ఈ చెత్తేంది నారాయణా! | Municipality Negligence in PSR Nellore | Sakshi
Sakshi News home page

ఈ చెత్తేంది నారాయణా!

Published Fri, Dec 28 2018 1:25 PM | Last Updated on Fri, Dec 28 2018 1:25 PM

Municipality Negligence in PSR Nellore - Sakshi

నెల్లూరు సిటీ : మున్సిపల్‌ మంత్రి నారాయణ సొంత జిల్లాలో ఒక కార్పొరేషన్‌.. ఆరు మున్సిపాలిటీలున్నాయి. ఇక్కడ రోజుకు 400 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీనిని డంపింగ్‌ యార్డులకు తరలిస్తుండడంతో చెత్త కొండలు గుట్టలుగా పేరుకుపోతోంది. తడి, పొడి చెత్త సేకరణ అంతంతమాత్రంగానే ఉంది. చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. నెల్లూరు నగరంలో చెత్త తరలింపులో అధికార పార్టీ నేతలు బినామీలను ఏర్పాటు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కార్పొరేషన్‌ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఏడు లక్షలు జనాభా ఉన్న నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. పాలకులు చెబుతున్న స్మార్ట్‌ సిటీ ఇలాగే ఉంటుందేమో! అంటూ ప్రజలు విస్తుపోతున్నారు.  కావలి పట్టణంలోని డంపింగ్‌ యార్డును మోర్లవారిపాళెంకు తరలించారు. రెండేళ్లుగా చెత్త పేరుకుపోతూనే ఉంది. దుర్వాసన వస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ వాహనాలు మరమ్మతులైనా పాలకులు పట్టించుకోవడంలేదు. నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో డంపింగ్‌ యార్డులే లేవు. రహదారుల పక్కనే చెత్తను తరలిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

నాయుడుపేటలో స్వర్ణముఖినది సైతం కంపోస్టు యార్డుగా మారిపోతోంది. చిట్టమూరు మండలంలో మూడు ఎకరాల్లో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. గూడూరు పట్టణంలో రోజుకు 28 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అయితే ఇష్టానుసారంగా డంప్‌ చేస్తున్నారు. వెంకటగిరి పట్టణంలో చెత్తసేకరణ గ్రామాల కంటే దారుణంగా తయారైంది. ప్రధాన వీధుల్లో మినహా మిగతా ప్రాంతాల్లో మూడు రోజులకోసారి చెత్తను సేకరిస్తున్నారు. పట్టణంలో ఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన డంపింగ్‌ యార్డుకు ప్రహరీ లేకపోవడంతో గాలికి చెత్త సమీప పొలాల్లో పేరుకుపోతోంది. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఆరేళ్ల క్రితం సీ గ్రేడ్‌ మున్సిపాలిటీగా మారిన ఆత్మకూరులో చెత్త సేకరణ ఆరంభశూరత్వంగా మారింది. రెండునెలల పాటు చెత్తను తరలించారు. ఆ తర్వాత అంతంతమాత్రంగానే సేకరణ జరుగుతోంది. పట్టణంలోని చెత్తను శివారు ప్రాంతాలకు తరలిస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజల అవస్థలు వర్ణనాతీతం.

 చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెత్తతో విద్యుత్‌ తయారీకి అనుమతులిచ్చింది. దేశవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వీటిని ఏర్పాచేస్తున్నట్టు ప్రకటించింది. అందులో నెల్లూరు నగరం కూడా ఉంది. అప్పటి నెల్లూరు కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి ఓ ప్రైవేట్‌ సంస్థతో ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందాలు జరిగాయి. నెల్లూరు నగరంతోపాటు కావలి, గూడూరు మున్సిపాలిటీల్లో ప్రతి రోజూ చెత్తను తరలించి తద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి చేయాలని నిర్ణయించారు. దీంతో కొన్నేళ్లుగా చెత్త సమస్యకు విముక్తి కలిగిందని ప్రజలు భావించారు. అయితే ఇప్పటికీ ఆ ఊసేలేదు.

కంపోస్టు యార్డుగా స్వర్ణముఖి
నాయుడుపేట పట్టణ సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా వ్యర్థాలను పడేస్తుండటంతో కంపోస్టు యార్డుగా తయారైంది. నదిపై ఉన్న కాజ్‌వేపై నుంచి వాహనాల్లో చెత్త నిల్వలు, భవనాలకు సంబంధించిన వ్యర్థాలను నదిలో వేస్తుండడంతో స్వర్ణముఖి నది రోజురోజుకూ రూపుకోల్పోతోంది. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ కంపోస్టు యార్డు లేకపోవడంతో పట్టణవాసులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి లారీల్లో వ్యర్థాలను నదిలో పడేస్తున్నారు. అధికారులు కూడా పట్టించుకున్న దాఖలాల్లేవు.– నాయుడుపేట టౌన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement