‘మురుగు’పాలిటీలు!
- మున్సిపాలిటీల్లో దిగజారిన పారిశుద్ధ్యం
- ఎక్కడికక్కడ పేరుకుంటున్న చెత్తచెదారం
- సరిపోని పారిశుద్ధ్య కార్మికులు
- డంపింగ్‌యార్డుల్లేక అవస్థలు
- కొత్త పాలకవర్గాలైనా దృష్టి సారించాలి
అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: సుమారు లక్ష జనాభా నివసిస్తున్న అనకాపల్లి పట్టణాన్ని పారిశుద్ధ్య సమస్య పీడిస్తోంది. ఇటీవలే జీవీఎంసీలో విలీనమైనా సమస్య పరిష్కారం కాలేదు. వర్షం కురిస్తే చాలు రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తుంది. పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. కాలువలను రోజూ శుభ్రం చేయకపోవడం వల్ల నీరు నిల్వ ఉండిపోతోంది. దోమల విజృంభణతో వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
సులభ్ కాంప్లెక్స్‌లైతే మరీ అధ్వానం. వాటినసలు పూర్తిగా శుభ్రపరిచిన దాఖలాల్లేవు. ముప్ఫయ్యేళ్ల క్రితం అప్పటి జనాభాకు అనుగుణంగా 256 మంది పారిశుద్ధ్య కార్మికులుండేవారు. ప్రస్తుతం పెరిగిన జనాభాకు కూడా 144 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వాస్తవానికి 162 మంది పారిశుద్ధ్య కార్మికులున్నా 18 మంది డిప్యుటేషన్‌పై వాచ్‌మన్లు, ఆయాలుగా విధులు నిర్వహిస్తున్నారు.
రోజూ కాలువలను శుభ్రపరచరు
కాలువలను రోజూ శుభ్రం చేయడం లేదు. దీనివల్ల దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నాం. వర్షాలు కురిసినప్పుడు కాలువలు పొంగి నీరు రోడ్లపై ప్రవహించడంతో నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
- మొల్లేటి కేశవరావు, గవరపాలెం
శుభ్రతకు నోచని సులాభ్ కాంప్లెక్స్
గవరపాలెం 19వ వార్డులోని సులాభ్ కాంప్లెక్స్‌ను శుభ్రపరిచి నెలలు గడుస్తున్నాయి. ఇక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాం. పట్టించుకునే నాధుడే లేడు.
- దొడ్డి తవుడుబాబు, గవరపాలెం