మూలలంక ప్రాంతంలో డంపింగ్ యార్డును పరిశీలిస్తున్న ఎన్జీటీ బృందం సభ్యులు
పశ్చిమగోదావరి, పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డు నిర్వహణ కోసం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) సూచనల మేరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మూలలంక ప్రాంతంలోని డంపింగ్‌యార్డును పరిశీలించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు చెన్నైకి చెందిన శాస్త్రవేత్త సి.పాల్పండి, బెంగళూరుకు చెందిన కాలుష్య నియంత్రణ మండలి అదనపు సంచాలకులు ఎం.మధుసూదన్, జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్లు ఎన్‌వీ భాస్కర్, శివప్రసాద్, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పోలవరం గ్రామంలోని సుజల సాగర అతిథి గృహంలో అధికారులు, బాధితులతో సమావేశం నిర్వహించారు. పర్యావరణానికి ప్రజలకు డంపింగ్‌యార్డు వల్ల ఎటువంటిఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. మూలలంక ప్రాంతంలో వేసిన డంపింగ్‌యార్డుపై నుంచి మట్టి జారిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు సలహాదారుడు వీఎస్ రమేష్‌బాబును ఆదేశించారు. పర్యావరణానికి, ప్రజల జీవన విధానానికి ఎటువంటి విఘాతం కలగకుండా డంపింగ్ చేయాలన్నారు. డంపింగ్ యార్డు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను, అభిప్రాయాలను పారదర్శకంగా తెలుసుకుంటామన్నారు.
ఎన్జీటీ సభ్యుల వద్ద స్థానికుల ఆవేదన
అల్లు జగన్‌మోహన్‌రావు, కోటం రామచంద్రరావు, షేక్ ఫాతిమున్నీసా తదితర స్థానికులు డంపింగ్ యార్డు వల్ల వచ్చే ఇబ్బందులు, సమస్యలపై ఎన్జీటీ బృందం సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. బీసీ కాలనీ, గణేష్ నగర్ కాలనీల సమీపంలో డంపింగ్ యార్డు ఉన్నందున భారీ వాహనాల రాకపోకలు, శబ్దాలకు ఇళ్లు బీటలు వారుతున్నాయని పేర్కొన్నారు. కొండకాలువల నీరు గోదావరిలో కలవకపోవడంతో వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము, ధూళి లేచిపోయి ఇళ్లల్లోకి వస్తోందని, వంట సామగ్రి, దుస్తులకు మట్టి పడుతోందని వివరించారు. నిత్యం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. భారీ ఎత్తున డంపింగ్‌చేయడం వల్ల మట్టి జారిపోయి కడెమ్మ కాలువ కూడా పూడుపోతోందని వివరించారు. పర్యావరణం, వాతావరణం కలుషితమవుతోందని, కనీసం ఈ ప్రాంతంలో ఎక్కడా వాటరింగ్ కూడా చేయడం లేదని తెలిపారు. దుము, ధూళి వల్ల పోలవరం ప్రాంత వాసులం అనారోగ్యాలపాలవుతున్నామని పేర్కొన్నారు.
83 ఎకరాలు తీసుకోవద్దు
ఇదే ప్రాంతంలో డంపింగ్ చేసేందుకు మరో 83 ఎకరాలు తీసుకుంటామని డీఎం ప్రకటించారని, ఆ భూమిని తీసుకోవద్దని కలెక్టర్ దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. తామంతా సన్న , చిన్నకారు రైతులమని, ఇప్పటికే ప్రాజెక్టు పేరుతో తమ భూములు కోల్పోయామని, సాధ్యమైనంత వరకు అధికారులు పరిశీలన జరిపి ఈ 83 ఎకరాలు డంపింగ్ నుంచి మినహాయించాలని కోరారు. గతంలో ఎన్జీటీ బృందం సభ్యులు పరిశీలన చేసి ఇంజినీరింగ్ అధికారులకు సూచించినా వాటిని సరిగా అమలు చేయలేదని వివరించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ పి.రామకృష్ణ, ప్రాజెక్టు సలహాదారుడు వి.ఎస్.రమేష్‌బాబు, ఆర్డీఓ కె.మోహన్‌కుమార్, డీఎస్పీ ఎ.టి.వి. రవి కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వెంకటేశ్వర్లు, పోలవరం ప్రాజెక్టు ఈఈ ఎన్.చంద్రరావు, తహసీల్దార్ చినబాబు, పోలవరం అటవీ రేంజ్ అధికారి ఎన్.దావీదురాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment