ప్రతీకాత్మక చిత్రం
– కృష్ణగిరి కళాశాలలో ఎమ్మెస్సీ
చదువుతున్న ఏలుమలై ఆర్థిక
ఇబ్బందుల్లో కూరుకుపోయిన కుటుంబానికి చేదోడువాదోడుగా
ఉండాలని భావించాడు. ఉపాధి లేక అడవిబాట పట్టాడు. ఎర్రచందనం
చెట్లు నరికి వాహనంలో
తీసుకొస్తుండగా గత గురువారం రాత్రి
కరకంబాడి సమీపంలోని ఆంజనేయపురం వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారులకు చిక్కాడు.
– వేలూరుకు చెందిన గోవిందరెడ్డి తిరువణ్ణామలై ఆర్ట్స్ కళాశాలలో ఎంకాం చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు గోవిందరెడ్డిని స్మగ్లర్‌గా మార్చాయి. కుటుంబ అవసరాల కోసం గోవిందు
అడవిబాట పట్టాడు. తమిళనాడు నుంచి వాహనంలో
అడవిలోకి వెళ్తుండగా గత గురువారం రాత్రి టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడిలో పట్టుబడ్డాడు.
.. ఇలా ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు నిరుద్యోగంతో విసుగుచెంది స్మగ్లర్లుగా మారుతున్నారు. పుస్తకాలు చేతబట్టాల్సిన చేతులు గొడ్డళ్లు పట్టుకుని అడవి బాటపడుతున్నాయి.
సాక్షి, తిరుపతి: ఆర్థిక ఇబ్బందులు.. చదువుకున్నా ఉపాధి లేక.. ఇంట్లో ఖాళీగా ఉండలేక.. కుటుంబంపై ఆధారపడలేక యువత నలిగిపోతోంది. ఏం చేయాలో తెలియక తప్పటడుగు వేస్తోంది. స్మగ్లర్లుగా మారి తల్లిదండ్రులకు తలవొంపులు తెస్తోంది. ఇటీవల ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ దాడిలో పట్టుబడుతున్న వారిని చూస్తే ఇదే అనిపిస్తోంది. నెల క్రితం చంద్రగిరి సమీపంలో పట్టుబడ్డ సుబ్రమణియన్ (బీటెక్), మురుగన్ (ఎంటెక్)తో పాటు ఆర్థిక ఇబ్బందులతో చదువు పూర్తిచేయలేని వారు, ఉన్నత చదువులు పూర్తిచేసి ఉద్యోగం రాక ఇబ్బందులు ఎదుర్కొం టున్న వారు అనేక మంది ఉన్నారు.
శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనానికి దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ దుంగలను గమ్యస్థానానికి చేరవేస్తే కోట్ల రూపాయలు వస్తుండడంతో స్మగ్లర్లు తమ అవసరాల కోసం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న యువతకు గాలం వేస్తున్నారు. అందులో భాగంగా వేలూరు కు సమీపంలోని తిరువణ్ణామలై కళాశాలలో చదువుతున్న విద్యార్థులపై దృష్టి సారించారు.
వారే టార్గెట్
అర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని స్మగ్లర్లు లక్ష్యంగా చేసుకున్నారు. అటువంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఐదుగురి చొప్పున ఏడు గ్రూపులను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ గ్రూపులు కళాశాల సమీపంలో టీ అంగళ్లు, క్యాంటీన్ల వద్ద తిష్టవేస్తారు. అక్కడకు వచ్చే విద్యార్థులను ఆకర్షిస్తారు. రెండు, మూడు పర్యాయాలు మాటలు కలిపి పరిచయం చేసుకుంటారు. వారి ద్వారా నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తిస్తారు. ఎర్రచందనం రవాణా ద్వారా లక్షాధికారి కావొచ్చని ఆశలు చిగురింపజేస్తారు.
సేలంలో ప్రత్యేక శిక్షణ
ఎర్రచందనం అక్రమ రవాణాలో కొందరు అనుభవం ఉన్న స్మగ్లర్లతో యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విద్యార్థులు, నిరుద్యోగులను గుర్తించి వారిని సేలంకి తీసుకెళ్తారు. అక్కడ రహస్య ప్రాంతాల్లో వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజుల పాటు ఎర్రచంనదం చెట్లు నరకడం, వాటిని దుంగలుగా మలచడం, వాటిని వాహనం వద్దకు తరలించడం వంటి మెళకువలు నేర్పిస్తున్నట్లు తెలిసింది.
దుంగలు తరలిస్తున్న సమయంలో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులకు చిక్కకుండా పారిపోయే విషయం లోనూ మరింత శిక్షణ ఇస్తున్నారు. ఒకవేళ దొరికిపోతే విచారణలో ఏం చెప్పాలో కూడా నేర్పిస్తున్నారు. ఎవరు ఎంత విచారించినా ప్రధాన స్మగ్లర్ల పేర్లు చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం శేషాచలం అడవిలోకి చొరబడుతున్న స్మగ్లర్లలో 35శాతం మంది యువతే అని టాస్క్‌ఫోర్స్, పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
యువతకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్
ఎర్రచందనం అక్రమ రవాణాకు ఆకర్షితులవుతున్న యువతకు టాస్క్‌ఫోర్స్ బృందం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తోంది. యువత స్వగ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులను కలిసి వివరిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ అధికారులు ఎర్రచందనంపై షార్ట్ ఫిలిమ్స్ తీసి యూట్యూబ్ ద్వారా ప్రచారం చేస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment