సాక్షి, మేడ్చల్ జిల్లా: యాభై ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయనివాళ్లు.. ఇప్పుడు అవకాశమిస్తే ఎలా చేస్తారని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో రూ.251 కోట్లతో 2000 కేఎల్‌డీ సామర్థ్యం కలిగిన లీచెట్ ప్లాంట్‌ను కార్మిక మంత్రి మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి , రాంకీ సంస్థ ప్రతినిధులతో కలసి కేటీఆర్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 3,619 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జవహర్‌నగర్ డంప్ యార్డ్ నుంచి ఉత్పత్తి అయ్యే లీచెట్ కారణంగా కలుషితమవుతున్న మల్కారం చెరువుతో పాటు యార్డు చుట్టుపక్కల చెరువుల్లో ఉన్న లీచెట్ శుద్దీకరణ ప్రక్రియను వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు పూర్తి చేస్తామని ప్లాంట్ నిర్వాహకులు హామీ ఇచ్చారని తెలిపారు.
దేశానికే హైదరాబాద్ ఆదర్శ నగరం కాబోతోంది..
హైదరాబాద్ మహానగరంలో రోజుకు దాదాపు 2వేల ఎంఎల్‌టీ ( 2వేల మిలియన్ లీటర్ల) మురికినీరు ఉత్పత్తి అవుతోందని, 100 శాతం ఎస్టీపీలతో జూలై కల్లా దేశంలోనే మొట్టమొదటి నగరం కాబోతుందని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం రూ.4 వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు వెల్లడించారు. జపాన్‌లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ చూశానని అక్కడ పైన పార్కు, కింద ప్లాంట్ ఉందని, ఏ మాత్రం వాసన లేదని వివరించారు. జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడలను ఆ విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు.
3 వేల మెట్రిక్ టన్నుల యార్డ్... 8 వేల మెట్రిక్ టన్నులైంది
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ మొదలుపెట్టినప్పుడు హైద రాబాద్ నుంచి 3వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని డిజైన్ చేశారని, కానీ ఇప్పుడు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందన్నారు. ప్రస్తుతం జవహర్ నగర్‌కు వచ్చే చెత్తలో తడి చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసి, రైతులకు అమ్ముతున్నామని కేటీఆర్ తెలిపారు. రూ.550 కోట్లతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఈ చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే యూనిట్‌ను ప్రారంభించి 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామన్నారు.
రెండోదశలో మరొక రూ.550 కోట్లతో 28వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో స్థాపించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. దీంతో ఒక్క జవహర్‌నగర్ నుంచే 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే మొత్తం చెత్తతో 100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.
మూడో రకం చెత్తతో సిమెంట్, బ్రిక్స్ తయారీ
తడి,పొడి చెత్త కాకుండా, ఇళ్లు కట్టినప్పుడు, కూలగొట్టినప్పుడు వచ్చే కంకర రాళ్లు, మట్టితో మూడో రకం చెత్త వస్తోందని కేటీఆర్ తెలిపారు. నిర్మాణం, శిథిలాల నుంచి వచ్చే ఈ వ్యర్థాలను పునరుత్పత్తి చేసి.. పునర్వినియోగం చేసి.. వాటి నుంచి సిమెంట్, బ్రిక్స్, ఫుట్‌పాత్‌ల మీద వేసే టైల్స్ తయా రు చేస్తున్నామన్నారు. ఈ రకమైన ప్లాంట్లను ఒకటి ఫతూల్‌గూడలో, రెండోది జీడిమెట్లలో పెట్టినట్లు వివరించారు.
ఈ రెండూ కూడా ఒక్కోటి 500మెట్రిక్ టన్నుల కెపాసిటీతో నడుస్తున్నాయని, మరో రెండు కూడా త్వరలో పెట్టబోతున్న ట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.సుదీర్‌రెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్, మేయర్లు మేకల కావ్య, జక్కా వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయం చైర్మన్ దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment