ఇటువైపు ఒక అడుగు | Dr. Jayasree Kiran has taken a step towards the dumpyard | Sakshi
Sakshi News home page

ఇటువైపు ఒక అడుగు

Published Fri, Jun 1 2018 12:06 AM | Last Updated on Sat, Sep 29 2018 5:47 PM

Dr. Jayasree Kiran has taken a step towards the dumpyard - Sakshi

డంప్‌యార్డ్‌లో పనిచేస్తున్న మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న జయశ్రీకిరణ్‌

మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే!ఆ తర్వాత మరిన్ని అడుగులు పడతాయి. వాటికి మరికొన్ని అడుగులు జత కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి ఓ అద్భుతం జరగడం కోసం డంప్‌యార్డ్‌ 
వైపు ఒక అడుగు వేశారు డాక్టర్‌ జయశ్రీ కిరణ్‌. తర్వాత అడుగు మనది కావాలి.  మనందరిదీ కావాలి. 

డాక్టర్‌ జయశ్రీ కిరణ్‌ లెక్చరర్‌. సైఫాబాద్‌ సైన్స్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. ఉంటున్నది హైదరాబాద్‌లోని తార్నాక. గత ఐదు నెలలుగా ఆమె డంప్‌యార్డ్‌ల చుట్టూ ఉండే జనావాసాల్లోకి వెళ్లివస్తున్నారు. వాళ్లంతా  డంప్‌యార్డే జీవనాధారం అయినవాళ్లు. డంప్‌యార్డ్‌కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జబ్బు చేస్తే క్రమం తప్పకుండా వాడాల్సిన మందుల గురించి ఆ సమీపంలోని ఇల్లిల్లూ తిరిగి, ముఖ్యంగా అక్కడి మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్‌ అధికారులను కూడా కలిసి డంప్‌యార్డ్‌ వద్ద హెల్త్‌ క్యాంపులను ఏర్పాటు చేయమని కోరుతున్నారు. తను కూడా హెల్త్‌క్యాంపులను పెట్టి, అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి  సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ‘దయచేసి డంప్‌యార్డ్‌ వైపు ఒకసారి చూడండి’ అని నగరవాసులను కూడా కోరుతున్నారు! ఎందుకిలా జయశ్రీ ఏరి కోరి ప్రమాదంలోకి వెళుతున్నారు? ఇదే మాటను ఆమెను అడిగితే.. ‘నేను వెళ్లడం.. అంటుంచండి. వాళ్లంతా ప్రమాదంలోనే కదా ఉంటున్నారు!’ అంటారు ఆవేదనగా.  

జబ్బుల దిబ్బలు!
పగిలిపోయిన ట్యూబ్‌లైట్లు, గాజు బాటిళ్లు, గ్లాసు ముక్కలు చెత్తబుట్టలోనే వేస్తుంటాం. డయాబెటిస్‌ పేషెంట్స్‌ రోజూ తీసుకునే ఇన్సులిన్‌ ఇంజెక్షన్లూ అదే బుట్టలోనే. ఆడవాళ్లు వాడేసే శానిటరీ న్యాప్‌కిన్లు, ఉపయోగంలో లేని బ్యాటరీలు, డిజిటల్‌ వేస్టేజ్‌.. ఒకటేమిటి హానికరమైన ఎన్నో వస్తువులు చెత్తలోకి చేరుతుంటాయి. అవన్నీ డంప్‌యార్డ్‌కి చేర్చి, ఉపాధి కోసం వాటిలోనే తిరిగేవారికి ఆ గాజు ముక్కలు, ఇంజెక్షన్లు గుచ్చుకుని.. వ్యాధుల పాలిట పడుతున్నారు. వాడిపడేసిన బ్యాటరీలు ఒక్కోసారి పేలుతుంటాయి కూడా! ఇదంతా  డంప్‌యార్డ్‌ వద్ద హెల్త్‌క్యాంప్‌ ఏర్పాటు చేశాక, అక్కడి వారి పరిస్థితులు ప్రత్యక్షంగా చూశాక జయశ్రీకి మరింతగా స్పష్టం అయ్యింది. అసలు ఈ జబ్బుల దిబ్బల్లోకి వెళ్లాలన్న ఆలోచన జయశ్రీకి ఎలా వచ్చింది? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. 

మూడు రోజులు బండి రాలేదు
‘ఉద్యోగానికి కొంతకాలం సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జరిగిందది! ఆ సమయంలో వరుసగా మూడు రోజుల పాటు చెత్త తీసుకువెళ్లే వాళ్లు రాలేదు. ఆ దుర్గంధాన్ని భరించలేకపోయాను. నాల్గవ రోజు చెత్త తీసుకెళ్లే ఆమె వస్తే ‘ఎందుకు రావట్లేదు?’ అని కోపగించుకున్నాను. ‘మా ఆయనకి ఒంట్లో బాగోలేదమ్మా! కడుపునొప్పి. పోయిన వారమే నాకూ ఆసుపత్రి ఖర్చు వెయ్యి రూపాయిలయ్యింది. ఇప్పుడు ఆయనకు..’ అంటూ లోపలికి వచ్చి చెత్త డబ్బా తీసుకెళ్లింది కుంటుకుంటూ. చెత్తను తను తెచ్చిన బండిలో వేసుకుని, చెత్తబుట్టను ఇవ్వడానికి తిరిగొచ్చింది. ‘నీకేమయ్యింది కుంటుతున్నావ్‌.. ’ అన్నాను. ‘కాలికి ఏదో గుచ్చుకుంది. ఇరవై రోజుల పైనే అయ్యింది. నొప్పి అస్సలు తగ్గడం లేదు’ అంది. ‘మీకిలా ఉంటే  మీ పిల్లల్నెవరు చూస్తారు’ అన్నాను. ‘మా పిల్లోడికి ఐదేళ్లమ్మా! ఎక్కడేస్తే అక్కడే పడుంటాడు. పిలిచినా పలకడు. డాక్టర్లకు చూపిస్తే మెదడు ఎదుగుదల లేకుండానే పుట్టాడు అని చెప్పారు, ఏం చేస్తాం. మా తలరాత’ అంటూ ఆమె ఇంకో ఇంట్లో చెత్త తీసుకెళ్లడానికి వెళ్లబోయింది. ‘మీరెక్కడుంటారు.. ఈ చెత్తంతా ఎక్కడకు తీసుకెళతారు?’ అని అడిగాను. ‘డంప్‌యార్డ్‌ ఉందిగా అమ్మా! అక్కడకు తీసుకెళ్లి వేస్తాం.. మేం ఉండేది కూడా అక్కడి బస్తీలోనే’ అని చెప్పి, ముందుకు వెళ్లిపోయింది.

నేరుగా డంప్‌యార్డుకే వెళ్లిపోయా!
ఆ తర్వాత రోజు చెత్త తీసుకెళ్లడానికి ఆమె రాలేదు. మనసు మనసులో లేదు. ఏమై ఉంటుంది ఆమెకు. భర్తకు ఆరోగ్యం బాగోలేదు. పిల్లాడు ఎలా ఉన్నాడో.. ఆమె చెప్పిన స్థితి కళ్ల ముందు కదలాడుతోంది. ఇంట్లో ఉండబుద్ది కాలేదు. ఆమె చెప్పిన డంప్‌యార్డ్‌ ఎక్కడుంటుందో కనుక్కొని వెళ్లాను. ఇక్కడే ఉందన్నట్టు ముందుగా వచ్చిన దుర్వాసన చెప్పేసింది. వంద ఎకరాల్లో ఉండే ఆ డంప్‌యార్డ్‌ను కాసేపు అక్కడే ఉండే చూశా! కనుచూపుమేరంతా చెత్త. ముక్కులు పగిలిపోయే దుర్వాసన. భుజాలకు పెద్ద పెద్ద సంచులు వేసుకున్న కొందరు ఆడవాళ్లు, పిల్లలు, మగవాళ్లు చెత్తను కెలుకుతూ స్క్రాప్‌ని ఏరుకుంటున్నారు. వాళ్ల చేతులకు గ్లౌజులు లేవు. కొందరి కాళ్లకు చెప్పులు  లేవు. పందులు, కుక్కలు ఆ ఏరియా మాదేనన్నట్టు తిరుగుతున్నాయి. అక్కడే ఉన్న ఒకట్రెండు చెట్లకు ఐదారు గుడ్డ ఊయలలు పసిపిల్లలను నిద్రపుచ్చుతున్నాయి. ఆ పిల్లల తల్లులు ఆ మురికి చేతుల్తోనే పిల్లలను ఎత్తుకుంటున్నారు. అలాగే పాలు పడుతున్నారు. అక్కడ వారికి చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. వెంట తెచ్చుకున్న బాటిళ్ల నీళ్లతో గొంతులు తడుపుకుంటున్నారు. దాదాపు వందల మంది ఆ డంప్‌యార్డే ఆధారంగా జీవిస్తున్నారు. రెండు రోజులు ఇంట్లోని చెత్తను తీసుకెళ్లకపోతేనే విసుక్కుంటాం. అలాంటిది నిత్యం చెత్తలోనే బతుకుతున్న వారిని చూస్తుంటే కడుపులో దేవినట్టయ్యింది. నా భర్త కిరణ్‌కుమార్‌ డాక్టర్‌ కావడంతో నా ఆవేదనను వెంటనే అర్థం చేసుకున్నారు. హెల్త్‌ క్యాంపు ఏర్పాటులో తనూ ఓ చేయి కలిపారు.

పర్మిషనిచ్చినా చాలు..!
రోజూ వేల టన్నుల చెత్త ఒక డంప్‌యార్డ్‌కి చేరుతుందట! నగరంలో ఇలాంటి డంప్‌యార్డ్‌లు 24 ఉన్నాయి. వాటన్నింటినీ తిరిగాను. విదేశాలలో ఇళ్ల నుంచి చెత్తను సేకరించే పద్ధతులు, అక్కడ ప్రజలు తీసుకునే జాగ్రత్తలు, చెత్తను రీ సైక్లింగ్‌ చేసే విధానాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాను. వాటిలో మనం కనీసం 50 శాతం పాటించినా ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందనిపించింది. అన్ని డంప్‌యార్డ్‌ల వద్ద హెల్త్‌క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను. రెండు రోజుల క్రితమే పటాన్‌చెరువు, మియాపూర్‌లలోని డంప్‌యార్డ్‌ల వద్ద హెల్త్‌ క్యాంపును ఏర్పాటు చేశాం. తాగునీటి సౌకర్యం కోసం వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. మిగతా డంప్‌యార్డ్‌ల వద్ద కూడా హెల్త్‌ క్యాంపులు పెట్టి, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇందుకు తగినంత వైద్య సిబ్బంది, వాలంటీర్ల లేమి ఉంది. రాబోయేది వర్షాకాలం. ఈ కాలంలో ఆరోగ్య సమస్యల సంఖ్య ఇంకా ఎక్కువే. కాలుష్యం తగ్గడానికి డంప్‌యార్డ్‌ చుట్టూ ఔషధ మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని, తాగునీటి వసతితో పాటు చేతులు, ఒళ్లు శుభ్రం చేసుకోవడానికి తగినన్ని నీళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నాను. పర్మిషన్‌ ఇచ్చినా ఆ పనిని నేను కొద్ది కొద్దిగానైనా నెరవేర్చుకుంటూ వెళ్లగలననే నమ్మకం నాకుంది’’ అని చెప్పారు జయశ్రీ. 

‘‘ఇన్నాళ్లు నేను చేసిన ఉద్యోగం పిల్లల భవిష్యత్తుకు మార్గం చూపేది. ఇప్పుడు డంప్‌యార్డ్‌ చుట్టూ పేరుకుపోయిన అనారోగ్య పరిస్థితుల్ని తొలగించడానికి నా చుట్టూ ఉన్న నలుగురిని తట్టిలేపాలని నిశ్చయించుకున్నాను’’ అంటున్నారు జయశ్రీ. 

ప్రతి ఇంటికీ బాధ్యత ఉంది
మన దగ్గర తడి చెత్త–పొడి చెత్త అని, చెత్తను వేరు చేసే రెండు విధానాలు ఉన్నాయి. కానీ, వాటిని పట్టించుకునే వారే లేరు. ఇళ్ల వద్దే చెత్తను మనం చాలా రకాలుగా తగ్గించవచ్చు. తడి చెత్తను కంపోస్ట్‌ ఎరువుగా మార్చుకోవచ్చు. పొడి చెత్తలోనూ హానికారకమైన (సిరంజులు, సూదులు, గాజు ముక్కలు, బ్యాటరీల.. వంటివి) వస్తువులను విడిగా ఒక ప్యాకెట్‌లో వేసి ఇస్తే వాటిని వాళ్లు అంతే జాగ్రత్తగా తీసుకెళ్లగలరు. నివారణ మన ఇంటి నుంచి మొదలైతే సమాజ ఆరోగ్యం బాగుంటుంది. – జయశ్రీ 
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement