న్యాయమైన ధర చెల్లించాలంటున్న మూలలంక రైతులు
ఈ ఫొటోలో మొక్కజొన్న తోట వద్ద నిలబడి ఉన్న రైతు పేరు అడబాల పద్మారావు.ఊరు పోలవరం. మూలలంక ప్రాంతంలో ఇతని పేరుతో 47 సెంట్లు, ఇతని భార్య కుమారి పేరుతో 50 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిపైనే ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ భూమి మొత్తం పోలవరం డంపింగ్‌యార్డ్ కోసం ప్రభుత్వం సేకరిస్తోంది. ఇతనికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయాలి. భూమిని ప్రభుత్వం తీసుకుంటే కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థం కావటంలేదని పద్మారావు ఆవేదన చెందుతున్నారు.
పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అవసరమైన డంపింగ్ యార్డు కోసం రైతుల నుంచి భూములు సేకరించే విషయంలో ప్రభుత్వ తీరు ఆందోళనకరంగా ఉంది. భూములు కలిగిన రైతులతో చర్చలు జరపకుండా, ఎంత నష్టపరిహారం ఇస్తారో తేల్చకుండా ఏకపక్షంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (డీఎన్) ప్రటించటం, నోటీసులు జారీ చేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బలవంతంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన ధర చెల్లించకపోతే భూములు ఇచ్చేదిలేదని చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు డంపింగ్‌యార్డ్ కోసం పోలవరం గ్రామంలోని మూలలంక ప్రాంతంలో 2016లో ప్రభుత్వం భూములు సేకరించింది. రెండో విడతగా ఈ ఏడాది మరికొన్ని భూములు సేకరించేందుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భూములు సేకరిస్తున్నామని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె.మోహన్‌కుమార్ చెప్పటం మినహా, రైతులతో రేటు విషయంలో ఏ విధమైన చర్చలు జరపలేదు. ఆందోళనకు గురైన రైతులు ఇటీవల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తమ భూములకు న్యాయమైన ధర ఇప్పించాలని కోరారు. సీఎం జిల్లా కలెక్టర్ భాస్కర్‌ను అడగ్గా పట్టిసీమ ఎత్తిపోతల పథకం భూములకు ఇచ్చిన ధర ఇస్తామంటూ స్పష్టం చేశారు. పట్టిసీమ భూములకు మూడేళ్ల కిందట ఎకరానికి రూ.19.53 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించారు. అప్పుడు ఇచ్చిన రేటే ఇప్పుడు కూడా చెల్లిస్తామని చెప్పటం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతగా డంపింగ్ యార్డ్ కోసం 52 మంది రైతులకు సంబంధించి 88 ఎకరాల భూములు సేకరించేందుకు ఆర్డీఓ మోహన్‌కుమార్ ఇటీవల రైతులకు నోటీసులు జారీ చేశారు.
అయితే ఈ నోటీసులను చాలా మంది రైతులు తీసుకోలేదు. మీ భూములకు ఎకరానికి రూ.15.39 లక్షలు రేటు నిర్ణయించామని, నోటీసు అందిన మూడు రోజుల్లోగా బ్యాంకు ఖాతా నంబర్‌తో పాటు ఆధార్‌కార్డు జిరాక్స్‌ను జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో దాఖలు చేయాలని పేర్కొన్నారు. లేకుంటే నష్టపరిహారం సొమ్ము రైతుల ఖాతాకు జమచేయటం వీలు పడదని పేర్కొన్నారు. పత్రాలు దాఖలు చేయకపోతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. భూములు కలిగిన రైతులతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా భూములు సేకరించేందుకు చర్యలు చేపట్టటం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం వేల కోట్లు పెరుగుతున్నా, తమకు మాత్రం న్యాయం జరగటంలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి, పోలవరం డంపింగ్ యార్డ్‌కు, నిర్వాసితుల పునరావాసానికి, పోలవరం కుడి ప్రధాన కాలువకు భూములు ఇచ్చామని ఇక సాగు చేసుకునేందుకు కూడా భూమిలేని పరిస్థితి ఏర్పడిందని విలవిల లాడుతున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి, పోలవరం కుడి కాలువకు పెదవేగి, నూజివీడు, బాపులపాడు మండలాల్లో భూములకు చెల్లించిన ధర తమకు కూడా చెల్లించాలని కోరుతున్నారు. భూములు మొత్తం కోల్పోతున్నందున అవసరమైతే మిగిలిన ప్రాంతాల్లో ఇచ్చిన విధంగా జీఓ ఇచ్చి ఎకరానికి రూ.30 లక్షలు నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని రైతులు మిరియాల నాగమణి, ఓడపాటి సత్యన్నారాయణ, పంతులు గంగరాజు తదితరులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment