రూ. 2 కోట్ల బ్యాగ్ దొరికిందా.. లేదా?
నగర శివార్లలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో రూ. 2 కోట్లు దొరికాయన్న వార్త.. కలకలం రేపింది. అంతలోనే.. డబ్బులు ఏమీ దొరకలేదంటూ యార్డు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పడంతో అంతా తుస్‌మన్నట్లే అంటున్నారు. కానీ ఈ విషయంలో ప్రజలకు మాత్రం సవాలక్ష అనుమానాలు వస్తున్నాయి. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డులకు మంగళవారం ఓ బ్యాగ్ దొరికిందని, అందులో రూ. 2 కోట్ల డబ్బు ఉందని కథనాలు వచ్చాయి. అంత డబ్బు కళ్ల చూడటంతో ఒక్కసారిగా వాళ్లలో ఆశ పుట్టిందని, అయితే పంచుకోవడంలో లెక్కలు తేలకపోవడంతో గొడవపడిన గార్డులు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. డంపింగ్ యార్డ్లో దొరికిన పెద్దమొత్తంలో ఉన్న డబ్బుల బ్యాగ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చింది, ఎవరూ పెట్టారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారని కూడా తెలిసింది.
కానీ అక్కడే ఈ కథ మరో మలుపు తిరిగింది. అసలు యార్డులో డబ్బులేవీ దొరకలేదని డంపింగ్ యార్డు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నవీన్ కుమార్ అన్నారు. డబ్బు దొరికిందంటూ వచ్చినవన్నీ వదంతులు మాత్రమేనని ఆయన చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది అందరినీ విచారించామని, అయితే డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరించారు. దీంతో అసలు నిజంగా డబ్బు ఉందా.. లేదా అన్న విషయమై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.