సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో నేతల మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ముఖ్యులతో చెప్పిన రోజు నుంచి మొదలైన వర్గ విభేదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తనకు ఎవరూ పోటీ రాకూడదని అందరినీ దూరంగా పెడుతున్న పరిస్థితి రాజకీయ దుమారం రేపుతోంది. మంత్రి రాక ముందు వరకు నగర టికెట్‌పై మేయర్ అబ్దుల్ అజీజ్‌తో సహా అనేక మంది నేతలు ఆశలు పెంచుకున్నారు. పరిస్థితి రివర్స్ కావడంతో నేతల అంతర్గత సమావేశాల్లోనూ మంత్రి తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. తాజాగా నగర ప్రథమ పౌరుడు మేయర్ అబ్దుల్ అజీజ్ ఫొటో లేకుండా రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర దూమారం రేగింది. నగరంలో ఉన్న ఏకైక మైనార్టీ నేతను నన్నే అవమానిస్తారా? అంటూ అక్కడే మేయర్ అసంతృప్తి వ్యక్తం చేయడం, వెంటనే ముస్లిం మతపెద్దలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
నగరంలో మంత్రి నారాయణ అధికార పార్టీ సిటీ అభ్యర్థిగా బరిలో వస్తాడనే ప్రచారం మొదలైనప్పటి నుంచి నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అంతకు ముందు వరకు టికెట్ ఆశిస్తున్న నేతలు తమ గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్న నారాయణ ద్వారా తమకు టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటూ నగరంలో అధికార పార్టీ నేతలుగా చలామణి అయ్యారు. నగర మేయర్‌గా అబ్దుల్ అజీజ్ వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన వ్యక్తి. కొద్ది రోజులకే మంత్రి నారాయణ, సీఎం తనయుడు లోకేష్ సిటీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో అధికార పార్టీలోకి జంప్ చేశారు. అజీజ్‌తో పాటు టీడీపీ నగరఇన్‌చార్జి ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధతో పాటు మరి కొందరు నేతలు ఆశలు పెంచుకున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి మంత్రి నారాయణ నగరంలో హడావుడి మొదలు పెట్టారు. పార్టీ ముఖ్యల సమావేశంలో నెట్లూరు సిటీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు నగరంలో ఏ అభివృద్ధి పని జరిగినా నగర మేయర్ హడావుడి అక్కడ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత నుంచి మేయర్ ప్రాధాన్యత తగ్గిపోయి మంత్రి హవా పెరిగిపోయింది. శంకుస్థాపనలు మొదలుకొని అన్ని పనుల వరకు నారాయణ అధికారుల ద్వారా చేయించడంతో నగర మేయర్ పాత్ర పూర్తిగా కనుమరుగైంది. ఈ పరిణామాలను మేయర్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ఫలితం లేకపోవడంతో పాటు నీకే టికెట్ ఇస్తామని మళ్లీ హామీ ఇచ్చారు. దీంతో నగరంలో మంత్రి వర్సెస్ మేయర్‌గా అధికార పార్టీ రాజకీయం కొనసాగుతోంది.
రొట్టెల పండగ మొదలుకొని..
నగరంలో నగరపాలక సంస్థ ప్రత్యేక నిధులు, జనరల్ ఫండ్‌తో నిర్వహించుకునే ప్రతి కార్యక్రమం కూడా మంత్రి తనవల్లే జరిగిందంటూ హడావుడి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బారాషహీద్ రొట్టెల పండగకు ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు మంజూరు చేయలేదు. పండగకు రాష్ట్ర ప్రభుత్వ హోదా ఉన్నప్పటికీ, మంత్రులు నిధులు ఇస్తామని ప్రకటించనప్పటికీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితి. ఈ క్రమంలో నగరపాలకసంస్థ జనరల్ ఫండ్‌లో నుంచి ఖర్చు పెట్టి ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు రోజున అన్ని మంత్రి నారాయణ చేశాడంటూ విస్తృతంగా ప్రచారం హోరెత్తించడంతో మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత నుంచి ఇదే పరంపర కొనసాగుతూ వచ్చింది.
ఇటీవల మటన్ మార్కెట్ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం మధ్యాహ్నం అని ఆహ్వానాలు ముద్రించి ఉదయం మంత్రి ఒక్కరే వచ్చి చేసి వెళ్లిపోయారు. షాదీమంజిల్ వ్యవహారం, జూనియర్ కళాశాలకు జనరల్ ఫండ్ నుంచి రూ.1.5 కోట్లు కేటాయింపులు, నవాబుపేట ఘాట్ అభివృద్ధి ఇలా అన్ని నగరపాలక సంస్థ చేసినా మంత్రి మాత్రం నేనే చేశాను అని చెప్పడం, ఆయన అనుచరగణం మంత్రికి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయండని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నగరంలో నెల్లూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఒక్కదాంట్లో కూడా మేయర్ ఫొటో లేకపోవడం, అది కూడా దర్గా సమీపంలో ఉండడంతో మేయర్ అక్కడ అసంతృప్తి వ్యక్తం చేసి ఇదేమీ పద్ధతి అంటూ అక్కడ ఉన్న నేతలను ప్రశ్నించారు. ఇది నగరంలో చర్చనీయాంశంగా మారడంతో ముస్లిం పెద్దలు మైనార్టీ నేతగా ఉన్న మేయర్‌కు అవమానం జరగడంపై మేయర్ చాంబర్‌లో భేటీ కావడం అధికార పార్టీలో చర్చకు దారి తీసింది. మొత్తం మీద నగరంలో అధికార పార్టీలో వార్ యథావిధిగా కొనసాగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment