‘స్వచ్ఛ’ పురపాలికలు | Garbage dumping yard is currently moving | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ’ పురపాలికలు

Published Fri, Aug 21 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

Garbage dumping yard is currently moving

హన్మకొండ: మున్సిపాలిటీల్లో రోజు పోగవుతున్న చెత్తను ప్రస్తుతం డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అక్కడ చెత్తను మూకుమ్మడిగా తగలబెడుతున్నారు. ఈ విధానం వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలంలో డంప్‌యార్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న జనావాసాలలో దుర్వాసనతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పశువులు, కోళ్లు, పక్షులు తదితర జీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా డంపింగ్ యార్డులపై ఎక్కువగా ఆధారపడకుండా చెత్త వల్ల తలెత్తే సమస్యలకు మెరుగైన పరిష్కార మార్గంగా తడిపొడి చెత్త సేకరణ విధానం అమలుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

జిల్లాలో ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు మహబూబాబాద్, జనగామ మున్సిపాలిటీలు నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగరపంచాయతీలలో తడిపొడి చెత్త సేకరణ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఒక కార్పొరేషన్ ఐదు మున్సిపాలిటీలలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తొలిదశలో 2015 ఆగస్టు 20 నుంచి వరంగల్ కార్పొరేషన్ పరిధిలో కార్మికులకు ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్, ట్రైనింగ్, రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ (ఈపీటీఆర్‌ఐ), హైదరాబాద్
ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
 
రోజుకు వంద మంది వంతున పారిశుద్ధ్య కార్మికులకు తడిపొడి చెత్తసేకరణలో శిక్షణ ఇస్తున్నారు. వరంగల్ నగరంలో శిక్షణ, అవగాహన తరగతులు ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతారుు. వరంగల్ కార్పొరేషన్‌లో శిక్షణ పూర్తై తర్వాత మహబూబాబాద్, జనగామ, పరకాల, నర్సంపేట, భూపాలపల్లిలో  పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈపీటీఆర్‌ఐ ఇంజనీర్ రాహుల్‌రెడ్డి తెలిపారు.

 సమర్థంగా అమలు చేయాలి..
 తడిపొడి చెత్త సేకరణ విధానంలో ఇళ్ల నుంచి నేరుగా చెత్తను సేకరించాలి. వీటితో తడి చెత్తద్వారా కంపోస్టు ఎరువులు, విద్యుదుత్పత్తి ప్లాంట్లను నెలకొల్పాలి. పొడి చెత్త కేటగిరీలోకి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను వేలం పాట ద్వారా అమ్మాలి. ఈ పద్ధతిని సమర్థంగా అమలు చేయడం ద్వారా మున్సిపాలిటీల్లో చెత్త కుండీలు, మురికికుప్పలు తగ్గిపోతాయి. డంపింగ్‌యార్డుల ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కంపోస్టు ఎరువుల అమ్మకం, పొడిచెత్త వేలం పాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని మున్సిపాలిటీ అభివృద్ధి, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చు. తడిపొడి చెత్త సేకరణ విధానంలో వస్తున్న ఆదాయాన్ని గడిచిన పది నెలలుగా తాండూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి వినియోగిస్తున్నారు. వివేక్‌యాదవ్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న కాలంలో గ్రేటర్ పరిధిలో తడిపొడి చెత్త సేకరణ పద్ధతిని సమర్థంగా అమలు చేశారు. జాతీయ స్థారుులో వరంగల్‌కు గుర్తింపు వచ్చింది. సినీనటుడు అమీర్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘సత్యమేవ జయతే’లో వరంగల్‌కు ప్రశంసలు దక్కాయి. వివేక్‌యాదవ్‌బదిలీపై వెళ్లగానే ఈ కార్యక్రమం నిర్వీర్యమైంది.

 చెత్త సేకరణకు కేంద్ర నిధులకు లంకె..
 దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెత్త సేకరణలో మెరుగైన పద్ధతులను అవలంభించే మున్సిపాలిటీలకు ప్రోత్సాహకాలు, అదనపు నిధులు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఆఖరికి స్మార్ట్‌సిటీ, అమృత్ పట్టణాల ఎంపిక  ప్రక్రియలో మెరుగైన చెత్త సేకరణ పద్ధతికి ప్రాధాన్యత ఇచ్చింది.

 తడిపొడి చెత్త విధానం అవలంభిస్తున్న మున్సిపాలిటీలకు స్కోర్ ఇస్తోంది. త్వరలో మున్సిపాలిటీల్లో ఉన్న మురికివాడల రూపు రేఖలు మార్చేందుకు హౌజింగ్ ఫర్ ఆల్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తడిపొడి చెత్త సేకరణ పద్దతిని సమర్థంగా అమలు చేయడం ద్వారా హసింగ్ ఫర్ ఆల్ పథకంలో చోటు సాధించేందుకు ఇతర జిల్లాలకు చెందిన మున్సిపాలిటీలను వెనక్కినెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement