తవ్వేకొద్దీ.. | Tavvekoddi .. | Sakshi
Sakshi News home page

తవ్వేకొద్దీ..

Published Sun, Jan 4 2015 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

తవ్వేకొద్దీ..

తవ్వేకొద్దీ..

క్రైం (కడప అర్బన్) : ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లకు తమిళ కూలీలను చేరవేస్తున్న వ్యవహారంలో ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర ఉందని పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆధ్వర్యంలో గతనెల 2వ తేదీన ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన 11 మంది డ్రైవర్లను అక్బర్ హుసేన్ అనే కీలక డ్రైవర్‌తోపాటు అరెస్టు చేశారు. మరో డ్రైవర్‌ను గత వారంలో అరెస్టు చేశారు.

పోలీసుల సిఫార్సు మేరకు ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి చెందిన జోనల్ స్థాయి అధికారులు కర్నూలు, కడప, అనంతపురం రీజియన్ల పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు ఎవరైనా ఎర్ర కూలీలను తరలించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారా అనే విషయమై లోతుగా ఆరా తీశారు. గత ఏడాది కాలం నుంచి జరుగుతున్న వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.
 
ఆర్టీసీ ఎండీ, జిల్లా ఎస్పీలకు జాబితా
ఎర్ర కూలీలను చెన్నై నుంచి తరలించడంలో సంబంధం ఉన్న మరో 30 మంది డ్రైవర్ల జాబితాను విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రారావుకు ఇరవై రోజుల కిందట పంపించారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిర్దరణ కావడంతోనే వారి పేర్లను జాబితాలో చేర్చారు. ఆర్టీసీ ఎండీ సిఫార్సు మేరకు అదే జాబితాను జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీకి అందజేశారు.
 
 పోలీసుల అదుపులో 21 మంది డ్రైవర్లు

 కర్నూలు రీజియన్‌లో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు డిపోలకు సంబంధించిన డ్రైవర్లలో 21 మందిని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు ఇప్పటికే రాజంపేట డీఎస్పీ అరవిందబాబు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో నంద్యాల డిపోకు చెందిన 10 మంది డ్రైవర్లు, ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఐదుగురు డ్రైవర్లు, ఆత్మకూరుకు చెందిన ఆరుగురు డ్రైవర్లను అరెస్టు చేశారు. వీరిని నేడో, రేపో మీడియా ఎదుట హాజరు పరచనున్నారు.
 
 విజిలెన్స్ అధికారుల విచారణ వేగవంతం
 ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు ఎర్రచందనం స్మగ్లర్ల మామూళ్లకు కక్కుర్తిపడి చెన్నైనుంచి కర్నూలు రీజియన్‌కు చెందిన ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు డిపోల బస్సులలో రెండేసి సర్వీసులకు వచ్చే డ్రైవర్లు తమిళ కూలీలను జిల్లాలోని అటవీ ప్రాంతాల సరిహద్దు గ్రామాల వద్ద వదిలేసి వెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తర్వాత డ్రైవర్లను, కొంతమంది మెకానిక్‌లను, ఉద్యోగులను క్షుణ్ణంగా విచారించారు.

కూలీలను తరలించడంలో డ్రైవర్లకు రింగ్ లీడరుగా నంద్యాల డిపోకుచెందిన అక్బర్ హుసేన్ కీలకపాత్ర పోషించగా, చెన్నైకి చెందిన డ్రైవర్లు పాండు, శివుడు అనే వారు స్మగ్లర్లతో చేతులు కలిపి వీరికి వేలాది రూపాయలు ఒక్కో సర్వీసు సమయంలో అందజేస్తున్నట్లు సమాచారం.

 అక్బర్ హుసేన్ సూచించిన డ్యూటీ చార్టులోని డ్రైవర్లకు మాత్రమే ఈ వ్యవహారాన్ని ఇతరులకు తెలియకుండా నిర్వహించినట్లు తెలిసింది. అలాగే ఒక మెకానిక్ చెన్నైనుంచి టైర్లకు సపోర్టునిచ్చే కట్టలు బలహీనంగా ఉన్నాయని, మరమ్మతుల కోసం వచ్చి బాలుపల్లె వద్ద కూలీలను దించేసి ఆళ్లగడ్డకు ఓ సర్వీసు వెళ్లినట్లు విచారణలో తెలిసింది.

మరో మెకానిక్ బెలూన్ రిపేరు రాకపోయినా అడ్డంగా బ్లేడుతో కోసేసి తమపని ముగించుకుని ఆళ్లగడ్డకు నేరుగా బస్సు సర్వీనును తీసుకెళ్లినట్లు, కొత్త బెలూన్ లాంటి సామాను అమర్చగా అతన్ని విచారించినట్లు తెలుస్తోంది. ఇంకా ఎనిమిది మంది డ్రైవర్లు, చెన్నైకి చెందిన ముగ్గురు ఉద్యోగులు కీలకపాత్ర వహించినట్లు, వారికోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement