
కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటా
ఎన్నికల ఫలితాల అనంతరం బండి సంజయ్
కరీంనగర్‌టౌన్: ‘బండి సంజయ్ గలీజోడు.. ముస్లింలంతా ఏకమై నన్ను ఓడించాలని కేసీఆర్ పిలుపునిచి్చండు. ఏమైంది? అందరూ ఏకమై నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్ అడ్రస్సే గల్లంతు చేశారు’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం సంజయ్ కరీంనగర్‌లోని ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లి రిటరి్నంగ్ అధికారి నుంచి గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను ఓడించేందుకు ఒకవర్గం ఓట్లను ఏకం చేయాలనుకున్న కేసీఆర్, కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించారని, కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవాతోనే తనకు ఇంతటి మెజారిటీ దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాడి ఆ పార్టీ అంతు చూస్తామని హెచ్చరించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం గతం కన్నా ఎక్కువ నిధులు తీసుకొస్తానని, మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాగా, ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లేముందు, ఆ తర్వాత గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం ఇంటికి చేరుకుని సంజయ్ తన తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఆయన గెలుపు సందర్భంగా కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. కుటుంబ సభ్యులతో కలసి సంజయ్ ఈ సంబరాల్లో పాల్గొన్నారు.