
ఊడ్చిన చెత్త ఊరినెత్తిన
పల్లెల్లో కొరవడిన పారిశుధ్యం
పంచాయతీల్లో కానరాని డంపింగ్ యార్డులు
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
మహారాణిపేట (విశాఖ): పల్లెల్లో పారిశుధ్యం కొరవడింది. ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. స్వచ్ఛభారత్ కార్యక్రమం తొలినాళ్లలో కొందరు చీపుళ్లు పట్టుకుని హడావుడి చేశారు. ప్రభుత్వ కార్యాలయల పరిసరాల్లో ఊడ్చడం, పరిశుభ్రం చేయడం కనిపించేది. దీంతో గ్రామాల స్వరూపం మారిపోతుందని అంతా ఆశించారు. పారిశుధ్యం మెరుగు పడుతుందని ఆశించారు. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం రెండడుగులు ముందుకేసి ప్రతి గ్రామంలోనూ డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు 20 నుంచి 30 సెంట్లు భూమి కేటాయించాలని తహశీల్దార్లు, సర్పంచ్‌లను ఆదేశించింది. అధికారుల పట్టించుకోని తనమో, సర్పంచ్‌ల నిర్లక్ష్యమో కాని జిల్లాలో ఇది అమలు కాలేదు. ఒక్క పంచాయతీలోనూ డంపింగ్‌యార్డు ఏర్పాటు కాలేదు. అవగాహన లోపంతో గ్రామీణులు ఇళ్లల్లో ఊడ్చిన చెత్తను తెచ్చి రోడ్లపై వేసేస్తున్నారు. దీంతో పారిశుధ్యం కొరవడి పరిస్థితి దయనీయంగా ఉంటోంది.
12 పంచాయతీల్లోనే స్థలాల గుర్తింపు
జిల్లాలో 925 పంచాయతీల్లో కేవలం 12మంది సర్పంచ్‌లు మాత్రమే డంపింగ్‌యార్డులకు స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించారు. మిగతా వారు పట్టించుకోలేతదు. అసలు ఈ యార్డులు ఎవరు ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంత వరకూ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఈ లక్ష్యం నీరుగారిపోతోంది.గ్రామాల్లో పారిశుధ్యం కొరవడి అన్ని వీథుల్లోనూ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి. జనం రోగాలతో మంచానపడి విలవిల్లాడుతున్నారు.
యార్డుల ఏర్పాటు ఎలా అంటే..
డంపింగ్‌యార్డుకు 20 నుంచి 30 సెంట్లు స్థలం ఉండాలి. దానిని గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్‌లే గుర్తించాలి. పంచాయతీ స్థలం లేకపోతే రెవెన్యూ అధికారులు కేటాయించాలని సర్పంచ్ మండల తహశీల్దార్‌కు లేఖ రాయాలి. అప్పుడు రెవెన్యూ అధికారులు ఆ పంచాయతీ పరిధిలో 30సెంట్లు స్థలం గుర్తించి ఇవ్వాలి. ఉపాధిహామీ పథకంలో ఈ డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయాలి. గ్రామంలో ఊడ్చిన చెత్తనంతటినీ తెచ్చి ఇక్కడ వేయాలి. ఈ విధానం ఏ మండలంలోనూ కానరావడం లేదు. అసలు ఈ డంపింగ్‌యార్డులు గురించి పంచాయతీ అధికారులే పట్టించుకోవడం లేదు. గ్రామపంచాయతీలపై ఈవోపీఆర్డీల పర్యవేక్షణ లేదు.
ఇబ్బంది కరంగా ఉంది
శ్రీరాంపురంలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ప్రాంతాల్లో రోడ్డుకు ఇరు వైపులా రోజూ చెత్త వేసేస్తున్నారు. వ ర్షం పడితే ఇబ్బందిగా ఉంటోంది. డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటకయినా అధికారులు స్పందించాలి. రోడ్డు పక్కన చెత్త వేయకుండా చూడాలి.
-ఎం.శ్రీనివాసరావు, శ్రీరాపురం