అమావాస్య చీకట్లే
- ఈసారి దీపావళి లేనట్టే..
- బాణసంచా విక్రయాలపై నిషేధం
- అప్రమత్తం కాకుంటే మరో ‘అగ్ని’తుపాను
- విరిగిన చెట్లతో పొంచిఉన్న పెనుముప్పు
విశాఖ రూరల్: దీపావళి ఆనందాన్ని హుదూద్ దూరం చేసింది. అంతేకాదు మేలుకోకపోతే మరింత ప్రమాదం పొంచి ఉంది. తుపాను వల్ల ఎక్కడ చూసిన మోడు వారిన చెట్లు, ఎండిన మానులుదర్శనమిస్తున్నాయి. ఏ చిన్న నిప్పు వీటికి అంటుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది. తుపానుకు మించిన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. బాణా సంచాకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేశారు. బాణసంచా అమ్మకాలను సైతం నిషేదించారు.
తొలిసారిగా దీపావళికి దూరంగా ఉండాలంటూ ప్రభుత్వం ప్రకటించిం దంటే ఎంత ప్రమాదం పొంచి ఉందో అర్ధం చేసుకోవచ్చు. తుపాను ధాటికి జిల్లాలో చెట్లన్నీ నేలకొరిగాయి. ఆరు రోజులుగా వాటి తొలగింపు ప్రక్రియను చేపడుతున్నా కనీసం 50 శాతం కూడా పూర్తి కాలేదు. విశాఖ శివారులో ఉన్న డంపింగ్‌యార్డుకు ఇప్పటి వరకు 500 మెట్రిక్ టన్నుల వ్యర్ధాన్ని తరలించినప్పటికీ.. ఇంకా పదింతలు రోడ్లమీదే ఉంది.
నిర్జీవ వృక్షాలకు ప్రూనింగ్ చేసిన నాలుగు సంవత్సరాలకు తిరిగి పచ్చదనంతో కళకళలాడుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బాణాసంచా కారణంగా ఏ చెట్టుకు నిప్పు అంటుకున్నా మంటలు దావానంలా వ్యాపిస్తాయి. నీటి కొరత నేపథ్యంలో వాటిని అదుపు చేయడంఅసాధ్యమైన పనే. ఈ నేపథ్యంలో జిల్లాలో బాణ సంచా అమ్మకాలపై నిషేదాజ్ఞలు విధించింది.