వెన్నుపోటే! | TDP Leaders Disagreement With Misnister narayana | Sakshi
Sakshi News home page

వెన్నుపోటే!

Published Wed, Oct 3 2018 1:43 PM | Last Updated on Wed, Oct 3 2018 1:43 PM

TDP Leaders Disagreement With Misnister narayana - Sakshi

నగర టీడీపీలో నలుగురు నేతలు.. ఆ నలుగురివీ సొంత అజెండాలు.. లాబీయింగ్‌లు.. రాజకీయ పైరవీలు.. కానీ ఆ నలుగురు నేతలు మాత్రం నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఉంటే ఆయన వెంటే ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారు పరోక్షంగా మంత్రి నారాయణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వ్యక్తిగత అజెండాతో ముందుకుసాగుతున్నారు. ఆ నలుగురికి నగర టీడీపీ టికెట్‌ కావాలి. అందరికీ దీనికి సంబంధించి రకరకాల హామీలు కూడా ఉన్నాయి.

ఈ క్రమంలో అందరూ మంత్రి నారాయణ అభ్యర్థిత్వాన్ని తెరపైన ఆమోదిస్తున్నట్లు కనిపిస్తున్నా తెర వెనుక మాత్రం తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు సహకరించడంపై ఇప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి. పర్యవసానంగా మంత్రి నారాయణకు సొంత పార్టీలోనే వెన్నుపోట్లు తప్పవనే ప్రచారం పార్టీలో బలంగా సాగుతోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర టికెట్‌ విషయాన్ని పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బరిలో ఎవరిని దింపాలన్న విషయంలో నాలుగు నెలల క్రితం వరకూ అయోమయంగా ఉన్న అధిష్టానంలో ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో నగర టీడీపీ అభ్యర్థిగా మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ బరిలో ఉంటారని ఆ పార్టీలో బలంగా ప్రచారం సాగుతోంది.  మంత్రి నారాయణ సైతం తన అభ్యర్థిత్వం ఖరారు అయిందనే సంకేతాలు పార్టీ శ్రేణులకు ఇవ్వడంతోపాటు ముఖ్యులకు తానే పోటీ చేస్తున్నానని చెప్పి ఆ మేరకు పనుల్లో మంత్రి నారాయణ బిజీగా ఉన్నారు. అయితే మంత్రినారాయణ కోటరీలో కీలక నేతలుగా ఉన్న టీడీపీ నగర ఇన్‌చార్జ్‌ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్, నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ ఈ టికెట్‌పైనే ఆశలు పెంచుకున్నారు. నాలుగు నెలల క్రితం వరకు మంత్రి ద్వారానే లాబీయింగ్‌ పర్వం నిర్వహించారు. మంత్రి కూడా అందరికీ టికెట్‌ ఇప్పిస్తాననే హామీతో వారిని ఇప్పటివరకు తనతో తిప్పుకోవడంతోపాటు ఆర్థికంగా కూడా కొందరికి లబ్ధి చేకూర్చారు. ఈ పరిణామాల క్రమంలో నలుగురు నేతల ఆశలు అడియాశలయ్యేలా టికెట్‌ ఇప్పిస్తానన్న గాఢ్‌ ఫాదర్‌ నేరుగా బరిలో నిలవనుండడంతో వారు వ్యక్తిగత అజెండాతో ముందుకుసాగుతున్నారు. సొంత లాబీయింగ్‌పై దృష్టి సారించడంతోపాటు మంత్రి నెల్లూరు నగరంలో తమ సహకారం లేకుండా ఎలా గెలుస్తారో చూద్దాం అంటూ తమ వర్గీయుల వద్ద బహిరంగంగానే వాఖ్యానిస్తుండడం ఆ పార్టీలో కలకలం రేపింది. దీనికితోడు మంత్రి నగరంలో లేని సందర్భంలో నలుగురు నేతలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం.

కచ్చితంగా టిక్కెట్‌ వస్తుందనే ఆశ
2014 ఎన్నికల్లో టీడీపీ నగర అభ్యర్థిగా ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో మంత్రి నారాయణ ముంగమూరుకు రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో కొన్ని కాంట్రాక్ట్‌ పనులు, అలాగే నెల్లూరు నగరంలోనూ పలు పనులు కేటాయించారు. పనుల విలువ వందల కోట్లలో ఉంది. అలాగే ఇప్పుడు తాజాగా మళ్లీ భారీగా పనులు శ్రీధరకృష్ణారెడ్డికి అప్పగించనున్నారు. ఈక్రమంలో శ్రీధరకృష్ణారెడ్డి తనకు సహకరించాలనేది మంత్రి షరతుగా తెలుస్తోంది. అయితే అన్ని చోట్ల ఇన్‌చార్జ్‌లకు దక్కిన విధంగానే తనకు పనులు దక్కాయే తప్ప కొత్తగా ఏమీ రాలేదని, 2014 నుంచి నగరంలో పార్టీ అభ్యున్నతి కోసం తాను పనిచేస్తున్నానని, తనకు కచ్చితంగా టికెట్‌ వస్తుందని ముంగమూరు భరోసాతో ఉన్నారు.

మేయర్‌ ధీమా
నెల్లూరు నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ టికెట్‌ హామీతోనే మంత్రి నారాయణ ద్వారా వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈక్రమంలో ముస్లిం కోటాలో తనకు టికెట్‌ వస్తుందని ధీమాతో ఉన్నారు.  
అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో మంత్రికి, అబ్దుల్‌ అజీజ్‌కు మధ్య దూరం పెరిగింది. రొట్టెల పండగ కార్యక్రమం కోసం నగరపాలక సంస్థ నుంచి నిధులు కేటాయించడంతోపాటు అన్నీ తానై 20 రోజులపాటు అక్కడే ఉండి పనులు చూసుకున్నారు. చివరికి అన్ని పనులు మంత్రి నారాయణ చేశారని భారీగా పత్రికా ప్రకటనలు గుప్పించడంతో అబ్దుల్‌ అజీజ్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు లోకేష్‌ తనకు హామీ ఇచ్చారని టికెట్‌ తప్పక వస్తుందని ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది.

నుడా చైర్మన్‌కు బాలకృష్ణ ఆశీస్సులు!
నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనకు బాలకృష్ణ ఆశీస్సులు ఉన్నాయని, తప్పక అవకాశం వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే తాళ్లపాక అనురాధ తనకు మహిళా కోటాలో టికెట్‌ వస్తుందని భరోసాతో ఉన్నారు. ఈక్రమంలో మంత్రి కోటరీ నేతలంతా అభ్యర్థులే అయితే మంత్రి కోసం నగరంలో పనిచేసేదెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement