మేడ్చల్: తమ వ్యాపారాలతో మేడ్చల్ జిల్లాకు ప్రవేశించిన మామా అల్లుళ్లు పదేళ్ల క్రితం రాజకీయరంగ ప్రవేశం చేసి ప్రతికూల పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి మేడ్చల్‌పై పట్టు సాధించారు. మేడ్చల్ మండలం మైసమ్మగూడ, కండ్లకోయ, శివార్లలోని బోయిన్‌పల్లి, సూరారంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులు, ఫంక్షన్‌హాళ్లు, వివిధ రకాల వ్యాపారాలు చేసి పదేళ్ల క్రితం వరకు వ్యాపారవేత్తగా పేరుగాంచారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్ పక్కనే ఉన్న దుండిగల్ మండలంలో ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాల, వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి మామ చాటు వ్యాపారవేత్తగా ఎదిగారు.
2014లో మల్లారెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. కేవలం వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో మేడ్చల్ బీఆర్‌ఎస్ టికెట్ సాధించి అసెంబ్లీకి ఎన్నికై తన బలంతో మంత్రి అయ్యారు. అదే సమయంలో తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇప్పించి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో అల్లుడు ఓడిపోయినా జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సహకరించకపోయినా అల్లుడిని తన వెంట బెట్టుకుని మేడ్చల్ కేంద్రంగా రాజకీయం నడిపాడు. తాను మంత్రిగా ఉంటూ అల్లుడికి లోకల్ రాజకీయాలు అప్పగించి రాజకీయం నుంచి దూరం కాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి పదవి ఇప్పించి ఫుల్ టైం రాజకీయ నాయకుడిని చేశారు.
అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ..
రాజకీయంలో అందివచి్చన ప్రతి అవకాశాన్ని మల్లారెడ్డి, ఆయన కుటుంబం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ రాజకీయ జీవితంలో సక్సెస్ అయ్యారు. అల్లుడు పార్లమెంట్ ఇన్‌చార్జిగా, పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా ఉంటూ రాజకీయం తన కుటుంబం దాటకుండా చూసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఖరారైనా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వ్యవహారంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆచితూచి అడుగులేసిన మల్లారెడ్డి చాకచక్యంగా తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి బీఆర్‌ఎస్ టికెట్ సాధించాడు. ఒకవైపు మేడ్చల్‌లో తాను పోటీచేస్తూ మరోవైపు మల్కాజిగిరిలో అల్లుడిని పోటీలోకి దింపి ఇద్దరు ఎమ్మెల్యేలు కావడంతో ఐదు నియోజకవర్గాల్లో రెండింటిలో మామా అల్లుళ్లు గెలిచి జిల్లాపై పూర్తి పట్టుసాధించారు.
ఇద్దరు వ్యాపారులు కావడం, ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకపోవడం, మంచి పేరు ఉండటం, ఇద్దరికీ కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి కార్యకర్త వరకు పూర్తిగా పలుకుబడి ఉండటం, ప్రధానంగా నాయకుల బలం, విద్యార్థుల బలం, మానవవనరులు పుష్కలంగా ఉండటంతో అన్నీ సద్వినియోగం చేసుకుని మేడ్చల్ జిల్లాలో మామా అల్లుళ్లు వ్యాపారం నుంచి మొదలై రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఏ రంగంలోనైనా తమకు ఎదురులేదని నిరూపించుకున్నారు. జిల్లాలో ఉద్దండ రాజకీయ నాయకులు, ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా మామా అల్లుళ్లు మాత్రం వారిని మట్టి కరిపించి తమకు తిరుగులేదని అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు.
తన మార్కు ఉండేలా
2018 వరకు మామచాటు అల్లుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత జిల్లాలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మార్కు ఉండేలా తమకు మద్దతు ఇచ్చిన వారికి మేయర్లు, చైర్మన్‌లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పదవులు ఇచ్చుకుని వారిని తమ అనుచరులుగా మార్చుకున్నారు. తన మార్క్ రాజకీయం చేస్తూనే మామకు బంటుగా ఉండిపోయారు. మామ మంత్రిగా ఉన్నా అధికారం పూర్తిగా అల్లుడు తీసుకుని కావాల్సిన పనులన్నీ చేశారు. మొత్తం మీద మేడ్చల్ రాజకీయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా తమదే ఆధిపత్యం అని మామా అల్లుళ్లు మరోసారి నిరూపించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment