
ప్రశ్నిస్తే సంకెళ్లా..
►ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు 120 మంది గ్రామస్తుల అక్రమ అరెస్ట్
►రోజంతా ఎమ్మెల్యేను స్టేషన్లకు తిప్పిన పోలీసులు
►నియోజకవర్గ వ్యాప్తంగా పెల్లుబుకిన నిరసనలు
►20గంటల పోలీస్ స్టేషన్‌లోనే మహిళలు
►అక్రమ అరెస్ట్‌లపై భగ్గు మన్న జనం, పార్టీ శ్రేణులు
►గ్రామానికి వచ్చి క్యాండిల్ ర్యాలీ, రాస్తారోకో
డంపింగ్‌యార్డు తరలించి తమ ఆరోగ్యం కాపాడాలంటూ రామాపురం పరిసర గ్రామల ప్రజలు చేస్తున్న ఆందోళనపై సర్కారు ఉక్కు పాదం మోపింది. అర్ధరాత్రి దాటాక అరెస్టులకు పూనుకుంది. కనీసం మహిళలనే విచక్షణ లేకుండా బలవంతంగా లాక్కుపోయారు. వీరిపక్షాన పోరాడుతున్న చంద్రగిరి ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ పోలీసులు ఆయన్ను జిల్లాలో స్టేషన్లు తిప్పుతూ అరాచక వైఖరిని ప్రదర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. అక్రమ అరెస్టులను ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
తిరుపతి రూరల్: రామచంద్రాపురం మండలం లోని రామాపురంలో గురువారం అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. తిరుపతి రూరల్, రామాచంద్రాపురం మండలాల్లోని 11 గ్రామాల్లోని వే లాది మంది ప్రజలకు ఏళ్ల తరబడి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. గ్రామస్తులతో కలిసి మూడు రోజులు గా శాంతియుతంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి నిరసనను కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక ఒంటిగంటన్నర ప్రాంతంలో ఇద్దరు ఏఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, పది మంది ఎస్‌ఐలు, 200 మంది పోలీసులు నిరసన శిబిరాన్ని చుట్టుముట్టారు. రోడ్డుపైనే నిద్రి స్తున్న 120 మందికి పైగా గ్రామస్తులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. స్థానికులు తీవ్రం గా ప్రతిఘటించారు. శిబిరాన్ని కూల్చివేశారు. అడ్డుకున్న వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల సహకారంతో చివరకు వారిని అరెస్ట్ చేసి తిరుపతి ఈస్ట్, ముత్యాలరెడ్డిపల్లి పోలీ స్‌స్టేషన్‌లకు తరలించారు.
తొమ్మిది గంటల పాటు హైటెన్షన్..
పోలీసులు వస్తున్నారని ముందుగానే గుర్తిం చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని గ్రామస్తులు ఓ ఇంటిలో ఉంచారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిని ఇంటిలో ఉండగా పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడానికి వీలులేదు. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు. తొమ్మిది గం టల పాటు రామాపురంలో హైటెన్షన్ నడిచింది. గ్రామస్తులను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఎమ్మెల్యేని సైతం బలవంతంగా అరెస్ట్ చేసేందుకు వందల మంది పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపై డంపింగ్ యార్డు బాధిత గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాపురం సర్కిల్‌ల్లో రాస్తారోకో చేపట్టారు.
తహసీల్దార్ వచ్చి...144 సెక్షన్ పెట్టి....
ఇంటిలో ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు మండల మెజిస్ట్రేట్ హోదా లో ఉన్న తహసీల్దార్ భాగ్యలక్ష్మిని ఆశ్రయిం చారు. ఆమె వచ్చి 144 సెక్షన్ విధించారు. తహసీల్దార్ పర్యవేక్షణలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేం దుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న గ్రామస్తులు ఎమ్మెల్యే అరెస్ట్‌ను నిరసిస్తూ అడ్డుకున్నారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించి నెట్టివేసి ఎమ్మెల్యే చెవిరెడ్డిని బలవంతంగా కారులో బుచ్చినాయుడుకండ్రిగకు, తర్వాత తొట్టం బేడు, శ్రీకాళహస్తి రూరల్, రేణిగుంట మీదుగా పుత్తూరుకు తీసుకెళ్లారు.
ఇదిలా వుండగా బీఎన్ కండ్రిగలో చెవిరెడ్డిని ఎంపీ వరప్రసాద రావు కలవడానికి ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదు. డంపింగ్ యార్డు తరలింపు ఒక్కటే తన డిమాండ్ అని స్పష్టం చేసినట్లు తెలిసింది. మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 20 గంటల పాటు ఎంఆర్‌పల్లి పోలీ స్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ నుంచి విడుదలయిన మహిళలు గ్రామంలోకి వచ్చి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చెవిరెడ్డి అక్రమ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ గ్రామంలో ర్యాలీ చేసి, డంపింగ్ యార్డుకు వచ్చే తిరుపతి చెత్త వాహనాలను అడ్డుకుని రాస్తారోకో చేశారు.