Waste Management Plant
-
పంట నేల కాస్త విషం కక్కుతుంటే..
కరోనా కాదు.. అయినా జనాలు బయట అడుగుపెట్టాలంటే వణికిపోతున్నారు. తలుపులు, కిటికీలు గట్టిగా బిగించేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. పోలీసులు సైతం జనాలు అనవసరంగా బయట తిరగడంపై నిఘా పెట్టారు. ఒకవేళ.. అత్యవసరానికి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్‌లు ధరిస్తున్నారు. గత వారంగా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది అక్కడ. లాక్డౌన్ లాంటి పరిస్థితులకు కారణం ఒక పే... ద్ద చెత్తకుప్ప!. కొన్నేళ్ల కిందటి వరకు అది సారవంతమైన నేల.. వ్యవసాయ భూమి. కానీ, కాలక్రమంలో అదొక చెత్త కుప్పగా మారింది. ఆ చెత్త కుప్పనే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌గా మార్చేయాలని ప్రభుత్వం భావించి ప్రయత్నాలు మొదలుపెట్టింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ ప్లాంట్‌కు చెత్త వచ్చి చేరుతుంటుంది. కానీ, ఆ చెత్తే ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. నిర్వాహణ లోపం, నిర్లక్ష్యం కారణంగా టన్నులకు పైగా చెత్తకు నిప్పంటుకోవడంతో.. ఆ పరిసరాలు విషవాయువులతో నిండిపోయింది. కేరళ కొచ్చి సిటీలోని బ్రహ్మపురం ప్రాంతంలోని డంప్ యార్డ్.. జనాలకు ప్రాణాంతకంగా మారింది. చెత్త కుప్ప భారీ ఎత్తున్న తగలబడి.. అందులో ప్లాస్టిక్, మెటల్, ఇతరత్ర వస్తువులు కాలిపోయి విషపూరితమైన వాయువులు వెలువడుతున్నాయి. మంటలు వెలువడిన రెండోరోజునే ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. 30 బృందాలు నిరంతరం ఆ కుప్ప దగ్గరే ఉండి.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అయినప్పటికీ దట్టమైన పొగ వెలువడుతూనే ఉంది. విష వాయువులతో ఆ ప్రాంతమంతా కలుషితమైపోయింది. మరోవైపు బయటకు రావొద్దని స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ బయటకు వెళ్లినా.. ఎన్95 మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు. గ్యాస్ ఛాంబర్ అంటూ.. బ్రహ్మపురం డంప్ యార్డ్ అగ్నిప్రమాదంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నగరం గ్యాస్ ఛాంబర్‌గా మారుతుంటే ఏం చేస్తున్నారని కొచ్చి మున్సిపల్ విభాగంపై మండిపడింది. అగ్ని ప్రమాదానికి కారణాలతో పాటు యాక్షన్ ప్లాన్‌ను వివరించాలని ఆదేశించింది కూడా. ఇబ్బందులతో ఆస్పత్రులకు.. వేస్ట్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులు నరకం అనుభవిస్తున్నారు. విషపు వాయువుల పొగ కారణంగా.. రకరకాల ఇబ్బందులో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అక్కడా వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస కోశ సమస్యలు, ఇతర అనారోగ్యాలు ఉన్నవాళ్లను అసలు బయటికే రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. డంప్ యార్డ్‌లో 70 శాతం పొగ తగలబడిపోయిందని, మిగతా చెత్తకు మంటలు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. మార్చి 2వ తేదీన బ్రహ్మపురం సాలిడ్‌వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో మంటలు అంటుకున్నాయి. ప్రమాదానికి కారణాలపై స్పష్టత లేకున్నా.. అధిక ఉష్ణోగ్రతతోనే మంటలు చెలరేగి ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు ఆ అంశం ఆధారంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్లో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడుతోంది. అయితే.. చెత్త నుంచి ప్లాస్టిక్, ఇతర కారకాలను తొలగిస్తూనే ఉన్నామని, అయినా పొరపొరలుగా పేరుకుపోయిన వ్యర్థాల వల్లే తీవ్ర కాలుష్యం చోటు చేసుకుందని ప్రభుత్వం అంటోంది. ప్లాంట్ కథాకమామీషు కొచ్చికి వ్యర్థాల తొలగింపు ఎప్పుడూ పెద్ద సమస్యగా ఉంది. 1998లో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలోని బ్రహ్మపురం వద్ద కొచ్చి కార్పొరేషన్ 37 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. అక్కడ వ్యర్థాల శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు 2005లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టుపై నిర్వాసితుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ► చివరికి.. 2007లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిత్తడి నేలను పునరుద్ధరించి ఆ ప్రాంతంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. రోజుకు 250 టన్నుల సామర్థ్యంతో 2008లో వేస్ట్ ప్లాంట్‌ను ప్రారంభించారు. కానీ, ఏడాదిన్నర వ్యవధిలోనే ప్లాంట్ దెబ్బతింది. నిర్మాణ లోపాల వల్లే ఇది జరిగిందని గుర్తించిన అధికారులు.. పరిశోధనలు ప్రారంభించారు. కానీ, ఫలితం తేలలేదు. ► ఆపై డిమాండ్ మేరకు కొచ్చి కార్పొరేషన్ మరింత ఎక్కువ భూమిని సేకరించవలసి వచ్చింది. ఇవాళ.. బ్రహ్మపురం వ్యర్థాల కర్మాగారం అనేది కొచ్చి నగరంలోని ప్రధాన ఐటీ పార్కుల సమీపంలో 110 ఎకరాల స్థలంలో విస్తరించింది. ► కొచ్చి కార్పొరేషన్‌తో పాటు కళమస్సెరీ, ఆళువా, అంగమళి, త్రిక్కకారా, త్రిపునితారా మున్సిపాలిటీలతో పాటు చెరానల్లూరు, వడవుకోడ్ పుథాన్కురిష్ పంచాయితీల చెత్త కూడా ఈ ప్లాంట్‌కే వచ్చి చేరుతోంది. ► ప్రతిరోజూ సుమారు 400 టన్నుల చెత్త ఈ ప్లాంట్‌కు వస్తుంది. అందులో నలభై శాతం ప్లాస్టిక్, నాన్బయోడీగ్రేడబుల్ చెత్త ఉంటోంది. ► 2012లో భారత్ ట్రేడర్స్ అనే కంపెనీతో కొచ్చి కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం.. బ్రహ్మపురం ప్లాంట్ నుంచి చెత్త సేకరణలో భాగంగా ప్లాస్టిక్ కేజీకి రూపాయిన్నర చెల్లిస్తుంది. అయితే.. అది రీసైక్లింగ్ ప్లాస్టిక్‌కు మాత్రమే. దీంతో మిగతా వేస్ట్ అంతా అక్కడే ఉండిపోతోంది. ► ఇక ఇక్కడే చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తికి ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరిగింది. 2011లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలనుకున్నారు. 2015లో ఒప్పందం జరిగి.. మూడేళ్ల తర్వాత ప్లాంట్‌కు శంకుస్థాపన రాయి కూడా పడింది. కానీ, నిధులు లేక 2020లో ఆ ఒప్పందం రద్దు అయ్యింది. ► బ్రహ్మపురం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు సైతం జోక్యం చేసుకున్నాయి. అయినప్పటికీ.. కొచ్చి కార్పొరేషన్ దాని పని తీరును మెరుగుపర్చలేదు. ఇంకో విషయం ఏంటే.. తాజా ఘటన నేపథ్యంలో కొచ్చి కార్పొరేషన్‌కు కేరళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాదాపు రూ.15 కోట్ల జరిమానా విధించింది. అయితే.. కార్పొరేషన్ ఈ ఆదేశాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. నాటకీయ పరిణామాల నడుమ.. బ్రహ్మపురం డంప్ యార్డ్ అగ్నిప్రమాదం నేపథ్యంలో.. గత వారం రోజులుగా అందులోని ఇతర ప్రాంతాల నుంచి చెత్తను అనుమతించడం లేదు. అలాగే.. ప్లాంట్ బయట ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు కూడా బైఠాయించారు. ఈ క్రమంలో.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 40 లారీల్లో చెత్త కుప్ప ప్లాంట్‌కు చేరింది. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డగించే యత్నం చేయగా.. పోలీసులు వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. ఆపై లారీలను లోపలికి అనుమతించారు. విశేషం ఏంటంటే.. అగ్నిప్రమాద ఘటన తర్వాత ప్లాస్టిక డంపింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. అందుకు విరుద్ధంగా కొచ్చి కార్పొరేషన్ చెత్తను లోపలికి అనుమతించడం. -
అప్పుడే పట్టణాలు శుభ్రపడతాయి!
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అతి వేగంగా పెరుగుతోంది. భారతదేశంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో పట్టణాలలో చెత్త, వ్యర్థాలు ప్రతి రోజూ కుప్పలు కుప్పలుగా పెరిగిపోవటం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందువల్ల ప్రజారోగ్యానికీ, పర్యావరణానికీ ఎంతో హాని కలుగుతోంది. స్థానిక సంస్థలకు ఈ చెత్తను తొలగించడం సవాలుగా మారింది. గత రెండు దశాబ్దాలలో వేగవంతమైన పట్టణాభివృద్ధి, జనాభా పెరుగుదల, మారుతున్న జీవన ప్రమాణాలు పట్టణాల్లో వ్యర్థాల పెరుగుదలకు హేతువులుగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బహుముఖ వ్యూహంతో వ్యర్థాల నిర్వహణను చేపట్టవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకూ చేపడుతున్న కార్యక్రమాలలో ఆర్ఆర్ఆర్ఆర్ (రెఫ్యూజ్: తిరస్కరణ, రెడ్యూస్: తగ్గించడం, రీయూజ్: తిరిగి వాడటం, రీసైకిల్: వేరుచేసిన చెత్తను ఇతర వస్తువులను తయారు చేయడానికి లేదా పునర్వినియోగానికి సిద్ధం చేయడం) వంటి వ్యూహాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఇండోర్ నగరంలో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా తెలుస్తోంది. వ్యర్థాల నిర్వహణలో ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ గత 5 సంవత్సరాలుగా దేశంలోనే మొదటి ర్యాంకు సాధిస్తోంది. ఇండోర్ నగంలోని ప్రజలలో వచ్చిన అవగాహన, ప్రవర్తనలోని మార్పులు, మునిసిపల్ సిబ్బంది అకుంఠిత దీక్ష వల్లనే ఇది సాధ్యమయింది. ఇండోర్ నగరంలోని వివిధ ప్రాంతాలలో పది ట్రాన్స్ఫర్ కలెక్షన్ సెంటర్లను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుండి వేరు వేరుగా సేకరించిన చెత్తను భారీ వాహనాల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ పొడి చెత్తను ఆరు రకాలుగా విభజించి ఆ తదుపరి మిగిలిన కొద్దిపాటి ఉపయోగం లేని చెత్తను శాస్త్రీయ పద్ధతి ద్వారా లాండ్ ఫిల్లింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ యూనిట్ నుండి తరలించిన చెత్తతో అనేక నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో ‘ఇంక్‌వాష్’ సంస్థ నిర్వహించిన సదస్సులో చెత్త రీసైక్లింగ్ చేయడం ద్వారా అత్యధికంగా లాభాలు పొందే ఉపాధి అవకాశాలపై చర్చ జరిగింది. చెత్తతో వస్తువులను తయారు చేయడానికి ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. జనాభా పెరుగుతున్న నగరాలలో రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలను రచించి పకడ్బందీగా ‘చెత్త’ సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యవంతులను చేయాలి. కాలనీ, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులను సమకూర్చుకోవాలి. అప్పుడే ప్రతి నగరం, పట్టణం పరిశుభ్రతతో అలరారుతుంది. - ప్రొఫెసర్ కుమార్ మొలుగరం భారత ప్రభుత్వ ప్రాంతీయ పట్టణ అధ్యయన కేంద్రం డైరెక్టర్, ఓయూ -
‘క్లాప్’ కొట్టాల్సిందే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు ఇక పరిశుభ్రంగా మారనున్నాయి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి వ్యర్థాలు వేర్వేరుగా సేకరణ.. జియోట్యాగింగ్ చేసిన ఆటోలతో వ్యర్థాల తరలింపు.. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు.. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు.. వ్యర్థాల నుంచి విద్యుత్, కంపోస్ట్ ఎరువుల తయారీ.. వెరసి రాష్ట్రంలోని 123 నగరాలు, పట్టణాలు 100 శాతం పరిశుభ్రంగా రూపుదిద్దుకోనున్నాయి. తద్వారా ప్రజారోగ్యం మరింత మెరుగుపడనుంది. పరిశుభ్రతే లక్ష్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని జూలై 8న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పురపాలకశాఖ సన్నద్ధమవుతోంది. ఓవైపు పూర్తిస్థాయిలో మౌలిక వసతులను సమకూర్చుకుంటూ మరోవైపు ప్రజలను భాగస్వాములుగా చేసుకుని కార్యాచరణ రూపొందించింది. క్లాప్ కార్యక్రమంలో ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిని గ్రీన్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరికి గ్లౌజులు, కళ్లద్దాలు, బూట్లుతో పీపీఈ కిట్ల వంటి సూట్ ఇవ్వనుంది. వారి ఆరోగ్య పరిరక్షణతోపాటు సామాజిక గౌరవాన్ని పెంపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రూ.100 కోట్లతో కోటికిపైగా డస్ట్బిన్లు నగరాలు, పట్టణాల్లో రోడ్లు, వీధుల్లో వ్యర్థాలు కనిపించకూడదన్నది క్లాప్ కార్యక్రమం లక్ష్యం. అందుకు ఇంటింటి నుంచి వ్యర్థాలను సేకరిస్తారు. ఇళ్ల నుంచే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరిస్తారు. ఆ విషయంపై వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు, స్వచ్ఛందసంస్థల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పురపాలకశాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఆదేశాలతో స్వచ్ఛ ఏపీ కార్పొరేషన్ ఎండీ సంపత్, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి పురపాలక, మెప్మా సిబ్బందికి శిక్షణా తరగతులు ప్రారంభించారు. తడిచెత్త కోసం పచ్చరంగు, పొడిచెత్త కోసం నీలం రంగు, ప్రమాదకర చెత్త కోసం ఎర్ర రంగు డస్ట్బిన్లను ఉచితంగా సరఫరా చేస్తారు. ప్రతి ఇంటికి మూడు చొప్పున సరఫరా కోసం కోటికిపైగా డస్ట్బిన్లను కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం 15వ ఆర్థికసంఘం నిధులు రూ.100 కోట్లను పురపాలకశాఖ వెచ్చించనుంది. 3,100 డీజిల్ ఆటోలు, 1,800 ఈ–ఆటోలు ఇళ్ల నుంచి వ్యర్థాల తరలింపునకు ఇప్పటివరకు ఉన్న తోపుడు బళ్ల స్థానంలో ఆటోలను ప్రవేశపెడతారు. 45 పెద్ద మునిసిపాలిటీల్లో ప్రతి వెయ్యి ఇళ్లకు ఒక డీజిల్ ఆటో చొప్పున మొత్తం 3,100 ఆటోలు ఏర్పాటు చేస్తారు. 78 చిన్న మునిసిపాలిటీల్లో ప్రతి 700 ఇళ్లకు ఓ ఈ–ఆటో వంతున మొత్తం 1,800 ఆటోలను ప్రవేశపెడతారు. జీపీఎస్ ట్రాకింగ్‌తో ఉన్న ఆటోలకు రెండు వైపులా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీంతో ఏ ఆటో ఏ ప్రాంతంలో ఉందో అధికారులు పర్యవేక్షించవచ్చు. 121 వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు జీటీఎస్ నుంచి వ్యర్థాలను వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లకు తరలిస్తారు. 123 నగరాలు, పట్టణాల్లో 121 వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు నెలకొల్పుతారు. ఇప్పటికే 31 వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. 18 ప్లాంట్ల నిర్మాణం కొనసాగుతోంది. మరో 72 ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మించేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. విశాఖపట్నం, గుంటూరుల్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతారు. మిగిలిన వ్యర్థాల నుంచి కంపోస్ట్ తయారు చేసే ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. రెండుదశల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. రూ.160 కోట్లతో 225 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఇంతవరకు వ్యర్థాలను వీధులు, కాలనీల్లో ఓ ప్రదేశంలో పెద్ద చెత్తకుండీల్లోను, బయట వేస్తున్నారు. ఆ వ్యర్థాలు చెల్లాచెదురై అనారోగ్య పరిస్థితులు ఏర్పడేవి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు (జీటీఎస్‌లు) ఏర్పాటు చేయనుంది. ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలను ఆటోలలో తరలించి ఈ జీటీఎస్‌లలో వేస్తారు. అందుకోసం ప్రతి 10 వార్డులకు ఒక జీటీఎస్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా రూ.160 కోట్లతో నగరాలు, పట్టణాల్లో మొత్తం 225 జీటీఎస్‌లు నెలకొల్పుతారు. రూ.13 కోట్లతో 4 వేల కంపాక్టర్ బిన్లను కొనుగోలు చేసి జీటీఎస్‌లలో అందుబాటులో ఉంచుతారు. -
ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్- లిస్టింగ్ భళా
ముంబై, సాక్షి: గతేడాది మళ్లీ కళకళలాడిన ప్రైమరీ మార్కెట్లో భాగంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ హుషారుగా లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 315తో పోలిస్తే ఎన్ఎస్ఈలో రూ. 436 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 36 శాతం ప్రీమియంకాగా.. వెనువెంటనే రూ. 490 వరకూ ఎగసింది. ప్రస్తుతం 6.5 శాతం లాభంతో రూ. 465 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 436 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలోలోనూ రూ. 430 వద్ద లిస్టయ్యింది. రూ. 493 వరకూ జంప్‌చేసింది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్(ఎంఎస్‌డబ్ల్యూ) విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ గత నెల చివర్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఇష్యూకి 15 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ 66.66 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. 10 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 90 కోట్లను సమీకరించింది. తద్వారా కంపెనీ మొత్తం రూ. 300 కోట్లు సమకూర్చుకుంది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 215 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. కంపెనీ తాజాగా రూ. 85 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది. చదవండి: (ఈ చిన్న షేరు గెలాప్ వెనుక?!) ప్రాజెక్టుల కోసం ఐపీవో నిధులను అనుబంధ సంస్థల ద్వారా పీసీఎంసీ WTE ప్రాజెక్టుకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పక్టస్‌లో ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పేర్కొంది. వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రంగంలో దేశీయంగా గల ఐదు టాప్ కంపెనీలలో ఒకటి ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్. మూడు రకాల ప్రాజెక్టులను చేపడుతోంది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్, సీఅండ్‌టీ ప్రాజెక్ట్స్, ఎంఎస్‌డబ్ల్యూ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ప్రధానంగా ఎంఎస్‌డబ్ల్యూ సర్వీసులలో పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వీటిలో సోలిడ్ వేస్ట్ కలెక్షన్, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్ సర్వీసులున్నట్లు తెలియజేసింది. (2020: ఐపీవో నామ సంవత్సరం) మునిసిపాలిటీలతో.. మునిసిపాలిటీలకు అత్యధికంగా సర్వీసులు అందిస్తున్నట్లు ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పేర్కొంది. ల్యాండ్ ఫిల్ నిర్మాణం, నిర్వహణ విభాగంలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఎంఎస్‌డబ్ల్యూ ఆధారిత డబ్ల్యూటీఈ సర్వీసుల్లో పట్టు సాధించింది. ప్రస్తుతం నవీముంబై, థానే, ఉత్తర ఢిల్లీ, మంగళూరు మునిసిపల్ తదితర 25 ప్రాజెక్టులను చేపట్టింది. 18 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటిలో 12 ప్రాజెక్టులు ఎంఎస్‌డబ్ల్యూ సీఅండ్‌టీ విభాగంలోనివే. 1147 వాహనాలను కలిగి ఉంది. 969 వాహనాలకు జీపీఎస్‌ను అనుసంధానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ. 207 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. కుటుంబ సభ్యులు, ప్రమోటర్లకు 24.73 శాతం వాటా ఉంది. -
స్మార్ట్ సిటీకి త్వరలో శ్రీకారం
♦ 6న స్పెషల్ పర్పస్ వెహికల్ తొలి సమావేశం ♦ హాజరుకానున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ♦ జీవీఎంసీకి వారం రోజుల్లో రూ.376 కోట్లు ♦ కనీసం రూ.200 కోట్ల పనులకు సన్నాహాలు ♦ జూన్ 25న శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు ♦ త్వరలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌కు పునాదిరాయి సాక్షి, విశాఖపట్నం : దేశంలో వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్టు గత ఏడాది జూన్ 25న కేంద్రం ప్రకటించింది. అదే రోజున స్మార్ట్‌సిటీగా ఎంపికైన విశాఖలో స్మార్ట్ పనులకు శ్రీకారం చుట్టాలని జీవీఎంసీ కసరత్తు చేస్తోంది. స్మార్ట్‌సిటీ ప్రణాళికల అమలు కోసం ఏర్పాటైన స్పెషల్ పర్పస్ వెహికల్ తొలి సమావేశం ఈ నెల 6న భేటీ కానుంది. మున్సిపల్ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్ తో సహా డెరైక్టర్లంతా హాజరు కానున్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా ఇప్పటికే మంజూరైన 15 మెగా వాట్స్ సామర్ధ్యంగల సాలిడ్ వేస్ట్‌మేనేజ్ మెంట్ ఎనర్జీ ప్లాంట్‌ను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ కోసం ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ)ని నియమించారు. ఇప్పటికే స్మార్ట్సిటీస్టేక్ హోల్డర్స్‌తో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అంశాల వారీగా చేపట్టాల్సిన పనులకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన 15 సబ్ కమిటీలు గతనెల 31న ఎస్పీవీకి నివేదించింది. ఈనెల 6న జరుగనున్న ఎస్పీవీ భేటీలో కమిటీలు ఇచ్చిన నివేదికలపై చర్చించి కార్యాచరణను రూపొందించనున్నారు. త్వరలో నిధులు విడుదల తొలి ఏడాది చేప ట్టాల్సిన పనుల కోసం రానున్న వారం పదిరోజుల్లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వాటాల కింద రూ.346 కోట్లు విడుదల కానున్నాయి. ఈ నిధులను ఎస్పీవీ అకౌంట్లో జమ చేయనున్నారు. తొలి ఏడాది గుర్తించిన పనులకు సంబంధించి టెండర్లను పిలవడం, ఫైనలైజ్ చేయడం, వర్కు ఆర్డర్స్ ఇవ్వడం ఇలా అన్ని పనులు ఎస్పీవీ పర్యవేక్షణలో పీఎంసీ చేయనుంది. పథకం ప్రకటించిన జూన్-25న కనీసం రూ.200 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టే విధంగా జీవీఎంసీ కమిషనర్ ప్రవీణకుమార్ కసరత్తు చేస్తున్నారు. ఐదేళ్ల కాలపరిమితితో ప్రణాళిక ఆర్కే బీచ్, రుషికొండ, కైలాసగిరి ప్రాంతాల్లో రూ.1602 కోట్లతో ఐదేళ్ల కాల పరిమితిలో స్మార్ట్‌సిటీ ప్రణాళికలను అమలు చేయనున్నారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు ఏడాదికి చెరో వందకోట్ల చొప్పున రూ.1000కోట్లు సమకూర్చనుండ గా, మిగిలిన రూ. 602 కోట్ల పనులను పీపీపీ పద్ధతిలో చేపట్టనున్నారు. స్మార్ట్‌సిటీ కోసం ఏంపికైన ప్రాంతంలో ప్రతిపాదించిన పనులతో పాటు తొలి ఏడాది రూ.139.96 కోట్లతో అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటు, ఆనందపురం మండలం గిరజాంలో 20 ఎకరాల్లో రూ.150 కోట్లతో 15 మెగావాట్స్ సామర్ధ్యంతో చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పీఎంఏవై (హౌసింగ్ ఫర్ ఆల్) స్కీమ్‌లో 20,030 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రూ.110.79 కోట్లతో మల్టీస్టోరెడ్ పార్కింగ్ ఫెసిలిటీ పనులు చేపట్టనున్నారు. ఎస్పీవీ బేటీ అనంతరం ప్రాధాన్యం ప్రకారం ఏఏ పనులు చేపట్టాలో గుర్తిస్తామని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఏది ఏమైనా జూన్-25 నాటికి స్మార్ట్ సిటీలో తొలిదశలో అభివృద్ధి చేయనున్న ఆర్కే బీచ్, కైలాసగిరి, రుషికొండ ప్రాంతా ల్లో ప్రతిపాదించిన పనుల్లో కనీ సం రూ.200 కోట్ల విలువైన పనులనైనా ప్రా రంభించాలన్న పట్టుదలతో ఉన్నామని చెప్పారు. నిధుల ప్రణాళిక ఇలా.. (రూ. కోట్లలో) 5 ఏళ్ల కాలపరిమితిలో చేసే ఖర్చు... 1602 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా.. 1000 పీపీపీ పద్ధతిలో సమీకరించేది.. 602 తొలివిడత విడుదలయ్యే నిధులు.. 346 జూన్ 25న చేపట్టే పనుల విలువ.. 200