మత్తులో పాడి
►పాడిపశువులకు దాణాగా బీరు వ్యర్థం
►పాలు పెరుగుతాయని దారుణం
►దుష్ఫలితాలకు అవకాశం
►మూగ జీవికి వేదన
రోజుకు ఒక బంగారు గుడ్డు పెట్టే బాతును అత్యాశకు పోరుు చంపుకున్నట్లు... రాయచోటి ప్రాంతంలో కొందరు పశువులకు దాణాగా ప్రమాదకరమైన బీరు వ్యర్థాలను వాడుతున్నారు.. మూగజీవాలకు నరకం చూపెడుతున్నారు. కాసిన్ని పాల కోసం బీరు వ్యర్థాన్ని ఎరగా వాడి వాటి జీవిత కాలాన్ని హరిస్తున్నారు. పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోవడానికి కూడా కారణం అవుతున్నారు. కుటుంబ పోషణకు జీవితకాలం కొండంత అండగా నిలిచే పాడిపశువుల విలువ మరచి చేతులారా చంపుకుంటున్నారు.
రాయచోటి టౌన్ : రాయచోటి పశు సంవర్ధ శాఖ పరిధిలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఎక్కువ. 25వేల మందికి పైగా పాడి రైతులు జీవనం సాగిస్తున్నారు. కొందరు స్వార్థపరులు చేసిన ప్రచార మాయలో పడిన రైతులు తమ జీవనాధారమైన పశువులకు విషపు దాణా పెడుతున్నారు. పాలు కొద్దిగా ఎక్కువ ఇస్తాయని ఆశపడి బీరుపొడిని తినిపించి తమకు తామే నష్టం కలుగజేసుకుంటున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు కాసులు పండించుకుంటున్నారు.40 కిలోల బరువున్న బీరు పొడిని రూ.330లకు పాడి రైతులకు అమ్ముతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను బయటకు తీసుకెళ్లి పడేయాల్సిందిపోయి దాన్ని ఇలా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
ఊరి బయట వ్యాపారాలు
ఈ బీరు పొడిని అధికారుల కళ్లు కప్పి అమ్మేస్తున్నారు. కేవలం పాడి రైతులకు మాత్రమే సమాచారం ఇచ్చి ఊరి పొలిమేర్లలోనే విక్రయిస్తున్నారు. అది కూడా గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడో తయారు చేసే వ్యర్థ పదార్థాలను తడి కూడా ఆరకుండా తీసుకొచ్చి రైతులకు కట్టబెడుతున్నారు. దాన్ని రైతులు తమ పాడి పశువులకు వేస్తున్నారు. ఆ పొడిని తడి ఆరక ముందే వేయడం వల్ల ప్రాంణాంతమనే విషయం వారికి తెలియడం లేదు.
పచ్చిపొడితో ప్రాణాలకు ముప్పు
పచ్చి పొడి(బీరు వ్యర్థం)లో కొన్ని రకాల ప్రాణాంతాక సూక్ష్మజీవులు నిల్వచేరతాయని, కంటికి కనిపించని ఫంగస్ తయారై అది పశువు కడులోకి చేరి జీర్ణవ్యవస్థపై దుష్ర్పభావం చూపిస్తుందని పశువైద్యాధికారులు అంటున్నారు. ఈ మత్తు పదార్థం తినడం వల్ల తాత్కాలికంగా పాలు ఎక్కువ ఇచ్చినా... ఉత్పత్తి త్వరగా తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. అసాధారణంగా అధిక పాలను ఇవ్వడం వల్ల తన శరీరంలోని శక్తిని త్వరగా కల్పోయి పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది. రెండు ఈతలు తరువాత చూడి నిలబడదని, ఒక వేళ చూడి నిలబడినా ఈనేలోపు దూడ మృతి చెందడమో... లేక మధ్యలో ఈసుకపోవడమో సంభవిస్తుందని సూచిస్తున్నారు. 15-16 సంవత్సరాలు జీవించాల్సిన పాడి పశువు కేవలం 7-8 సంవత్సరాలకే మరణిస్తారుు. పాడి పశువు జీవిత కాలంలో 8-10 దూడలను ఇచ్చే సామర్థ్యం నుంచి కేవలం రెండు లేదా మూడిటికే పరిమితమవుతుంది.
బీరు పొడి తినిపిస్తే పశువుకు ప్రమాదం
కడప అగ్రికల్చర్ : పశువులకు బీరు తయారు చేయగా వచ్చే వ్యర్థ పదార్థాన్ని రాయచోటి డివిజన్‌లో కొందరు అమ్ముతున్నారు. దాన్ని పశువులకు ఆహారంగా వాడితే దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలుతాయి. తడిగా ఉన్నది పెడితే మరింత ప్రమాదం. జీర్ణకోశ వ్యాధులు సంక్రమించి పశువు ఆయుస్సు తగ్గిపోయి మరణిస్తుంది. పాలు కూడా నాణ్యత కోల్పోయి దుర్గంధం వస్తాయి. అమ్మకానికి ఈ పాలు పనికి రాకుండా పోయే ప్రమాదముంది. పాడి పశువులకు ప్రకృతి సిద్ధమైన గడ్డి పోషక విలువున్న ఆహార పదార్థాలను మాత్రమే ఇవ్వాలి.
- హేమంత్‌కుమార్,
అసిస్టెంట్ డెరైక్టర్, జిల్లా పశుగణాభివృద్ధి శాఖ