స్మార్ట్ సిటీకి త్వరలో శ్రీకారం
♦ 6న స్పెషల్ పర్పస్ వెహికల్ తొలి సమావేశం
♦ హాజరుకానున్న ప్రిన్సిపల్ సెక్రటరీ
♦ జీవీఎంసీకి వారం రోజుల్లో రూ.376 కోట్లు
♦ కనీసం రూ.200 కోట్ల పనులకు సన్నాహాలు
♦ జూన్ 25న శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు
♦ త్వరలో వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌కు పునాదిరాయి
సాక్షి, విశాఖపట్నం : దేశంలో వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్టు గత ఏడాది జూన్ 25న కేంద్రం ప్రకటించింది. అదే రోజున స్మార్ట్‌సిటీగా ఎంపికైన విశాఖలో స్మార్ట్ పనులకు శ్రీకారం చుట్టాలని జీవీఎంసీ కసరత్తు చేస్తోంది. స్మార్ట్‌సిటీ ప్రణాళికల అమలు కోసం ఏర్పాటైన స్పెషల్ పర్పస్ వెహికల్ తొలి సమావేశం ఈ నెల 6న భేటీ కానుంది. మున్సిపల్ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్ తో సహా డెరైక్టర్లంతా హాజరు కానున్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా ఇప్పటికే మంజూరైన 15 మెగా వాట్స్ సామర్ధ్యంగల సాలిడ్ వేస్ట్‌మేనేజ్ మెంట్ ఎనర్జీ ప్లాంట్‌ను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ కోసం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ)ని నియమించారు. ఇప్పటికే స్మార్ట్‌సిటీస్టేక్ హోల్డర్స్‌తో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అంశాల వారీగా చేపట్టాల్సిన పనులకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన 15 సబ్ కమిటీలు గతనెల 31న ఎస్‌పీవీకి నివేదించింది. ఈనెల 6న జరుగనున్న ఎస్‌పీవీ భేటీలో కమిటీలు ఇచ్చిన నివేదికలపై చర్చించి కార్యాచరణను రూపొందించనున్నారు.
త్వరలో నిధులు విడుదల
తొలి ఏడాది చేప ట్టాల్సిన పనుల కోసం రానున్న వారం పదిరోజుల్లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వాటాల కింద రూ.346 కోట్లు విడుదల కానున్నాయి. ఈ నిధులను ఎస్‌పీవీ అకౌంట్‌లో జమ చేయనున్నారు. తొలి ఏడాది గుర్తించిన పనులకు సంబంధించి టెండర్లను పిలవడం, ఫైనలైజ్ చేయడం, వర్కు ఆర్డర్స్ ఇవ్వడం ఇలా అన్ని పనులు ఎస్‌పీవీ పర్యవేక్షణలో పీఎంసీ చేయనుంది. పథకం ప్రకటించిన జూన్-25న కనీసం రూ.200 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టే విధంగా జీవీఎంసీ కమిషనర్ ప్రవీణకుమార్ కసరత్తు చేస్తున్నారు.
ఐదేళ్ల కాలపరిమితితో ప్రణాళిక
ఆర్కే బీచ్, రుషికొండ, కైలాసగిరి ప్రాంతాల్లో రూ.1602 కోట్లతో ఐదేళ్ల కాల పరిమితిలో స్మార్ట్‌సిటీ ప్రణాళికలను అమలు చేయనున్నారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు ఏడాదికి చెరో వందకోట్ల చొప్పున రూ.1000కోట్లు సమకూర్చనుండ గా, మిగిలిన రూ. 602 కోట్ల పనులను పీపీపీ పద్ధతిలో చేపట్టనున్నారు. స్మార్ట్‌సిటీ కోసం ఏంపికైన ప్రాంతంలో ప్రతిపాదించిన పనులతో పాటు తొలి ఏడాది రూ.139.96 కోట్లతో అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటు, ఆనందపురం మండలం గిరజాంలో 20 ఎకరాల్లో రూ.150 కోట్లతో 15 మెగావాట్స్ సామర్ధ్యంతో చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు.
అలాగే పీఎంఏవై (హౌసింగ్ ఫర్ ఆల్) స్కీమ్‌లో 20,030 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రూ.110.79 కోట్లతో మల్టీస్టోరెడ్ పార్కింగ్ ఫెసిలిటీ పనులు చేపట్టనున్నారు. ఎస్‌పీవీ బేటీ అనంతరం ప్రాధాన్యం ప్రకారం ఏఏ పనులు చేపట్టాలో గుర్తిస్తామని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఏది ఏమైనా జూన్-25 నాటికి స్మార్ట్ సిటీలో తొలిదశలో అభివృద్ధి చేయనున్న ఆర్కే బీచ్, కైలాసగిరి, రుషికొండ ప్రాంతా ల్లో ప్రతిపాదించిన పనుల్లో కనీ సం రూ.200 కోట్ల విలువైన పనులనైనా ప్రా రంభించాలన్న పట్టుదలతో ఉన్నామని చెప్పారు.
నిధుల ప్రణాళిక ఇలా.. (రూ. కోట్లలో)
5 ఏళ్ల కాలపరిమితిలో చేసే ఖర్చు... 1602
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా.. 1000
పీపీపీ పద్ధతిలో సమీకరించేది.. 602
తొలివిడత విడుదలయ్యే నిధులు.. 346
జూన్ 25న చేపట్టే పనుల విలువ.. 200