టెర్రార్...
- గ్రామీణుల పాలిట శాపంగా టెర్రాఫార్మా
- చెరువులు, కుంటలకు చేరుతున్న కెమికల్ నీరు
- మృత్యువాత పడుతున్న పశుపక్షాదులు
- అస్వస్థత బారిన ప్రజలు
లక్ష్యం సమున్నతం... ఆచరణే అధమం.. ఫలితం గ్రామీణుల బతుకు ఛిద్రం! ఇది దొడ్డబళ్లాపురం సమీపంలో ఏర్పాటు చేసిన టెర్రాఫార్మా ప్రస్తుత ముఖచిత్రం. చెత్తనుంచి ఎరువులు తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రస్తుతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామీణుల పాలిట శాపంగా మారింది. నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా ఇక్కడ చెత్తను డంప్ చేస్తుండడంతో వింత రోగాల బారిన పడి గ్రామీణులు విలవిల్లాడుతున్నారు. పశుపక్షాదుల మృత్యుఘోషకు అంతులేకుండా పోతోంది. ఒక ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలనే పాలకుల నీతి.. మరో ప్రాంత ప్రజలను అన్యాయానికి గురిచేస్తోంది.
దొడ్డబళ్లాపురం : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) పరిధిలో నిత్యం పోగవుతున్న టన్నుల కొద్ది చెత్తను దొడ్డబళ్లాపురం తాలూకాలోని గుండ్లహళ్లి వద్ద టెర్రాఫార్మాలో డంపింగ్ చేస్తున్నారు. చెత్త నుంచి ఎరువులు తయారు చేయాలనే లక్ష్యంతో టెర్రాఫార్మాను ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి తరలివస్తున్న చెత్త మొత్తాన్ని రీసైక్లింగ్ చేసేందుకు ఇక్కడి యంత్రాలకు తగిన సామర్థ్యం లేకపోవడంతో రోజూ చెత్త పేరుకుపోతూ వస్తోంది. నిబంధలను ఉల్లంఘిస్తూ ఇక్కడ చెత్తను డంప్ చేస్తున్నారు. వాస్తవానికి తడి, పొడి చెత్తను ఇక్కడ రీసైక్లింగ్ చేయడం ద్వారా ఎరువులను తయారు చేస్తారు. అయితే బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న లెక్కకు మించిన రసాయనిక పరిశ్రమల వ్యర్థాలను సైతం ఇక్కడ డంప్ చేస్తున్నారు.
నిబంధనల ప్రకారమైతే రసాయనిక వ్యర్థాలను ఆయా పరిశ్రమల వద్దనే రీసైక్లింగ్ చేసి తరలించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి రీసైక్లింగ్ చేయని రసాయనిక వ్యర్థాలను ఇక్కడ డంప్ చేస్తుండడంతో అవి భూమిలో కలిసి విషపూరితంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న వర్షాలకు విషపూరితమైన రసాయనిక నీరుగా మారి సమీపంలోని చెరువులు, కుంటల్లోకి చేరుకుంటున్నాయి. అంతేకాక భూగర్భ జలాల్లో సైతం ఇవి కలిసి బోరుబావుల్లోకి చేరుకుంటున్నాయి. ఇటీవల చుట్టపక్కల పాతిక గ్రామాలకు చెందని పశువులు చెరువులు, కుంటల్లోని నీరు తాగి చూస్తుండగానే పొట్ట ఉబ్బి వృత్యువాత పడుతుండడంతో గ్రామీణుల వేదనకు అంతులేకుండా పోయింది. మేతకు వెళ్లిన పశువులు తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో మార్గమధ్యలోనే మరణిస్తుండడం పాడిరైతులను మరింత కృంగదీస్తోంది. మరో వైపు వాన నీటికి చెత్త తడిసి మరింత దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ వాసన భరించలేక నాలుగు రోజుల్లోనే పదుల సంఖ్యలో గ్రామీణులు ఆస్పత్రుల పాలయ్యారు.
ఇదంతా టెర్రాఫార్మాకు అతి సమీపంలో ఉన్న సక్కరెగొల్లహళ్లి, కాశీపాల్య, గుండ్లహళ్లి గ్రామాల్లో మరీ ఎక్కువగా ఉంది. పశువులు, మేకలు, గొర్రెలతో పాటు కోళ్లు, పిట్టలు కూడా వృత్యువాత పడుతున్నాయి. నీరు తాగిన కొద్ది సేపటికి పొట్ట ఉబ్బి, ముక్కు, నోటి వెంట రసాయనిక మిశ్రీత నీరు కారుతుండగా విలవిల్లాడుతూ తమ కంటి ముందే పశువులు మరణిస్తున్నాయని గ్రామీణులు వాపోతున్నారు. దుర్వాసన వెదజల్లుతుండడంతో భరించలేక ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలను దుక్కి చేసుకోలేక పోతున్నట్లు రైతులు తెలిపారు. ప్రశాంతంగా భోజనం కూడా చేయలేని స్థితిలో ఉన్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి టెర్రాఫార్మా బారి నుంచి తమను కాపాడాలని పలువురు గ్రామీణులు వేడుకుంటున్నారు. కాగా, పాడి పశువులను కోల్పోయిన బాధిత రైతులు నాగరాజు, ముద్దన్న, జరీనా తదితరులు టెర్రాఫార్మా డంపింగ్ సెంటర్ నిర్వాహకులపై బెళవంగల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.