గంజాయి మత్తుకు అడ్డాగా మిర్యాలగూడ | Huge Ganja Transporting From Visakhapatnam To Miryalaguda | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ టు మిర్యాలగూడ

Published Fri, Nov 22 2019 12:06 PM | Last Updated on Fri, Nov 22 2019 12:06 PM

Huge Ganja Transporting From Visakhapatnam To Miryalaguda - Sakshi

స్విఫ్ట్‌ కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు

సాక్షి, మిర్యాలగూడ : గంజాయి మత్తుకు అడ్డాగా మిర్యాలగూడ పట్టణం మారింది.  అత్యాశతో తక్కువ కాలంలో ఎక్కువగా సంపాదించాలనే కొందరు యువకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అభం శుభం ఎరుగని మైనర్లను సైతం మత్తుకు బానిసలుగా చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. గత కొద్ది రోజులుగా మిర్యాలగూడ పట్టణంలో గంజాయి విక్రయాలు జోరందుకున్నాయి.  విద్యార్థులు, యువకులు సైతం విక్రయాలు సాగిస్తూ దాని మైకంలో జరుగుతున్న దారుణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగాజి మత్తులో యువకులు చేస్తున్న దారిదోపిడీలు, చోరీలు పోలీసులకు సైతం సవాలుగా మారాయి. పోలీసుల విచారణలో మైనర్లు పట్టుబడడం ఆందోళన కలిగించే విషయం. 

వైజాగ్‌ నుంచి దిగుమతి.. 
కొంత మంది యువకులు ముఠాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో డంపింగ్‌ చేస్తున్నారు. చిన్నచిన్న పొట్లాలలో ప్యాకింగ్‌ చేస్తూ స్థానిక యువకులకు విక్రయాలు సాగిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.200 నుంచి వెయ్యి వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందుతూ జల్సాలు చేస్తున్నారు. గతంలో పట్టుబడి మైనర్లను విచారించిన పోలీసులకు విస్తు గొలిపే వాస్తవాలు తెలియడంతో నివ్వెరపోయారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వారి వైఖరిని ఎప్పటికప్పుడు గమనించాలని పోలీసుల ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. 

బైక్‌లకు ప్రత్యేక కోడ్‌..! 
మిర్యాలగూడ పట్టణంలో గంజాయిని విక్రయించే సింబల్‌గా కొంతమంది యువకులు తమ బైక్‌లకు గంజాయి ఆకుల గుర్తులు కలిగిన స్టిక్కర్లు వేయించారు. ఈ గుర్తుల ఆధారంగా పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నారు. సరిహద్దులోని దాచేపల్లి, నాగార్జునసాగర్, సూ ర్యాపేట, హాలియా వంటి ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తూ యువకులను మత్తులో చిత్తు చేస్తున్నారు. కాగా పట్టణంలోని శివారు ప్రాం తాలైన రవీంద్రనగర్‌ కాలనీ, ప్రకాశ్‌నగర్, హనుమాన్‌పేట, నాగార్జుననగర్, రాజీవ్‌చౌక్, బైపాస్‌ దాబాల వద్ద గంజాయి విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. బైక్‌లపై ఉన్న సిక్కర్‌ ఆధారంగా గంజాయి కావాలనుకునే వారు ఆ బైక్‌ల వద్దకు వచ్చి గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. 

దారిదోపిడీలకు పాల్పడుతున్న యువత 
గంజాయి మత్తుకు అలవాటు పడిన యు వత జల్సాల కోసం దారిదోపిడీలకు సైతం పాల్పడుతుంది. ఇటీవల అద్దంకి– నార్కెట్‌పల్లి బైపాస్‌ రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తిని అడ్డగించిన కొంతమంది యువకులు దాడిచేసి రూ.2వేల నగదు, బంగారు చైన్‌ను అపహరించారు. పట్టణంలోని పలుచోట్ల బైక్‌లు, ఆటోలను సైతం దొంగిలించారు. తీగలాగితే డొంక కదిలినట్లు పట్టణంలోని శరణ్యగ్రీన్‌ హోంలో చైన్‌చోరీ విషయంలో సీసీ పుటేజిని పరిశీలించారు. పోలీసులు నింది తులను పసిగట్టే పనిలో భాగంగా పట్టణంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా గంజాయికి బానిసలుగా మారిన మైనర్లు ఈ దారిదోపిడీకి పాల్పడినట్లు గుర్తించి వారితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. 

అక్రమార్జనకు ఆశపడి.. 
మిర్యాలగూడ అర్బన్‌ : జల్సాలకు అలవాటు పడి, అక్రమార్జనకు ఆశపడిన యువకులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. చివరకు కటకటాల పాలయ్యారు. గురువారం పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మిర్యాలగూడ డీఎస్పీ వై.వెంకటేశ్వర్‌రావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం జల్మాల్‌కుంట గ్రామానికి చెందిన నూనవత్‌ నాగయ్య అలియాస్‌ నాగరాజు, భూక్యా చందు, దుపాడు గ్రామానికి చెందిన కొప్పోజు సతీష్, న్యూ బంజారాహిల్స్‌ తండాకు చెందిన నూనావత్‌ రమేష్‌ విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే తలంపుతో నునావత్‌ సుధాకర్, బానోతు సుధాకర్, గూగులోతు సైదా, జర్సుల మస్తాన్, ఆంగోతు నాగరాజు, ధీరావత్‌ ముని, బానోతు రమేష్‌ల వద్ద గత ఆగస్టు, జూలై నెలలో 70కిలోల గంజాయిని కొనుగోలు చేశారు.

ఆ గంజాయిని కిలో ఒక్కంటికి వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసిన పై నలుగురు వ్యక్తులు 10నుంచి 15గ్రాములుగా చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, నేరేడుచర్ల, నకిరేకల్, నల్లగొండ ప్రాంతాల్లో 52కిలోల గంజాయిని విక్రయించారు. మిగిలిన 18కిలోల గంజాయిని కూడా విక్రయించాలని గురువారం మధ్యాహ్నం స్విప్ట్‌ కారులో గల సైడ్‌ డోర్‌లో పెట్టి పట్టణంలోని రవీంద్రనగర్‌ గల నాగరాజు ఇంటికి తరలిస్తుండగా చిల్లాపురం క్రాస్‌ రోడ్డు వద్ద వాహనాల తనిఖీల్లో పట్టుకున్నట్లు తెలిపారు. కాగా ఈ కేసులో నూనావత్‌ నాగయ్య అలియాస్‌ నాగరాజు, భూక్యా చందు, కొప్పోజు సతీష్, నూనావత్‌ రమేష్‌లను అరెస్టు చేసి వారి నుంచి 18కిలోల గంజాయి, స్విఫ్ట్‌ కారును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురు వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూటౌన్‌ సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.  

గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు 
గంజాయి విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వారిపై నిఘా పెంచుతాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలపై కూడా నిఘా పెంచి విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతాం. మైనర్లు మత్తుకు బానిసలుగా మారకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. వారి తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెట్టాలి ఇతర వ్యసనాలకు బానిసలుగా మారకుండా చూసుకోవాలి. 
– వై.వెంకటేశ్వర్‌రావు, డీఎస్పీ 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement