్ర చందనం సరఫరా చేసే క్రమంలో నిందితులందరూ పోలీసులకు పట్టుబడ్డారు. ఎర్ర దొంగలను అరెస్టు చేసి పెద్ద మొత్తంలో ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నందుకు బనగానపల్లె సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ రాకేష్, జయలక్ష్మి, అవుకు ఎస్‌ఐ వెంకట్రామిరెడ్డి, డోన్ ఎస్‌ఐ శ్రీనివాస్, అవుకు పోలీస్‌స్టేషన్‌కు చెందిన సిబ్బంది శ్రీనివాస్, ప్రసాద్, మోహన్‌రాజు, పురుషోత్తం, బనగానపల్లె హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర గౌడు, సిబ్బంది నాగన్న, మహేష్, ఖాసీం వలి, హుసేనయ్య, మధుసూదన్, సురేష్, రమేష్, రాజశేఖర్, నాగన్న, భారతి, సుల్తాన్, కంబగిరి స్వామి తదితరులను ఎస్పీ అభినందించారు.
Advertisement