న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి తమ మొట్టమొదటి బహిరంగసభను వచ్చే నెలలో భోపాల్‌లో నిర్వహించనుంది. అదేవిధంగా, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించిన చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించనుంది. ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగింది. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కమిటీలోని 14 మంది సభ్యులకు గాను 12 మంది హాజరయ్యారు. సనాతనధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.
కమిటీ సభ్యుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అనంతరం మాట్లాడుతూ, విచారణకు రావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంతో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భేటీకి రాలేదని చెప్పారు. హాజరైన వారిలో..ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి.రాజా, ఎస్‌పీ నుంచి జావెద్ అలీ ఖాన్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, జేడీయూకు చెందిన సంజయ్ ఝా, ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ ఉన్నారు.
‘సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. భాగస్వామ్య పక్షాలు చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపణీని ఖరారు చేయాలి.. కూటమి ఉమ్మడి సమావేశాలను దేశవ్యాప్తంగా చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటి సభను అక్టోబర్ మొదటి వారంలో భోపాల్‌లో చేపట్టాలని అంగీకారానికి వచ్చారు. బీజేపీ పాలనలో పెరిగిన అవినీతి, నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా ఈ సభలు జరుగుతాయి’అని కమిటీ ఉమ్మడి ప్రకటనను వేణుగోపాల్ చదివి వినిపించారు. మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌ల్లో సీట్ల పంపకం సులువుగా కనిపిస్తుండగా, పంజాబ్, ఢిల్లీ, పశి్చమబెంగాల్‌ల్లో మాత్రం భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment