మంత్రి నారాయణ మొండివైఖరి | sanitation workers Strike in PSR Nellore | Sakshi
Sakshi News home page

మంత్రి నారాయణ మొండివైఖరి

Published Mon, Sep 10 2018 12:24 PM | Last Updated on Mon, Sep 10 2018 12:24 PM

sanitation workers Strike in PSR Nellore - Sakshi

బీవీనగర్, పొగతోటలో పేరుకుపోయిన చెత్తాచెదారాలు

నెల్లూరు సిటీ: మంత్రి నారాయణ మొండివైఖరితో పారిశుధ్య కార్మికులు సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. 27 రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో నగరం చెత్తాచెదారాలతో నిండిపోయింది. ఈ క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌తో మేయర్‌ అజీజ్‌ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. సోమిరెడ్డి తన నివాసంలో కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపినా, మేయర్‌ అజీజ్‌ మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడినా ఫలితం లేకుండాపోయింది. 279 జీఓపై మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ మెట్టుదిగకపోవడం.. అటు కార్మిక సంఘాలు సైతం సమ్మె విరమించేదిలేదని తేల్చిచెప్పడంతో  ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.

సమస్య జఠిలం
కార్పొరేషన్‌ పరిధిలో 877 మంది పారిశుధ్య కార్మికులు సొసైటీ కింద, 260 మంది కాంట్రాక్టర్‌ కింద, 350 మంది పర్మనెంట్‌ పద్ధతిలో ఉన్నారు. సొసైటీ కార్మికులను 279 జీఓలో ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ కింద పనిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత నెల 14 నుంచి కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. రోజూ 350 మెట్రిక్‌ టన్నుల చెత్తాచెదారాలు నగరంలో ఉత్పత్తవుతాయి. 27 రోజులుగా 9500 మెట్రిక్‌ టన్నుల చెత్తలో కార్పొరేషన్‌ అధికారులు అక్కడక్కడా 20 శాతాన్నే తొలగించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది.

రెండు దఫాల చర్చలు విఫలం
కౌన్సిల్‌ సమావేశం అనంతరం మేయర్‌ శనివారం కార్మిక సంఘ నాయకులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో సమ్మె విరమణపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో కార్మిక సంఘాలు మేయర్‌ ఇచ్చిన ముందస్తు అనుమతులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే మేయర్‌ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని, తాత్కాలికంగా 279 జీఓను అమలు చేయమని చెప్పారు. అయితే అనుమతులను వెనక్కి తీసుకుంటనే సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘ నాయకులు తేల్చిచెప్పారు. అనంతరం మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడారు. 279 జీఓపై వెనక్కి తగ్గేదిలేదని, అవసరమైతే పోలీసుల బందోబస్తు మధ్య ప్రైవేట్‌ వ్యక్తులతో పనులు చేయిద్దామని మేయర్‌కు మంత్రి చెప్పినట్లు సమాచారం. అనంతరం శనివారం రాత్రి సోమిరెడ్డి నివాసంలో కార్మిక సంఘ నాయకులతో మరో ధఫా ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే సోమిరెడ్డి నుంచి కూడా సానుకూల సమాధానం రాకపోవడంతో కార్మిక సంఘాలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మంత్రి నారాయణ నిర్ణయమే ఫైనల్‌
మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ నిర్ణయమే ఫైనల్‌ అని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మేయర్, మంత్రి సోమిరెడ్డి చర్చలు జరిపినా ఫలితం ఉండదని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. మంత్రి నారాయణ మాత్రం కార్మిక సంఘాల డిమాండ్లకు వెనక్కి తగ్గడం లేదు. జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలెవరూ సొంత నిర్ణయం ప్రకటించలేకపోతున్నారు. మంత్రి నారాయణతో మేయర్‌ ఫోన్లో మాట్లాడిన సమయంలో 279 జీఓను అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. మరోవైపు మంత్రి నారాయణ నెల్లూరులో రెండు, మూడు రోజులు ఉండి వెళ్లిపోతారని, తాము నగరంలో ఎలా తిరగాలని టీడీపీలోని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులతో మాట్లాడకుండా ఇలా మొండిగా వ్యవహరిస్తే తామే నష్టపోతామని గుసగుసలాడుతున్నారు.

వీరి పంతాలతో ప్రజలకే ఇబ్బందులు
ఓ వైపు కార్మికులు తమ పొట్టగొట్టద్దని సమ్మె చేస్తుంటే.. మంత్రి నారాయణ మొండివైఖరి కారణంగా నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో వినాయకచవితి పండగను ఎలా చేసుకోవాలని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన కూడళ్లు, వీధుల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న సమయంలో చెత్తాచెదారాలతో ఇబ్బందులు పడతామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

కార్పొరేషన్‌ వ్యవస్థనుప్రైవేటీకరించేందుకే:   
కార్పొరేషన్‌ వ్యవస్థను ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. 279 జీఓ అమలైతే భవిష్యత్తులో పన్నుల భారం ప్రజలపై భారీగా పడనుంది. ప్రజలు కూడా కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నారు.
– కత్తి శ్రీనివాసులు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌

గౌరవాధ్యక్షుడుమంత్రి పట్టించుకోకపోవడందారుణం:
కార్మికులు 27 రోజులుగా సమ్మె చేస్తున్నా, మంత్రి నారాయణ, అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడం దారుణం. 279 జీఓకు సంబంధించి మేయర్‌ అజీజ్‌ ఇచ్చిన ముందస్తు అనుమతులను తాత్కాలికంగా వెనక్కి తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.   – రూప్‌కుమార్‌యాదవ్, వైఎస్సార్సీపీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement