కానిస్టేబుల్ భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న ఏలూరు డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్
నూజివీడు : వినాయక నిమజ్జనాల సందర్భంగా విధులు నిర్వహిస్తూ ఓ యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర(32) ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో శనివారం రాత్రి డీజే ఆపమని చెప్పిన కానిస్టేబుల్ నరేంద్రపై ఉలాస రామకృష్ణ అనే యువకుడు తలపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నరేంద్రను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు.
దీంతో మృతదేహాన్ని సోమవారం తెల్లవారుజామున నూజివీడు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీంతో ఏరియా ఆస్పత్రి వద్దకు నూజివీడు సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది, అధికారులు, మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు చేరుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కొద్దిసేపు ఆందోళన చేశారు.
కాగా, ఏరియా ఆస్పత్రిలో ఉన్న నరేంద్ర భౌతికకాయాన్ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏలూరు డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి కూడా నివాళులర్పించారు. అనంతరం నరేంద్ర స్వగ్రామమైన ఎనీ్టఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపాడులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment