Story of the Kerala capital Kochi Gas Chamber Brahmapuram waste plant - Sakshi
Sakshi News home page

పంట నేల కాస్త విషం కక్కుతుంటే.. కొచ్చి ‘గ్యాస్‌ ఛాంబర్‌’గా ఎలా మారిందో తెలుసా?

Published Sat, Mar 11 2023 11:11 AM | Last Updated on Sat, Mar 11 2023 11:40 AM

Story of the Kerala Kochi Gas Chamber Brahmapuram waste plant - Sakshi

కరోనా కాదు.. అయినా జనాలు బయట అడుగుపెట్టాలంటే వణికిపోతున్నారు. తలుపులు, కిటికీలు గట్టిగా బిగించేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. పోలీసులు సైతం జనాలు అనవసరంగా బయట తిరగడంపై నిఘా పెట్టారు. ఒకవేళ.. అత్యవసరానికి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్‌లు ధరిస్తున్నారు. గత వారంగా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది అక్కడ. లాక్‌డౌన్‌ లాంటి పరిస్థితులకు కారణం ఒక పే... ద్ద చెత్తకుప్ప!.

కొన్నేళ్ల కిందటి వరకు అది సారవంతమైన నేల.. వ్యవసాయ భూమి. కానీ, కాలక్రమంలో అదొక చెత్త కుప్పగా మారింది. ఆ చెత్త కుప్పనే వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌గా మార్చేయాలని ప్రభుత్వం భావించి ప్రయత్నాలు మొదలుపెట్టింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ ప్లాంట్‌కు చెత్త వచ్చి చేరుతుంటుంది. కానీ, ఆ చెత్తే  ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. నిర్వాహణ లోపం, నిర్లక్ష‍్యం కారణంగా టన్నులకు పైగా చెత్తకు నిప్పంటుకోవడంతో.. ఆ పరిసరాలు విషవాయువులతో నిండిపోయింది. 

కేరళ కొచ్చి సిటీలోని బ్రహ్మపురం ప్రాంతంలోని డంప్‌ యార్డ్‌.. జనాలకు ప్రాణాంతకంగా మారింది. చెత్త కుప్ప భారీ ఎత్తున్న తగలబడి.. అందులో ప్లాస్టిక్‌, మెటల్‌, ఇతరత్ర వస్తువులు కాలిపోయి విషపూరితమైన వాయువులు వెలువడుతున్నాయి. మంటలు వెలువడిన రెండోరోజునే ఫైర్‌ సిబ్బంది అదుపు చేశారు. 30 బృందాలు నిరంతరం ఆ కుప్ప దగ్గరే ఉండి.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అయినప్పటికీ దట్టమైన పొగ వెలువడుతూనే ఉంది. విష వాయువులతో ఆ ప్రాంతమంతా కలుషితమైపోయింది. మరోవైపు బయటకు రావొద్దని స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ బయటకు వెళ్లినా.. ఎన్‌95 మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు. 

గ్యాస్‌ ఛాంబర్‌ అంటూ.. 

బ్రహ్మపురం డంప్‌ యార్డ్‌ అగ్నిప్రమాదంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నగరం గ్యాస్‌ ఛాంబర్‌గా మారుతుంటే ఏం చేస్తున్నారని కొచ్చి మున్సిపల్‌ విభాగంపై మండిపడింది. అగ్ని ప్రమాదానికి కారణాలతో పాటు యాక్షన్‌ ప్లాన్‌ను వివరించాలని ఆదేశించింది కూడా.

ఇబ్బందులతో ఆస్పత్రులకు.. 

వేస్ట్‌ ప్లాంట్‌ పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులు నరకం అనుభవిస్తున్నారు. విషపు వాయువుల పొగ కారణంగా.. రకరకాల ఇబ్బందులో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అక్కడా వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు.  ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస కోశ సమస్యలు, ఇతర అనారోగ్యాలు ఉన్నవాళ్లను అసలు బయటికే రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. డంప్‌ యార్డ్‌లో 70 శాతం పొగ తగలబడిపోయిందని, మిగతా చెత్తకు మంటలు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు.

మార్చి 2వ తేదీన బ్రహ్మపురం సాలిడ్‌వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో మంటలు అంటుకున్నాయి. ప్రమాదానికి కారణాలపై స్పష్టత లేకున్నా.. అధిక ఉష్ణోగ్రతతోనే మంటలు చెలరేగి ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు ఆ అంశం ఆధారంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడుతోంది. అయితే.. చెత్త నుంచి ప్లాస్టిక్‌, ఇతర కారకాలను తొలగిస్తూనే ఉన్నామని, అయినా పొరపొరలుగా పేరుకుపోయిన వ్యర్థాల వల్లే తీవ్ర కాలుష్యం చోటు చేసుకుందని ప్రభుత్వం అంటోంది. 


ప్లాంట్‌ కథాకమామీషు
కొచ్చికి వ్యర్థాల తొలగింపు ఎప్పుడూ పెద్ద సమస్యగా ఉంది. 1998లో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలోని బ్రహ్మపురం వద్ద కొచ్చి కార్పొరేషన్ 37 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. అక్కడ వ్యర్థాల శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు 2005లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టుపై నిర్వాసితుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.

చివరికి.. 2007లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిత్తడి నేలను పునరుద్ధరించి ఆ ప్రాంతంలో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌  ప్లాంట్‌ను నిర్మించారు. రోజుకు 250 టన్నుల సామర్థ్యంతో 2008లో వేస్ట్ ప్లాంట్‌ను ప్రారంభించారు. కానీ, ఏడాదిన్నర వ్యవధిలోనే ప్లాంట్‌ దెబ్బతింది. నిర్మాణ లోపాల వల్లే ఇది జరిగిందని గుర్తించిన అధికారులు.. పరిశోధనలు ప్రారంభించారు. కానీ, ఫలితం తేలలేదు. 

► ఆపై డిమాండ్‌ మేరకు కొచ్చి కార్పొరేషన్ మరింత ఎక్కువ భూమిని సేకరించవలసి వచ్చింది. ఇవాళ.. బ్రహ్మపురం వ్యర్థాల కర్మాగారం అనేది కొచ్చి నగరంలోని ప్రధాన ఐటీ పార్కుల సమీపంలో 110 ఎకరాల స్థలంలో విస్తరించింది.

► కొచ్చి కార్పొరేషన్‌తో పాటు కళమస్సెరీ, ఆళువా, అంగమళి, త్రిక్కకారా, త్రిపునితారా మున్సిపాలిటీలతో పాటు చెరానల్లూరు, వడవుకోడ్‌ పుథాన్‌కురిష్‌ పంచాయితీల చెత్త కూడా ఈ ప్లాంట్‌కే వచ్చి చేరుతోంది. 

► ప్రతిరోజూ సుమారు 400 టన్నుల చెత్త ఈ ప్లాంట్‌కు వస్తుంది. అందులో నలభై శాతం ప్లాస్టిక్‌, నాన్‌బయోడీగ్రేడబుల్‌ చెత్త ఉంటోంది. 

► 2012లో భారత్‌ ట్రేడర్స్‌ అనే కంపెనీతో కొచ్చి కార్పొరేషన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం.. బ్రహ్మపురం ప్లాంట్‌ నుంచి చెత్త సేకరణలో భాగంగా ప్లాస్టిక్‌ కేజీకి రూపాయిన్నర చెల్లిస్తుంది. అయితే.. అది రీసైక్లింగ్‌ ప్లాస్టిక్‌కు మాత్రమే. దీంతో మిగతా వేస్ట్‌ అంతా అక్కడే ఉండిపోతోంది. 

► ఇక ఇక్కడే చెత్త నుంచి కరెంట్‌ ఉత్పత్తికి ఒక ప్లాంట్‌ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరిగింది. 2011లో పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలనుకున్నారు. 2015లో ఒప్పందం జరిగి.. మూడేళ్ల తర్వాత ప్లాంట్‌కు శంకుస్థాపన రాయి కూడా పడింది. కానీ, నిధులు లేక 2020లో ఆ ఒప్పందం రద్దు అయ్యింది.

► బ్రహ్మపురం వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ విషయంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులు సైతం జోక్యం చేసుకున్నాయి. అయినప్పటికీ.. కొచ్చి కార్పొరేషన్‌ దాని పని తీరును మెరుగుపర్చలేదు. ఇంకో విషయం ఏంటే.. తాజా ఘటన నేపథ్యంలో కొచ్చి కార్పొరేషన్‌కు కేరళ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు దాదాపు  రూ.15 కోట్ల జరిమానా విధించింది. అయితే.. కార్పొరేషన్‌ ఈ ఆదేశాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. 

నాటకీయ పరిణామాల నడుమ.. 
బ్రహ్మపురం డంప్‌ యార్డ్‌ అగ్నిప్రమాదం నేపథ్యంలో.. గత వారం రోజులుగా అందులోని ఇతర ప్రాంతాల నుంచి చెత్తను అనుమతించడం లేదు. అలాగే.. ప్లాంట్‌ బయట ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు కూడా బైఠాయించారు. ఈ క్రమంలో.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 40 లారీల్లో చెత్త కుప్ప ప్లాంట్‌కు చేరింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు అడ్డగించే యత్నం చేయగా.. పోలీసులు వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. ఆపై లారీలను లోపలికి అనుమతించారు. విశేషం ఏంటంటే.. అగ్నిప్రమాద ఘటన తర్వాత ప్లాస్టిక​ డంపింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. అందుకు విరుద్ధంగా కొచ్చి కార్పొరేషన్‌ చెత్తను లోపలికి అనుమతించడం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement