రైల్వే కాలనీలు, సాధారణ ప్రజల సమ్మేళనంగా దశాబ్దాల కాలంగా సికింద్రాబాద్ నగరం వర్ధిల్లింది. రైల్వే కాలనీలు, కార్యాలయాలు, స్టేషన్ల సమాహారంగా ఈ ప్రాంతం ప్రత్యేకతను చాటుకుంది. ఇదిలా ఉండగా రైల్వే కాలనీలు, స్థలాల మీదుగా సాధారణ ప్రజలు రాకపోకలకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉండేవి. క్రమేణా పరిస్థితులు మారుతున్నాయి. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల తొలగింపుతో రైల్వే కాలనీలు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఈ ప్రాంతాల మీదుగా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న రైల్వే అప్రోచ్ రోడ్లు కనుమరుగు అవుతున్నాయి. కొంతకాలం క్రితం హమాలిబస్తీ, మెట్టుగూడ ప్రాంతాల్లో రోడ్లను మూసివేసిన అధికారులు తాజాగా మరిన్ని రోడ్లను మూసి వేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
దశాబ్దాల కాలంగా...
సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తం రైల్వే స్థలాలు దశాబ్దాల కాలంగా ఆవరించి ఉన్నాయి. మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట డివిజన్ల పరిధిలో రైల్వేశాఖకు చెందిన కాలనీలు నెలకొని ఉన్నాయి. ఆవిర్భావ కాలం నుంచి రైల్వే రోడ్ల మీదుగా పరిసర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వందలాది మంది సాధారణ ప్రజలు పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లడం కోసం రైల్వే రహదారులను వినియోగించుకుంటున్నారు.
శిథిలావస్థకు చేరడంతో....
దశాబ్దాల క్రితం నిర్మించిన రైల్వే క్వార్టర్లు క్రమేణా శిథిలావస్థకు చేరుకున్నాయి. శిథిలావస్థకు చేరుతున్న క్వార్టర్లను రైల్వే అధికారులు నేలమట్టం చేస్తూ వస్తున్నారు. ఖాళీ ప్రదేశాలుగా మారుతున్న సదరు స్థలాల చుట్టూ అధికారులు ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు. పనిలో పనిగా ఆయా కాలనీల్లోంచి లోగడ కొనసాగిన అప్రోచ్ రోడ్లను కూడా మూసివేస్తున్నారు. మైదానాలుగా మారుతున్న రైల్వే క్వార్టర్లు, కాలనీల స్థలాల్లో కొన్నింటిని రైల్వే అధికారులు పరిరక్షిస్తున్నారు. ఇంకొన్ని స్థలాలను ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇచ్చేశారు.
రహదారుల మూసివేతలు
పూర్వకాలం నుంచి రైల్వే అప్రోచ్ రోడ్లను వినియోగించుకున్న లష్కర్ ప్రజలకు తాజాగా ప్రవేశాల మూసివేత వ్యవహారం గుదిబండగా మారుతుంది. ఈ వ్యవహారాల్లో భాగంగా హమాలిబస్తీ – చిలకలగూడ కూడలి, విజయపురికాలనీ–రైల్వే ఆసుపత్రి, లాలాగూడ–మారేడుపల్లి అప్రోచ్ రోడ్లను ఇప్పటికే మూసివేశారు. లీజుదారులు రైల్వే స్థలాల్లో నిర్మాణం పనులు ప్రారంభిస్తే మరిన్ని రహదారులు మూతడబడే అవకాశాలు ఉన్నాయి.
ఇబ్బంది పడుతున్న ప్రజలు
రైల్వే అధికారులు ఎడాపెడా రోడ్లు మూసివేస్తుండడంతో పరిసర ప్రాంతాల వెళ్లి రావడం కోసం తీవ్ర ఇబ్బందులపాలవుతున్నాంమని స్థానికులు వాపోతున్నారు. సమీపంలోని ఆసుపత్రి, పాఠశాల, బస్‌స్టాప్‌లకు వెళ్లడానికి కోసం కిలోమీటర్ల మేర తిరగాల్సి వస్తుంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు కూడా సరైన సమయంలో వచ్చే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి అప్రోచ్ రోడ్ల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలి.
చదవండి: మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులు
అనుమతిస్తే డంపింగ్‌యార్డులుగా మారుతున్నాయి : అధికారులు
రైల్వే స్థలాల మీదుగా ప్రయాణాలకు అనుమతిస్తే వాటిని చెత్త డంపింగ్ కేంద్రాలుగా మార్చుతున్నారు. అల్లరిమూకలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులు వ్యర్థ పదార్థాలు డంప్ చేస్తున్నారు. రైల్వే స్థలాల పరిసర ప్రాంతాల ప్రజలకు రక్షణ, ఆరోగ్యకర వాతావరణం కోసం మాత్రమే అప్రోచ్ రోడ్లను మూసివేసి, రైల్వే స్థలాల్లోకి ప్రవేశాలను కట్టడి చేస్తున్నామని రైల్వే డివిజనల్ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment