సాక్షి,ఖమ్మం: రెండు నెలల క్రితం గంజాయి రవాణా చేస్తూ జిల్లా పోలీసులకు పట్టుబడి సస్పెండ్ అయిన ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్ల ఉదంతం మరిచిపోకముందే ఇదే దందా సాగిస్తూ ఇంకో ఏఆర్ కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. ఈసారి గంజాయి ఆయిల్(హఫీష్ ఆయిల్) రవాణా చేస్తూ హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన కానిస్టేబుల్ పట్టుబడడం పోలీస్‌శాఖలో కలకలం సృష్టించింది. ఖమ్మం ఏఆర్ విభాగానికి చెందిన ముజీబ్ పాషా భద్రాద్రి కొత్తగూడెంలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
ముస్తఫానగర్‌కు చెందిన మహ్మద్ అఫ్రోజ్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని నాయకులగూడెంనకు చెందిన గుని వెంకటేష్, చల్లా ఉపేందర్‌తో కలిసి గంజాయి(హపీష్ ఆయిల్)ను ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు నుంచి కారులో హైదరాబాద్‌కు తరలిస్తూ తాజాగా పట్టుబడ్డాడు. విచారణలో ముజీబ్ పాషా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ అని తేలడంతో ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. తాజాగా చేపట్టిన ఉద్యోగుల విభజనలో ఆయనను భద్రాద్రి కొత్తగూడెంకు జిల్లాకు కేటాయించినట్లు సమాచారం. కాగా, విచారణ కోసం హైదరాబాద్‌నుంచి ఎస్‌ఓటీ పోలీసులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒకటి, రెండు రోజుల్లో రానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గంజాయి, ఆయిల్ రవాణాలో కానిస్టేబుల్ ముజీబ్ పాషాతో పాటు ఇంకా ఎవరైనా పోలీస్‌శాఖ ఉద్యోగులకు సంబంధం ఉన్న అంశంపై కూపీ లాగుతున్నారు. ఏది ఏమైనా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో వరుసగా పోలీస్ సిబ్బంది పట్టుబడుతుండడంతో శాఖ ప్రతిష్ట దెబ్బతింటోందని కొందరు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment