కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల భిక్షే | Bandi Sanjay about Ministerial post | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల భిక్షే

Published Thu, Jun 20 2024 4:27 AM | Last Updated on Thu, Jun 20 2024 4:27 AM

Bandi Sanjay about Ministerial post

లాఠీదెబ్బలు, కేసులు, జైళ్లతోనే నాకీ గుర్తింపు 

కార్పొరేటర్‌ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదగడం బీజేపీలోనే సాధ్యం: బండి సంజయ్‌  

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: కరీంనగర్‌ ప్రజలు, కార్యకర్తలు పెట్టిన భిక్షతోనే తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కిందని బండి సంజయ్‌ అన్నారు. ‘‘కార్యకర్తలారా..ఆనాడు నాతో కలిసి మీరు కేసీఆర్‌ మూర్ఖపు పాలనపై పోరాడితే లాఠీదెబ్బలు తిన్నరు.. కేసులు ఎదుర్కొన్నారు..జైళ్లకు వెళ్లారు..రక్తం చిందించారు... ప్రజాసంగ్రామయాత్రలో నాతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ కష్టాలు లెక్క చేయకుండా 155 రోజులు 1600 కిలోమీటర్లకుపైగా నడిచారు.

పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడ్డారు..అందుకే ఈరోజు నాకీ పదవి వచ్చింది..ఈ పదవి మీరు పెట్టిన భిక్షే.. ప్రజలు, కార్యకర్తలకే ఈ పదవిని అంకితమిస్తున్నా’’అని సంజయ్‌ పేర్కొన్నారు. కేంద్రమంత్రి అయ్యాక బుధవారం తొలిసారి కరీంనగర్‌కు వచ్చిన బండి సంజయ్‌కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కరీంనగర్‌లో సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. 

కార్పొరేటర్‌ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగానంటే ఇది కేవలం బీజేపీవల్లే సాధ్యమైందని, మహాశక్తి అమ్మవారి ఆశీస్సులు అండగా ఉన్నాయన్నారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణలో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై ప్రయోగించిన లాఠీదెబ్బలతోపాటు జైలుకు పంపడం ద్వారా నాకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. కేంద్ర మంత్రి పదవిని తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు.  

రాజన్నకు కోడె మొక్కు చెల్లింపు  
వేములవాడ: ‘ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజన్న ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి నేనేంటో చూపిస్తా’ అని బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. దేవుడిని మోసం చేస్తే తగిన శాస్తి జరుగుతుందనడానికి కేసీఆర్‌ ప్రభుత్వమే నిదర్శనమన్నారు. బుధవారం రాత్రి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు.కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రూ.400 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి దేవుడికే శఠగోపం పెట్టిన చరిత్ర కేసీఆర్‌ సర్కార్‌దేనని విమర్శించారు.   

‘సెల్యూట్‌ తెలంగాణ’ పేరిట కేంద్ర మంత్రులు, ఎంపీలకు నేడు సన్మానం 
సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గురువా రం కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతోపాటు పార్టీ ఎంపీలకు సన్మానం చేయనున్నారు. కేంద్ర బొగ్గు, గను ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కిషన్‌రెడ్డి తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం సా యంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలను ర్యాలీగా పార్టీ కార్యాలయం వరకు తీసుకురానున్నారు. 

ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద ‘సెల్యూట్‌ తెలంగాణ’పేరిట పార్టీ ఎంపీలు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీని సత్కరిస్తారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున 8 మంది ఎంపీలను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సభను నిర్వహిస్తారు. తర్వాత చారి్మనార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో నిర్వహించే ‘మహా హారతి’కార్యక్రమంలో వీరంతా పాల్గొంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement