టీడీపీ కార్యాలయంలో ముస్లింల ఆందోళన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో టికెట్ల చిచ్చు రేగింది. ప్రధానంగా టికెట్ ఆశిస్తున్న కీలక నేతలు, జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న నేతలు తీవ్రంగా నిరసన గళం విప్పుతున్నారు. ప్రధానంగా నెల్లూరురూరల్ నుంచి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు నగరం నుంచి మంత్రి పి.నారాయణ, సర్వేపల్లి నుంచి మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించిందని జిల్లాలో ముఖ్యులు అధికారికంగా ప్రకటించుకోవటంతో కొత్తు చిచ్చు రేగింది. నెల్లూరు నగర, రూరల్ సీటుపై ఆశలు పెంచుకున్న నగర మేయర్ అబ్ధుల్ అజీజ్‌కు మద్దతుగా ముస్లింలు రంగంలోకి దిగగా, మరోవైపు నెల్లూరు రూరల్ టికెట్ హామీతో పనిచేస్తున్న ఆనం జయకుమార్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అది కూడా శనివారం జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన జరగనున్న క్రమంలో రాజకీయ అలజడి రేగడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అధికార పార్టీ పూర్తిస్థాయిలో వేడెక్కింది. గురువారం మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర సీఎంను కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకరరెడ్డి, సర్వేపల్లి నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిల అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఆదాల నివాసంలో మంత్రి నారాయణ, ఆదాల, బీద కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటించుకోవడంతో పార్టీలో అసమ్మతి సెగలు రేగాయి. ప్రధానంగా ఆదాల శిబిరంలో కీలక నేతగా ఉన్న ఆనం జయకుమార్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సమాచారం తెలుసుకోవడానికి ఆదాల నివాసానికి వచ్చిన క్రమంలో సమావేశం నిర్వహించి ప్రకటించుకోవటంతో మనస్థాపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దివంగత ఆనం వివేకానందరెడ్డి సోదరుడు ఆనం జయకుమార్ టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. గతేడాది నుంచి నగర టీడీపీ అధ్యక్ష పగ్గాలు ఇస్తామని స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. దీంతో పార్టీలో ప్రధానంగా ఆదాల క్యాంపులో కీలకంగా పనిచేస్తూ ఆయన్ను బలపర్చారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారు రూరల్ టికెట్ నీకే ఇస్తామని మంత్రి నారాయణ మాజీ మంత్రి ఆదాల నివాసంలో కొన్ని నెలల క్రితం చెప్పడంతో జయకుమార్ రూరల్‌లో క్రియాశీలకంగా పనిచేశారు.
ఆనం కుటుంబానికి రూరల్ నియోజకవర్గంలో ఉన్న వర్గాన్ని కూడగట్టి ఎన్నికలకు సన్నాహాలుగా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆదాల తాను పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని గతంలో స్వయంగా ప్రకటించుకున్నారు. ఆ దిశగానే చంద్రబాబు నాయుడిని అనేక మార్లు కలిసి నియోజకవర్గాల వ్యవహారాలపై చర్చించారు. దీంతో అందరూ పార్లమెంట్‌కే అని భావించిన క్రమంలో ఆదాల తన నిర్ణయం మార్చుకోని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించటంతో పొలిటికల్ హీట్ రేగింది. మరో వైపు నగరంలో మైనార్టీలు కూడా తీవ్ర అసమ్మతి గళం విప్పారు. నగర మేయర్ అబ్ధుల్ అజీజ్ మేయర్‌గా వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందాడు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ టికోటు ఇస్తామని మంత్రి నారాయణ హామీ ఇవ్వడంతో టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు అజీజ్‌కు కూడా టీడీపీ మొండిచెయ్యి చూపింది. అజీజ్ నెల్లూరు సిటీ, లేదంటే రూరల్‌లో ఒక సీటు వస్తుందనే ధీమాతో ఉండి ఆ దిశగా హడావుడి చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ కూడా టికెట్ మీకే ఇస్తామని హామీ ఇచ్చారు. చివరకు నగర, రూరల్ అభ్యర్థుల్ని ప్రకటించటంతో నైరాశ్యంలో పడిపోయారు. దీంతో శుక్రవారం నగరంలో మైనార్టీ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న తమకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని లేని పక్షంలో టీడీపీకి గట్టిగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శనివారం సీఎం పర్యటన జరగనున్న క్రమంలో పొలిటికల్ హీట్ రేగడం చర్చగా మారింది.
మేయర్‌పై బీద ఆగ్రహం
నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌కు నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు శుక్రవారం రాత్రి నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మంత్రులు, సీనియర్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర ఈ విషయంలో చర్చిద్దామని వారిని లోపలికి పిలిచారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అజీజ్‌ను బీద తిట్టినట్లు తెలిసింది. దీంతో మేయర్ మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం పార్టీలో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment