
తమ అంగీకారం లేకుండా భూములు సేకరించేందకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మూలలంక రైతులు
దౌర్జన్యం.. తన పని తాను చేసుకుపోతోంది. పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డ్ కోసం భూములు కోల్పోతున్న రైతులు న్యాయం కోసం పోరాడుతున్నారు.
- రైతుల అంగీకారం లేకుండా భూసేకరణ
- రైతులకు నోటీసులు ఇవ్వచూపిన రెవెన్యూ సిబ్బంది
- తీసుకోకపోవటంతో ఇంటి గోడలకు అంటించిన సిబ్బంది
- ఇదేం న్యాయం అంటూ
- ఆవేదన వ్యక్తం చేస్తున్న మూలలంక రైతులు
దౌర్జన్యం.. తన పని తాను చేసుకుపోతోంది. పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డ్ కోసం భూములు కోల్పోతున్న రైతులు న్యాయం కోసం పోరాడుతున్నారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించాలని మూడు నెలలుగా దీక్షలు కూడా చేస్తున్నారు. అధికారులు తమతో చర్చలు జరుపుతారేమోనని ఎదురుచూస్తున్న సమయంలో దౌర్జన్యం నిద్ర లేచింది. రైతులు నోటీసులు తీసుకునేందుకు అంగీకరించకపోవడంతో వారి ఇళ్లకు అతికించి రెవెన్యూ సిబ్బంది రూపంలో విజయగర్వంతో పరిహాసమాడింది. ఇదీ పోలవరం మండలంలోని మూలలంక గ్రామంలో దుస్థితి.
పోలవరం : రైతులతో చర్చలు జరపకుండా, వారి అంగీకారం లేకుండా ఏకపక్షంగా భూములు సేకరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. పోలవరంలోని మూలలంక ప్రాంతంలో భూములు కలిగిన రైతులకు ఈ మేరకు శనివారం నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు తీసుకునేందుకు రైతులు అంగీకరించలేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది వారి ఇంటి గోడలకు నోటీసులు అంటించి ఫొటోలు తీశారు. నోటీసులు అంటించినట్టు చుట్టు పక్కల ఇళ్ల వారితో సంతకాలు తీసుకున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అదికారులు తమతో సంప్రదించి నష్టపరిహారం నిర్ణయించకుండా, తమ అంగీకారం తీసుకోకుండా భూములు సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డ్ కోసం పోలవరంలోని మూలలంక ప్రాంతంలో 150 మంది రైతులకు సంబం ధించి 207 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తున్న విషయం తెలి సిందే. దీనికి సంబంధించిన రైతులు మూడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
కొన్ని రోజుల పాటు తమ భూములకు సరైన ధర చెల్లించాలంటూ రిలే దీక్షలు కూడా చేశారు. అధికారులు నష్టపరిహారం విషయమై తమతో చర్చలు జరుపుతారని భావించామని, కాని ఏకపక్షంగా నోటీసులు జారీ చేయటం దారుణమని రైతులు చౌటపల్లి లక్ష్మి, సంగినీడి రాంప్రసాద్, నంగినీడి కృష్ణ, తాడి మంగారాం, పసుపులేటి సత్యనారాయణ తదితరులు వాపోతున్నారు.
అవార్డు పాసయ్యింది
మూలలంక భూములకు సంబంధించి అవార్డు పాసయ్యింది. మూడు సార్లు రైతులకు కబురు చేశాం. చ ర్చలకు రాలేదు. బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవ్వాలని నోటీసు జారీ చేశాం. అకౌంట్ నెంబరు ఇస్తే నష్టపరిహారం సొమ్ము జమ చేస్తాం. లేకుంటే ఎల్‌ఏఓ అకౌంట్‌కు వేస్తాం.
- ఎస్.లవన్న, ఆర్డీవో, జంగారెడ్డిగూడెం
నోటీసులు అంటించారు
నాకు మూలలంకలో 0.35 సెంట్లు భూమి ఉంది. దీనిని డంపింగ్ యార్డ్ కోసం సేకరిస్తున్నట్టు రెవెన్యూ సిబ్బంది నోటీసు తీసుకు వచ్చి సంతకం చేయమన్నారు. నేను సంతకం చేయలేదు. నోటీసు మా ఇంటి గోడకు అంటించి ఫొటో తీసుకున్నారు.
- నాగిరెడ్డి శ్రీనివాసరావు, మూలలంక రైతు, పాత పోలవరం
అడిగినా సమాధానం చెప్పలేదు
నాకు మూలలంకలో 1.49 సెంట్లు భూమి ఉంది. దీన్ని సేకరిస్తున్నట్టు రెవెన్యూ సిబ్బంది మా ఇంటి గోడకు నోటీసు అంటించారు. అడిగినా సమాధానం చెప్పలేదు. రైతులతో మాట్లాడి నష్టపరిహారం నిర్ణయించకుండా నోటీసు అంటించారు. ఇది అన్యాయం.
- పసుపులేటి శ్రీనివాస్, మూలలంక రైతు, పోలవరం