
సాక్షి,మేడ్చల్‌జిల్లా: డంపింగ్ యార్డు కారణంగా జవహర్ నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాటల్లో చెప్పలేమని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌చార్జ్ మురళీధర్ రావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, డల్లాస్, వాషింగ్టన్, లండన్‌లా మారుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని, అయితే పక్కనే ఉన్న జవహర్‌నగర్ లో కర్చీఫ్ అడ్డం పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
సోమవారం దమ్మాయిగూడ ప్రజాసంగ్రామ యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎన్నికలు అంటే వరద సాయం అన్నారని, దుబ్బాక ఎన్నికలకు మరో పథకం, హుజురాబాద్ ఎన్నికల సమయంలో ‘దళిత బంధు’ మునుగోడు అంటే ‘గిరిజన బంధు’ పథకాలను తెరపైకి తెస్తున్నారన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంపై గత కొంతకాలంగా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును ఎత్తివేస్తామన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. కుటుంబ పాలన, అవినీతి, మాఫియా రాజ్యాన్ని అంతమొందించాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే నీతివంతమైన పాలన ప్రజలకు అందుతుందన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర నేతలు చాడ సురేష్‌రెడ్డి, డాక్టర్ విజయరామారావు , మాజీఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, కొల్లి మాధవి, కొంపెల్లి మోహన్‌రెడ్డి, జిల్లా నేతలు పి.హరీష్‌రెడ్డి, పటోళ్ల విక్రంరెడ్డి, జిల్లాల తిరుమల్‌రెడ్డి, అమరం మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment