మహబూబ్‌నగర్: తల్లి గర్భంలోనే ఆ శిశువుకు నూరేళ్లు నిండాయి. ఆపరేషన్ ద్వారా వైద్యులు శిశువు మృతదేహాన్ని బయటకు తీయగా.. ఆ కుటుంబసభ్యులు మానవత్వం మరిచారు. పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయకుండానే దారిలో చెత్తకుప్పలో ఆ ఆడ శిశువు మృతదేహాన్ని పడేసిన ఘటన గురువారం మహబూబ్‌నగర్‌లో కలకలం రేపింది. జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం బకారం గ్రామానికి చెందిన మహిళ మూడో కాన్పు కోసం మార్చి 29న నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి వెళ్లింది.
అప్పటికే గర్భసంచిలో పిండం మృతి చెందడంతో హైరిస్క్ కేసు కింద వారు మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రాత్రి 11.30 వచ్చారు. రాత్రి 1.30 ప్రాంతంలో ఆపరేషన్ చేసి తల్లి గర్భంలో నుంచి మృతి చెందిన ఆడ శిశువును బయటకు తీశారు. తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో శిశువు మృతదేహాన్ని తండ్రికి అప్పగించి స్వగ్రామానికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లకుండా పట్టణంలోని ఓ డ్రైనేజీ సమీపంలో ఉండే చెత్తకుప్పలో పడేశారు.
గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. శిశువు చేతిపై ఆస్పత్రి సిబ్బంది ఏర్పాటు చేసిన ట్యాగ్ ద్వారా ఎవరి శిశువు అనే విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను పిలిపించి అడిగితే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment