ఇదేం ‘చెత్త’ రాజకీయం...!
పార్వతీపురం: ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు పట్టణానికి చెందిన పాలకులు ‘చెత్త’ రాజకీయాలకు తెరతీశారు. ఇందుకోసం మున్సిపాల్టీ చెత్త డంపింగ్ యార్డును వాడుకుంటున్నారు. పార్వతీపురం మున్సిపాల్టీలో రోజువారీ తయారైన చెత్త పారబోసే డంపింగ్‌యార్డు వ్యవహారంలో పాలకులు రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. నిన్న, మొన్నటివరకు లక్షలాది రూపాయలు వెచ్చించి మరికి గ్రామం వద్ద డంపింగ్ యార్డు తయారు చేసిన అధికారులు ఇపుడు టీడీపీ కీలక నేత వద్దన్నారని నర్సిపురం వైపు దృష్టిసారించారు. దీంతో పార్వతీపురం మున్సిపాల్టీ చెత్త మాకా...? అంటూ నర్సిపురం గ్రామస్తులు వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మున్సిపాలిటీ మున్సిపల్ వనరుల పార్కు (కంపోస్ట్ డంపింగ్‌యార్డు) వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.
ఇదిలా ఉండగా రాయగడ రోడ్డులోని డంపింగ్‌యార్డు స్థలం చాలకపోవడంతో చెత్త రోడ్డుమీదకు వస్తోంది. దీంతో డంపింగ్‌యార్డు సమస్య ఎప్పటికి తీరుతుందోనని పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మండలంలోని చినమరికి వద్ద సుమారు రూ.64లక్షలతో పనులు ప్రారంభించిన కంపోస్ట్ డంపింగ్‌యార్డు దశాబ్దకాలాన్ని హరిస్తోంది తప్ప ముందుకు కదలడం లేదు. మొదట్లో స్థలం చిక్కుతో ముందుకు కదలని వ్యవహారాని రెవెన్యూ యంత్రాంగం సుమారు 8 ఎకరాల స్థలాన్ని అప్పగించింది. అయితే పనులు ప్రారంభించిన నాటి నుంచి పార్వతీపురం చెత్త మా గ్రామాలకా..? అంటూ చినమరికి, పెదమరికి గ్రామాలకు చెందిన ప్రజలు అభ్యంతరం చెబుతుం డడమే కాకుండా పలుమార్లు ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను అడ్డుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఈ డంపింగ్‌యార్డు వద్ద వర్మీ కంపోస్ట్, వ్యర్థ పదార్థాల విభజన, రీ-సైక్లింగ్ వంటివి ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
అయినప్పటికీ ఇప్పటికీ అవి అమలు నోచుకోలేదు. ప్రస్తుతం పట్టణం శివారున రాయగడ రోడ్డులోని శివిని దారిలో ఉన్న డంపింగ్‌యార్డులో స్థలం చాలకపోవడంతో చెత్తను రోడ్డుపై వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. అంతే కాకుండా ఈ చెత్త నుండి వచ్చే దుర్గాంధానికి సమీపంలోని జట్టు ఆశ్రమంతో పాటు వివేకానంద కాలనీ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ నుంచి డంపింగ్‌యార్డు మార్చేందుకు చినమరికి వద్ద అవాంతరాలు రావడంతో గతంలో ఇక్కడ వర్మీ కంపోస్ట్ షెడ్ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించారు. దీని కోసం రూ.3లక్షలు ఖర్చుచేసి పనులు కూడా చేపట్టారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆ నిధులు వృథా అయ్యాయి. ఇక చినమరికి వద్ద కూడా చాలా మేరకు పనులు కూడా చేపట్టారు. అక్కడ కూడా ఖర్చు చేసిన నిధులు వృథాగానే పడిఉన్నాయి. ఇటు నిధులు మిగలక, డంపింగ్ యార్డు అందుబాటులోకి రాక చెత్త డంపింగ్‌యార్డు కోసం మున్సిపాలిటీ అవస్థలు పడుతోంది.
నాయకుల ‘చెత్త’ గేమ్...
ఇదిలా ఉండగా మరో రూ.70లక్షలతో ఇప్పుడు నర్శిపురం వద్ద డంపింగ్‌యార్డు పనులకు అధికారులు, పాలకులు సన్నద్ధమవుతున్నారు. అయితే మరికి వద్ద ఇప్పటి వరకు వెచ్చించిన వ్యయం మాటేమిటని పట్టణ ప్రజలంటున్నారు. ఇప్పుడు నర్శింపురం ప్రజలు వద్దంటే అస్సలు పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.