
పోరాటం ఫలప్రదం
►ఫలించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి దీక్ష
►చర్చలకు ఎంపీ శివప్రసాద్ చొరవ మంత్రి, ఎంపీ, కలెక్టర్ చర్చలు
►జిందాల్ ప్లాంట్ రామాపురంపరిసరాల్లో ఏర్పాటు చేయం: మంత్రి అమరనాథరెడ్డి
►డంపింగ్ యార్డును తరలిస్తాం:జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న
►ఎమ్మెల్యేతో దీక్ష విరమింపజేసిన రామాపురం మహిళలు
కేసీపేట(తిరుపతి రూరల్): ప్రజామద్దతు తోడుగా అంకిత భావంతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేపట్టిన దీక్షకు ప్రభుత్వం స్పందించింది. ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యను పరిష్కరిస్తామని మంత్రి అమరనాథరెడ్డి, ఎంపీ శివప్రసాద్, కలెక్టర్ ప్రద్యుమ్న ప్రకటించారు. జిందాల్ ప్లాంట్‌ను సైతం రామాపురం పరిసరాల్లో ఏర్పాటు చేసేది లేదని స్పష్టం చేశారు. చెత్త బాధిత గ్రామాల్లో వైద్య సేవలు మెరుగుపరస్తామని, మినరల్ వాటర్ అందిస్తామని, అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఐదు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను గురువారం ఎంపీ శివప్రసాద్ సమక్షంలో రామాపురం మహిళలు నిమ్మరసం ఇచ్చి చెవిరెడ్డి చేత విరమింపజేశారు. డంపింగ్ యార్డు బాధిత గ్రామాల్లోఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. బాణసంచా కాల్చి సంబరాలు చేశారు.
సమన్వయం చేసిన ఎంపీ శివప్రసాద్
డంపింగ్ యార్డును తరలించాలని, చెత్త ప్లాంట్‌ను రామాపురం పరిసరాల్లో ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డిని గురువారం ఉదయం ప్రభుత్వ వైద్యులు పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు. దీంతో స్థానిక ఎంపీ డాక్టర్ శివప్రసాద్ స్పందించారు. మంత్రి అమరనాథరెడ్డి, కలెక్టర్, కమిషనర్‌తో మాట్లాడారు. దీక్ష శిబిరం వద్దకు వచ్చి చర్చలకు రావాలని ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఒప్పించారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి పద్మావతీ అతిథి గృహంలో ఎమ్మెల్యే చెవిరెడ్డితో మంత్రి అమరనాథరెడ్డి, ఎంపీ శివప్రసాద్, కలెక్టర్ ప్రద్యుమ్న, కమిషనర్ హరికిరణ్, అర్బన్ ఎస్పీ విజయారావు రెండు గంటల పాటు చర్చలు జరిపారు.
డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు రోడ్డెక్కి పోరాడడానికి కారణాలను మంత్రి, ఎంపీ, అధికారులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి వివరించారు. పరిష్కార మార్గాలను కూడా సూచించారు. డిమాండ్లకు మంత్రి, ఎంపీ, అధికారులు అంగీకరించారు. ఎమ్మెల్యే, బాధిత ప్రజలు డిమాండ్ చేసినట్లు చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను రామాపురం పరిసరాల్లో ఏర్పాటు చేయబోమని మంత్రి ప్రకటించారు. డంపింగ్ యార్డును వేరొక ప్రాంతానికి తరలిస్తామన్నారు. డంపింగ్ యార్డు వల్ల పూడిపోయిన కాలువను శుభ్రం చేయడమే కాకుండా శుభ్రమైన వర్షపు నీళ్లు చెరువుకు వెళ్లేలా చేస్తామన్నారు.