సాక్షి,మదనపల్లె(చిత్తూరు): ఓ పెళ్లిలో భోజనం తినేటప్పుడు అదే పనిగా చూశారని రౌడీషీటర్‌తో పాటు అతని అనుచరులు మూకుమ్మడిగా జరిపిన దాడిలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఘటనకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..మదనపల్లె పట్టణానికి మధుకుమార్ 30, అసిఫ్ (25), వినోద్ (28), మంజునాథ్ (24)తో పాటు మరి కొంతమంది స్థానిక మిషన్ కాంపౌండ్ సీఎస్‌ఐ పెళ్లి మండలంలో జరిగిన మిత్రుడు వివాహానికి ఆదివారం హాజరయ్యారు.
పెళ్లి అయిపోయాక ఇంటికి వెళ్లే సమయంలో దేవళం వీధికి చెందిన రౌడీషీటర్ సుల్తాన్ వర్గీయులు మధుకుమార్ వర్గీయులతో భోజనం తినే సమయంలో తమవైపు చూశారన్న కారణంతో గొడవకు దిగారు. పెళ్లిబృందం ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. రాత్రి 10 గంటల సమయంలో స్థానిక మాలిక్ ఫంక్షన్‌హాల్ దగ్గర ఉన్న మధుకుమార్ వర్గీయులు ఉండగా సుల్తాన్, తన అనుచురులతో వెళ్లి వెంట తెచ్చుకున్న రాళ్లతో దాడి చేశారు. ఆస్పత్రికి తరలించగా దాడిలో తీవ్రంగా గాయపడిన మధుకుమార్ పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు రెఫ ర్ చేశారు. ఆసిఫ్, వినోద్, మంజునాథ్‌ను కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వన్‌టౌన్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వరసదాడులతో జనం బెంబేలు..
రౌడీషీటర్ సుల్తాన్ పట్టణంలో వరుస దాడులకు పాల్పడుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అలజడి సృష్టిస్తున్న అల్లరి మూకలపై పోలీసులు కేసులు నమోదు చేయకుండా చోద్యం చేస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సుల్తాన్ దేవాలయ వీధికి చెందిన ఉదయ్‌కుమార్, కిరణ్, ప్రకాష్, వాసుపై దాడులు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితుల తల్లిదండ్రులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment